క్రీడాభూమి

హిప్.. హిప్ ముర్రే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటిష్ టెన్నిస్ సూపర్ స్టార్స్‌లో ఒకడిగా వెలిగిపోతున్న ముర్రే 2013లో తొలిసారి వింబుల్డన్ టైటిల్‌ను సాధించాడు. అంతకు ముందు 2012లో యుఎస్ ఓపెన్ టైటిల్‌ను అందుకున్నాడు. 1936లో ఫ్రెడ్ పెర్రీ తర్వాత బ్రిటన్‌కు ఒక గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సాధించిన తొలి క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. అయితే, అతను ఆడిన గ్రాండ్ శ్లామ్ ఫైనల్స్‌లో ఎనిమిది పరాజయాలను ఎదుర్కోవడంతో అతనికి ఫైనల్ ఫోబియా ఉందని విశే్లషకులు ఒక నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. ఈఏడాది ఆరంభంలోనూ అతనికి ఇదే సమస్య ఎదురైంది. ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌లో జొకోవిచ్ చేతిలో అతను ఓటమిపాలయ్యాడు. ఆతర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరినప్పటికీ, మరోసారి అతనికి జొకోవిచ్ చేతిలోనే పరాజయం ఎదురైంది. ఈసారి ఫైనల్‌లో జొకోవిచ్ లేకపోవడంతో, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అతని తర్వాత రెండో స్థానంలో ఉన్న ముర్రేకు టైటిల్ అవకాశాలు మెరుగుపడ్డాయి. అతని ప్రతిభ కూడా తోడుకావడంతో రవోనిక్‌పై వరుస సెట్లలో విజయం సాధ్యమైంది.

లండన్, జూలై 10: బ్రిటన్ ఆటగాడు ఆండీ ముర్రే వింబుల్డన్ పురుషుల సింగిల్స్‌లో విజయభేరి మోగించాడు. కెరీర్‌లో రెండోసారి ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను అందుకున్నాడు. ఫైనల్‌లో కెనడా ఆటగాడు మిలోస్ రవోనిక్‌పై 6-4, 7-6, 7-6 తేడాతో గెలిచి, ఈ ఏడాది మొదటి, మొత్తం మీద మూడో గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సాధించాడు. ఫైనల్ మ్యాచ్ ఆరంభానికి ముందు క్షణం వరకూ ఈసారి వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ఎవరికి దక్కుతుందన్నది తీవ్ర ఉత్కంఠ రేపింది. ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్, రాఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్‌లలో ఎవరో ఒకరు లేకుండా వింబుల్డన్ ఫైనల్ జరగడం 2002 తర్వాత ఇదే మొదటిసారి కావడంతో ఈ మ్యాచ్ ప్రత్యేకతను సంతరించుకుంది. కెనడా తరఫున ఒక గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నీలో మొట్టమొదటిసారి ఫైనల్ చేరిన రవోనిక్ ఈ టోర్నీలో అద్భుత విజయాలను నమోదు చేశాడు. సెమీఫైనల్‌లో రోజర్ ఫెదరర్‌ను ఓడించి, టైటిల్ అందుకునే సత్తా తనకు కూడా ఉందని నిరూపించాడు. కెరీర్‌లో 18వ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సాధించే దూకుడు మీద కనిపించిన ఫెదరర్‌కు బ్రేక్ వేయడం రవోనిక్ ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. 2014 వింబుల్డన్ సెమీఫైనల్‌లో ఫెదరర్ చేతిలో ఓడిన రవోనిక్ ఈసారి అతనిని అదే సెమీఫైనల్‌లో ఇంటిదారి పట్టించి ప్రతీకారం తీర్చుకున్నాడు. దీనితో అతను ఫైనల్‌లో ముర్రే ప్రస్థానానికి అడ్డుకట్ట వేస్తాడన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, అందుకు భిన్నంగా ముర్రే వరుస సెట్లలో విజయం సాధించాడు.
ఫైనల్‌కు ముందు ముర్రేతో తొమ్మిది పర్యాయాలు ఢీకొన్న రోవోనిక్ కేవలం మూడు విజయాలను మాత్రమే సాధించాడు. ఆరు మ్యాచ్‌ల్లో ఓటమిపాలయ్యాడు. పదో మ్యాచ్‌లో అతనికి ఇది ఏడో పరాజయం. వింబుల్డన్‌లో రవోనిక్ ఫైనల్‌కు ముందు వరకూ 137 ఏసెస్‌ను సాధించాడు. అతను చేసిన సర్వీస్‌లలో సుమారు యాభై శాతం బంతులను ప్రత్యర్థులు తిప్పికొట్టలేకపోయారు. ఒకానొక దశలో అతను గంటకు 144 కిలోమీటర్ల వేగంతో బంతిని సర్వ్ చేశాడు. బలమైన సర్వీసులకు మారుపేరైన రవోనిక్ ప్రత్యర్థులు కొట్టే వేగవంతమైన సర్వీసులను సమర్థంగా ఎదుర్కోలేక చాలా సార్లు పాయింట్లు కోల్పోయాడు. సాధారణంగా నెట్‌కు దగ్గరగా వచ్చి ఆడేందుకు ఇష్టపడే అతను అదే అంశాన్ని తన బలంగా మార్చుకున్నాడు. ఫోర్ హ్యాండ్ అతని బలమైన ఆయుధం. ఈ అంశమే అతనికి ఎన్నో విజయాలను అందించింది. ఫైనల్‌లో అతను కడవరకూ పోరాడినా ఫలితం లేకపోయింది. ఎలాంటి బలమైన సర్వీసులైనా తిప్పికొట్టే సమర్థుడైన ముర్రే ముందు రవోనిక్ ప్రతిభ వెలవెలపోయింది.
కాగా, సర్వీసే బలంగా ముర్రే కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. దాదాపు 78 శాతం పాయింట్లు అతను మొదటి సర్వ్‌లోనే సాధించడం విశేషం. ముర్రే సర్వీసును తిప్పికొట్టడం సులభసాధ్యం కాదని అతనితో మ్యాచ్ ఆడిన ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు. బలమైన సర్వీసులు చేయడంలోనేకాదు.. ఎంత వేగంగా వచ్చే సర్వీసునైనా సమర్థంగా ఎదుర్కోవడంలోనూ ముర్రే సమర్థుడే. రవోనిక్ మాదిరిగానే ఫోర్ హ్యాండ్ అతని బలమైన ఆయుధం. మ్యాచ్‌ని త్వరగా ముగించేందుకే అతను ఇష్టపడతాడు. అందుకే, రవోనిక్ కంటే అతను సుమారు రెండు గంటలు తక్కువ సమయం కోర్టులో ఉన్నాడు. గత ఐదు మ్యాచ్‌ల్లో రవోనిక్‌ను ఓడించిన ముర్రే అదే ఒరవడిని కొనసాగించమే లక్ష్యంగా ఎంచుకున్నాడు. ఇటీవల క్వీన్స్ క్లబ్ టోర్నీ ఫైనల్‌లో రవోనిక్‌పై గెలిచిన ముర్రే వింబుల్డన్ ఫైనల్‌లో మరోసారి అతనితోనే ఢీకొనాల్సి రావడం విశేషం. అంతకు ముందు, 2014లో జరిగిన ఎటిపి వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో 6-3, 7-5, నిరుడు మాడ్రిడ్ మాస్టర్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో 6-4, 7-5, ఈఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ సెమీఫైనల్‌లో 4-6, 7-5, 6-7, 6-4, 6-2, మాంటే కార్లో మాస్టర్స్ క్వార్టర్ ఫైనల్‌లో 6-2, 6-0 ఆధిక్యంతో రవోనిక్‌పై ముర్రే విజయాలను నమోదు చేశాడు. వింబుల్డన్ ఫైనల్‌లో మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేశాడు.

ఫైనల్‌కు ముర్రే
ప్రస్థానం ఇలా..
మొదటి రౌండ్‌లో లియామ్ బ్రాడీని 6-2, 6-3, 6-4 తేడాతో ఓడించి తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. రెండో రౌండ్‌లో యెన్ సున్ లూపై 6-3, 6-2, 6-1 తేడాతో విజయం సాధించాడు. మూడో రౌండ్‌లో జాన్ మిల్మన్‌పై 6-3, 7-5, 6-2 తేడాతో నెగ్గాడు. ప్రీ క్వార్టర్స్‌లో నిక్ కిర్గియోస్‌ను 7-5, 6-1, 6-4 స్కోరుతో ఓడించాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో జో విల్‌ఫ్రెడ్ సొంగాను 7-6, 6-1, 3-6, 4-6, 6-1 తేడాతో సొంతం చేసుకున్నాడు. సెమీ ఫైనల్‌లో థామస్ బెర్డిచ్‌పై 6-3, 6-3, 6-3 తేడాతో వరుస సెట్లలో నెగ్గి ఫైనల్‌లోకి అడుగుపెట్టాడు.

రవోనిక్ ఫైనల్‌కు ఇలా..
వింబుల్డన్ పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో పాబ్లో కరెనో బుస్టాను 7-6, 6-2, 6-4 తేడాతో ఓడించడం ద్వారా శుభారంభం చేశాడు. రెండో రౌండ్‌లో ఆండ్రియాస్ సెప్పీపై 7-6, 6-4, 6-2 తేడాతో విజయం సాధించాడు. మూడో రౌండ్‌లో జాక్ సాక్‌పై 7-6, 6-4, 7-6 తేడాతో గెలిచాడు. ప్రీ క్వార్టర్స్‌లో డేవిడ్ గోఫిన్‌ను 4-6, 3-6, 6-4, 6-4, 6-4 తేడాతో ఓడించి తన ప్రతిభ చాటుకున్నాడు. వరుసగా రెండు సెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచినప్పటికీ ఆతర్వాత వరుసగా మూడు సెట్లను సాధించడం అతని పట్టుదలకు, పోరాట పటిమకు నిదర్శనం. క్వార్టర్ ఫైనల్‌లో శామ్ క్వెర్రీని అతను 6-4, 7-5, 5-7, 6-4 తేడాతో ఓడించి మరోసారి తనను తాను నిరూపించుకున్నాడు. ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్‌పై గెలిచిన క్వెర్రీని చిత్తుచేసి, ఈసారి టైటిల్ వేటలో తాను కూడా ఉన్నానని పరోక్షంగా సంకేతాలు పంపాడు. సెమీ ఫైనల్‌లో వెటరన్ ఆటగాడు రోజర్ ఫెదరర్‌పై 6-3, 6-7, 4-6, 7-5, 6-3 ఆధిక్యంతో విజయభేరి మోగించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు.

రవోనిక్ కెరీర్‌లో అత్యుత్తమంగా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానం వరకూ చేరాడు. 2014 వింబుల్డన్‌లో సెమీఫైనల్ చేరిన అతను, ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లోనూ సెమీస్‌లోకి అడుగుపెట్టగలిగాడు. కెరీర్‌లో 8 టైటిళ్లను సాధించిన అతను ఒక గ్రాండ్ శ్లామ్ టోర్నీలో ఫైనల్ చేరడం ఇదే మొదటిసారి. కానీ, టైటిల్ సాధించే అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు.