క్రీడాభూమి

పురుషుల సింగిల్స్ విజేత ఎవరో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 9: పురుషుల సింగిల్స్‌లో విజేత ఎవరన్నది ఆసక్తిని రేపుతోంది. బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రే, కెనడాకు చెందిన మిలోస్ రవోనిక్ ఫైనల్ చేరడంతో, ఫలితం ఎవరికి అనుకూలంగా ఉంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. కెనడా తరఫున ఒక గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నీలో మొట్టమొదటిసారి ఫైనల్ చేరిన రవోనిక్ సెమీఫైనల్‌లో సీనియర్ ఆటగాడు రోజర్ ఫెదరర్‌ను 6-3, 6-7, 4-6, 7-5, 6-3 తేడాతో ఓడించి సంచలనం సృష్టించాడు. కెరీర్‌లో 18వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సాధించాలన్న ఫెదరర్ ఆశలకు గండికొట్టాడు. అంతేగాక, 2014 వింబుల్డన్ సెమీఫైనల్‌లో ఫెదరర్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ విజయం కెనడాలో ఎక్కువ మంది టెన్నిస్‌ను ప్రొఫెషన్‌గా తీసుకోవడానికి స్ఫూర్తినిస్తుందని అంటున్న రవోనిక్ టైటిల్ సాధించడమే తన లక్ష్యమని స్పష్టం చేస్తున్నాడు. అయితే, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న మాజీ చాంపియన్ ముర్రేను అతను ఓడిస్తాడా లేక అతని ప్రతిభ ముందు తల వంచుతాడా అన్నది చూడాలి.
బ్రిటిష్ టెన్నిస్ సూపర్ స్టార్స్‌లో ఒకడిగా వెలిగిపోతున్న ముర్రే రెండోసారి వింబుల్డన్ టైటిల్‌పై కనే్నశాడు. చెక్ రిపబ్లిక్‌కు చెందిన 10వ సీడ్ థామస్ బెర్డిచ్‌ని 6-3, 6-3, 6-3 తేడాతో వరుస సెట్లలో చిత్తుచేసిన ముర్రే ఫైనల్‌లో రవోనిక్‌తో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. 2013లో ముర్రే వింబుల్డన్ టైటిల్‌ను గెల్చుకున్నప్పటికీ బ్రిటిషర్లు అతనికి బ్రహ్మరథం పట్టారు. 1936లో ఫ్రెడ్ పెర్రీ తర్వాత బ్రిటిన్‌కు వింబుల్డన్ టైటిల్‌ను అందించిన తొలి క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించడమే అందుకు కారణం. ఎంతో సమర్థుడిగా పేరు తెచ్చుకున్న అతనికి ఫైనల్స్‌లో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే అలవాటు ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఎనిమిది గ్రాండ్ శ్లామ్ ఫైనల్స్‌లో పరాజయాలను ఎదుర్కోవడమే ఇందుకు ఉదాహరణ. ఈఏడాది ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. ఈసారి ఫైనల్‌లో జొకోవిచ్ లేకపోవడం ముర్రేకు కలిసొచ్చిన అంశం. రవోనిక్‌తో ఇప్పటి వరకూ తొమ్మిదిసార్లు ఢీకొన్న ముర్రే ఆరు విజయాలు సాధించాడు. కేవలం మూడు పర్యాయాలు ఓడాడు. మూడు వారాల క్రితం జరిగిన క్లీన్స్ క్లబ్ ఫైనల్‌లో రవోనిక్‌పై గెలిచి టైటిల్ సాధించిన ముర్రే అదే ఫలితాన్ని పునరావృతం చేస్తాడనే విశే్లషకుల అభిప్రాయం. ముర్రే హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగుతున్నప్పటికీ రవోనిక్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మొత్తం మీద ఈసారి వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ ఆసక్తికరంగా మారింది.
నొవాక్ జొకోవిచ్, రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్‌లలో కనీసం ఒకరు లేకుండా వింబుల్డన్ ఫైనల్ జరగడం 2002 తర్వాత ఇదే మొదటిసారి. జొకోవిచ్ ఫైనల్ చేరడం ఆనవాయితీగా మారగా, ఫెదరర్ లేదా నాదల్ కూడా ఫైనల్ వరకూ చేరిన సమర్థులు. చాలాకాలం తర్వాత ఈ ముగ్గురు లేకుండా జరుగుతున్న వింబుల్డన్ ఫైనల్‌లో ఎవరు విజేతగా నిలుస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే, మిలోస్ రవోనిక్‌పై ఆండీ ముర్రేనే ఫేవరిట్‌గా విశే్లషకులు పేర్కొంటున్నారు.

చిత్రం.. వింబుల్డన్ ట్రోఫీతో ఫొటో సెషన్‌లో పాల్గొన్న రవోనిక్, ముర్రే