క్రీడాభూమి

మహిళల జట్టు సారథిగా సుశీల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 12: బ్రెజిల్‌లోని రియో డీ జెనిరోలో ఆగస్టు 5 నుంచి 21వ తేదీ వరకు జరిగే ఒలింపిక్ క్రీడల్లో భారత మహిళా హాకీ జట్టుకు డిఫెండర్ సుశీలా చానూ సారథ్యం వహించనుంది. పేలవమైన ఫామ్‌కు తోడు తీరు సరిగా లేని రీతూ రాణిని మహిళా హాకీ జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించి ఆమె స్థానంలో సుశీలా చానూను సారథిగానూ, ఆమె సహచరిణి దీపికను వైస్-కెప్టెన్‌గానూ నియమిస్తున్నట్లు హాకీ ఇండియా (హెచ్‌ఐ) మంగళవారం ప్రకటించింది. 16 మందితో కూడిన ఈ జట్టులో ఐదుగురు డిఫెండర్లు, ఐదుగురు మిడ్‌ఫీల్డర్లు, మరో ఐదుగురు ఫార్వర్డ్‌లు, ఒకే ఒక్క గోల్‌కీపర్ (సవిత)కు చోటు కల్పించారు. దీపిక, సునీతా లక్రా, సుశీల, నమితా టొప్పో, దీప్ గ్రేస్ ఎక్కా వంటి అనుభవజ్ఞులతో కూడిన ఈ జట్టులో మిడ్‌ఫీల్డ్ విభాగాన్ని రేణుకా లిమా మిన్జ్, మోనికా, నవ్‌జ్యోత్ కౌర్, యువ క్రీడాకారిణి నిక్కీ ప్రధాన్‌లతోనూ, ఫార్వర్డ్ విభాగాన్ని రాణి రామ్‌పాల్, పూనమ్ రాణి, వందనా కటారియా, అనురాధాదేవీ తోక్చోమ్, ప్రీతి దూబేతోనూ కూర్చారు. పురుషుల జట్టు మాదిరిగానే ఈ జట్టులో కూడా ఇద్దరు రిజర్వు క్రీడాకారిణులు (డిఫెండర్ హనియాలమ్ లాల్ రౌత్, గోల్‌కీపర్ రజనీ ఎతిమ్మర్పు) ఉన్నారు. గత ఏడాది హాకీ వరల్డ్ లీగ్‌లో చక్కగా రాణించి సెమీఫైనల్స్‌కు చేరుకున్న భారత మహిళా హాకీ జట్టు ఒలింపిక్ క్రీడల్లో పాల్గొననుండటం గత 36 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇంతకుముందు 1980లో మాస్కో ఎడిషన్ ఒలింపిక్ క్రీడల్లో పాల్గొన్న భారత మహిళా హాకీ జట్టు ఆ తర్వాత ఒలింపిక్ క్రీడలకు అర్హత సాధించలేకపోయిన విషయం విదితమే.
ఒడిశా క్రీడాకారిణులకు
నగదు పురస్కారాలు
ప్రస్తుతం ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న భారత మహిళా హాకీ జట్టులో ఒడిశాకు చెందిన నలుగురు క్రీడాకారిణిలు దీప్ గ్రేస్ ఎక్కా, నమితా టొప్పో, లిలిమా మిన్జ్, సునీతా లక్రా చోటు దక్కించుకున్నారు. దీంతో వీరందరికీ 50 వేల చొప్పున నగదు పురస్కారాలను అందజేయనున్నట్లు ఒడిశా ప్రభుత్వం నిర్ణయించిందని ఆ రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి సుదం మరాండి మంగళవారం భువనేశ్వర్‌లో విలేఖర్లకు తెలిపారు.
అమిత్ షా అభినందనలు
ఇదిలావుంటే, ఒలింపిక్ క్రీడల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించనున్న పురుషుల, మహిళల హాకీ జట్లకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తరఫున బిజెపి అధ్యక్షుడు అమిత్ షా అభినందనలు తెలిపారు. ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే పురుషుల, మహిళల జట్ల వివరాలను ప్రకటించేందుకు మంగళవారం న్యూఢిల్లీలో హాకీ ఇండియా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ, ఆగస్టు 5వ తేదీ నుంచి జరుగనున్న రియో ఒలింపిక్స్‌లో ఈ రెండు జట్లు చక్కగా రాణించి దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించాలని ఆకాంక్షించారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రెండు జట్ల జెర్సీలను ఆవిష్కరించారు.
ఇదీ జట్టు
సుశీలా చానూ (కెప్టెన్/డిఫెండర్), దీపిక (వైస్-కెప్టెన్), నవ్‌జ్యోత్ కౌర్, దీప్ గ్రేస్ ఎక్కా, మోనికా, నిక్కీ ప్రధాన్, అనురాధా దేవీ తోక్చోమ్, సవితా, పూనమ్ రాణి, వందనా కటారియా, నమితా టొప్పో, రేణుకా యాదవ్, సునీతా లక్రా, రాణి, ప్రీతీ దూబే, లిలిమా మిన్జ్. స్టాండ్‌బైస్: హనియాలమ్ లాల్ రౌత్ ఫెలి, రజనీ ఎతిమ్మర్పు (రిజర్వు గోల్‌కీపర్).