క్రీడాభూమి

వింబుల్డన్ ఫైనల్‌లో అక్కా, చెల్లెలి పోరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 5: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అమెరికా టాప్ సీడ్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌తో పాటు ఆమె సోదరి వీనస్ విలియమ్స్ సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు. దీంతో వీరిద్దరి మధ్య ఫైనల్ పోరు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్న సెరెనా విలియమ్స్ మంగళవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో రష్యాకు చెందిన 21వ సీడ్ క్రీడాకారిణి అనస్తాసియా పవ్లిచెన్కొవాను వరుస సెట్ల తేడాతో మట్టికరిపించింది. మ్యాచ్ ఆరంభం నుంచే తనదైన శైలిలో పవర్‌ఫుల్ షాట్లతో విజృంభించిన సెరెనా విలియమ్స్ 6-2, 6-2 తేడాతో సునాయాసంగా విజయం సాధించింది. గతంలో జర్మనీకి చెందిన ప్రపంచ మాజీ నెంబర్ వన్ క్రీడాకారిణి స్ట్ఫెగ్రాఫ్ 22 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లతో నెలకొల్పిన రికార్డును సమం చేయాలని ఉవ్విళ్లూరుతున్న సెరెనా విలియమ్స్ ప్రస్తుతం ఆ లక్ష్య సాధనకు మరో రెండు అడుగుల దూరంలో నిలిచింది. వింబుల్డన్‌లో ఇంతకుముందు ఆరుసార్లు టైటిళ్లు సాధించిన సెరెనా విలియమ్స్ సెమీ ఫైనల్‌లో రష్యాకు చెందిన అన్‌సీడెడ్ క్రీడాకారిణి ఎలెనా వెస్నినాతో తలపడనుంది. మహిళల సింగిల్స్ విభాగంలో జరిగిన మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో వెస్నినా 6-2, 6-2 తేడాతో స్లొవేకియా క్రీడాకారిణి డొమినికా సిబుల్కోవాపై సంచలన విజయం సాధించి సెమీఫైనల్స్‌లో ప్రవేశించింది. దీంతో శనివారం వివాహం చేసుకోబోతున్న సిబుల్కోవాకు నిరాశ తప్పలేదు.
కాగా, వింబుల్డన్‌లో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన అమెరికా వెటరన్ క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ (36) కూడా సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నమెంట్‌లో 8వ సీడ్‌గా బరిలోకి దిగిన వీనస్ విలియమ్స్ బుధవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో 7-6, 6-2 తేడాతో కజకిస్థాన్‌కు చెందిన ప్రపంచ 96వ ర్యాంకు క్రీడాకారిణి యారోస్లావా స్వెదోవాపై విజయం సాధించింది. ఈ టోర్నీలో వీనస్ సెమీఫైనల్స్‌కు చేరడం గత ఏడేళ్లలో ఇదే తొలిసారి. సెమీస్‌లో ఆమె ఆస్ట్రేలియా ఓపెన్ చాంపియన్ ఏంజెలిక్ కెర్బర్ (జర్మనీ)తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీలో 4వ సీడ్‌గా బరిలోకి దిగిన కెర్బర్ మహిళల సింగిల్స్ విభాగంలో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రొమేనియాకు చెందిన 5వ సీడ్ క్రీడాకారిణి సిమోనా హాలెప్‌పై 7-5, 7-6 తేడాతో విజయం సాధించింది.