క్రీడాభూమి

కెప్టెన్ సర్దార్‌పై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 12: హాకీ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. జాతీయ హాకీ జట్టుకు చాలా కాలం పాటు కెప్టెన్‌గా సేవలందించిన సర్దార్ సింగ్‌ను సారథ్య బాధ్యతల నుంచి తొలగించి రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత జట్టుకు సీనియర్ గోల్‌కీపర్ పిఆర్.శ్రీజేష్‌ను కెప్టెన్‌గా నియమించింది. ప్రపంచ హాకీలో ప్రస్తుతం అత్యంత సమర్థులైన గోల్‌కీపర్లలో శ్రీజేష్ ఒకడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల లండన్‌లో ఆరు దేశాల మధ్య జరిగిన చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో శ్రీజేష్ నాయకత్వంలోని భారత జట్టు చక్కటి ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకోవడంతో అతనికి ఈ రివార్డు లభించింది. అటు ఆటగాడిగా, ఇటు కెప్టెన్‌గా శ్రీజేష్ అద్భుత ప్రదర్శనతో రాణించడంతో చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో భారత జట్టు గత 38 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనంత ఉత్తమ ఆటతీరును కనబర్చగలిగింది. ఈ టోర్నీ ఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడిన భారత జట్టు వివాదాస్పద షూటౌట్‌లో పరాజయాన్ని ఎదుర్కోవడానికి ముందు ప్రత్యర్థులను ఒక్క గోల్ కూడా సాధించకుండా అడ్డుకున్న విషయం విదితమే.
కాగా, టీమిండియాలోని మరో కీలక ఆటగాడైన ఎస్‌వి.సునీల్‌ను ఒలింపిక్ జట్టుకు వైస్-కెప్టెన్‌గా ప్రకటించారు. గత కొంత కాలం నుంచి మైదానం లోపల, వెలుపల సర్దార్ సింగ్ ఇబ్బందుల్లో కొనసాగుతుండటంతో శ్రీజేష్‌కు సరైన సమయంలో పరిస్థితులు అనుకూలించాయి. 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించిన సర్దార్ సింగ్ అనేక ఏళ్లపాటు జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే గత కొంత కాలం నుంచి మిడ్‌ఫీల్డర్‌గా సర్దార్ సింగ్ సరిగా రాణించలేకపోతుండటం, అలాగే బ్రిటిష్ యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు సర్దార్ సింగ్‌పై ఆరోపణలు రావడం కూడా అతని ప్రతిష్టను దెబ్బతీశాయి. సర్దార్ సింగ్‌కు విశ్రాంతి కల్పించినప్పటికీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో రాణించిన భారత జట్టు ఆ తర్వాత వాలెన్సియాలో జరిగిన టోర్నమెంట్‌లో ఘోరంగా విఫలమైంది. ఈ టోర్నీలో రెండు పరాజయాలను ఎదుర్కొని మరో రెండు మ్యాచ్‌లను డ్రాగా ముగించిన భారత జట్టు పసికూన ఐర్లాండ్ జట్టుపై ఒకే ఒక్క విజయంతో సరిపుచ్చిన విషయం విదితమే.
ఒలింపిక్స్‌కు వెళ్లే జట్టు ఇదే
పిఆర్.శ్రీజేష్ (కెప్టెన్/గోల్‌కీపర్), ఎస్‌వి.సునీల్ (వైస్-కెప్టెన్), హర్మన్‌ప్రీత్ సింగ్, రూపీందర్‌పాల్ సింగ్, కొథాజిత్ సింగ్, సురేందర్ కుమార్, మన్‌ప్రీత్ సింగ్, సర్దార్ సింగ్, విఆర్.రఘునాథన్, ఎస్‌కె.ఉతప్ప, దినేష్ ముజ్తబా, దేవేందర్ వాల్మీకి, ఆకాష్‌దీప్ సింగ్, చిన్‌గ్లెన్సన సింగ్, రమణ్‌దీప్ సింగ్, నిక్కిన్ తిమ్మయ్య. స్టాండ్‌బైస్: ప్రదీప్ మోర్, వికాస్ దహియా (రిజర్వ్ గోల్‌కీపర్).
చిత్రం... భారత హాకీ జట్టు సభ్యులతో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్