క్రీడాభూమి

ప్రక్షాళన జరగాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 18: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ)లో భారీ ప్రక్షాళన జరగాల్సిందేనని సుప్రీం కోర్టు మరోమారు పునరుద్ఘాటించింది. బిసిసిఐ పనితీరుతో పాటు దాని పాలనా వ్యవహారాలను సంస్కరించేందుకు సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్‌ఎం.లోధా నేతృత్వంలోని కమిటీ చేసిన పలు సిఫారసులను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఆమోదిస్తూ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 70 ఏళ్ల వయసు నిండిన వ్యక్తులు బిసిసిఐలో సభ్యత్వం పొందకుండా నిషేధం విధించాలని లోధా కమిటీ చేసిన ప్రధాన సిఫారసును సుప్రీం కోర్టు ఆమోదించింది. అయితే బిసిసిఐని సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఎ) పరిధిలోకి తీసుకురావాలా? లేదా? అనే అంశంతో పాటు దేశంలో బెట్టింగులను చట్టబద్ధం చేసే అంశంపై నిర్ణయాలను పార్లమెంట్‌కు వదిలేసింది. బిసిసిఐలో కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నామినీ ఉండాలని లోధా కమిటీ చేసిన సిఫారసులను సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. ఒక రాష్ట్రానికి ఒకే ఓటు ఉండాలని లోధా కమిటీ చేసిన సిఫారసుపై బిసిసిఐ వ్యక్తం చేసిన అభ్యంతరాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్.్ఠకూర్, జస్టిస్ ఎఫ్‌ఎంఐ.ఖలీఫుల్లాలలతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ఒకటి కంటే ఎక్కువ క్రికెట్ సంఘాలను కలిగివున్న మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాలు రొటేషన్ పద్ధతిలో ఓటింగ్ హక్కులను కలిగి ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. బిసిసిఐలో ఆటగాళ్ల సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి నిధులు సమకూర్చాలన్న లోధా కమిటీ సిఫారసును సుప్రీం కోర్టు అంగీకరించింది. అయితే ఈ సంఘానికి ఎంత మొత్తంలో నిధులు కేటాయించాలనే విషయాన్ని బిసిసిఐకే వదిలేసింది. కాగ్ నామినీని నియమించిన తర్వాత బిసిసిఐలో ఇతర అన్ని అడ్మినిస్ట్రేవ్ కమిటీలను రద్దు చేయాలని, అలాగే పరస్పర ప్రయోజనాలకు తావులేకుండా చూసేందుకు క్రికెట్ పాలనా యంత్రాంగంలో ఏ వ్యక్తి అయినా ఒక్క పదవిని మాత్రమే కలిగి ఉండాలని లోధా కమిటీ చేసిన సిఫారసును కూడా సుప్రీం కోర్టు ఆమోదించింది. అయితే బిసిసిఐ పనితీరును సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలా? లేదా? అనే అంశంతో పాటు జస్టిస్ లోధా కమిటీ సిఫారసు చేసినట్లుగా క్రికెట్‌లో బెట్టింగులను చట్టబద్ధం చేయాలా? వద్దా? అనే దానిపై పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. అలాగే క్రికెట్ ప్రసార హక్కులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఒప్పందాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందా? లేదా? అనే అంశంతో పాటు పరస్పర ప్రయోజనాలకు తావులేకుండా చూసేందుకు ఒక ఫ్రాంచైజ్ సభ్యుడు బిసిసిఐలో ఉండవచ్చా? అన్నదానిపై నిర్ణయాలను క్రికెట్ బోర్డుకే వదిలేసింది. బిసిసిఐ పాలనా వ్యవస్థను ఆరు నెలల్లోగా ప్రక్షాళన చేయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేస్తూ, ఈ ప్రక్రియను పర్యవేక్షించాల్సిందిగా జస్టిస్ లోధాతో పాటు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులు అశోక్ భాన్, ఆర్‌వి.రవీంద్రన్‌లతో కూడిన కమిటీకి సూచించింది.