క్రీడాభూమి

చరిత్ర సృష్టించిన నీరజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 24: అంతర్జాతీయ అమెచ్యూర్ అథ్లెటిక్ సమాఖ్య (ఐఎఎఎఫ్) ఆధ్వర్యాన పోలెండ్‌లోని బిడ్గోస్క్‌లో జరుగుతున్న అండర్-20 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో హర్యానాకు చెందిన రైజింగ్ అథ్లెటిక్ స్టార్ నీరజ్ చోప్రా భారత కీర్తిపతాకాన్ని రెపరెపలాడించాడు. అద్భుత ప్రదర్శనతో 86.48 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి పసిడి పతకాన్ని కైవసం చేసుకోవడంతో పాటు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు. శనివారం రాత్రి తొలి రౌండ్‌లో 79.66 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరిన నీరజ్ చోప్రా ఆ తర్వాత రెండో రౌండ్‌లో మరింత విజృంభించి ఏకంగా 86.48 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గతంలో లాత్వియా అథ్లెట్ జగిస్మండ్స్ సిర్మైస్ 84.69 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి అండర్-20 విభాగంలో నెలకొల్పిన ప్రపంచ రికార్డు కంటే ఇది దాదాపు రెండు మీటర్లు ఎక్కువ. దీంతో నీరజ్ చోప్రా అథ్లెటిక్స్ (జూనియర్లు, సీనియర్లు)లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన తొలి భారతీయుడిగా చరిత్రకెక్కాడు. ప్రస్తుతం చండీగఢ్‌లోని డిఎవి కళాశాలలో విద్యనభ్యసిస్తున్న నీరజ్ చోప్రా ఈ ఫీట్‌తో ఇంతకుముందు రాజీందర్ సింగ్ పేరుమీద ఉన్న జాతీయ రికార్డు (82.23 మీటర్లు)ను కూడా బద్ధలు కొట్టాడు. ఈ పోటీల్లో అద్భుతమైన ప్రదర్శనతో సత్తా చాటుకున్న నీరజ్ చోప్రా రియో ఒలింపిక్స్‌కు ఎంపిక కానప్పటికీ ప్రస్తుత సీజన్‌లో ఉత్తమ ప్రదర్శనతో ఐఎఎఎఫ్ ఓవరాల్ జాబితా (సీనియర్ ఔట్‌డోర్ జాబితా)లో అతను ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నాడు. రియో ఒలింపిక్స్ పురుషుల విభాగంలో పోటీపడేందుకు అర్హత సాధించాలంటే కనీసం 83 మీటర్ల దూరం జావెలిన్‌ను విసరాలి. ఈ అర్హత పోటీలకు గడువు ఈ నెల 11వ తేదీతోనే ముగిసింది. అయితే నాలుగేళ్ల క్రితం లండన్ ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో పసిడి పతక విజేత కనబర్చిన ప్రదర్శన (84.58 మీటర్లు) నీరజ్ చోప్రా ప్రదర్శన ఎంతో మెరుగ్గా ఉండటం విశేషం. నీరజ్ చోప్రా ప్రస్తుతం తన ఫీట్‌తో ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు పసిడి పతకాన్ని అందించిన తొలి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌గా కూడా చరిత్రకెక్కాడు. ప్రస్తుతం రియో ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న మహిళా డిస్కస్ త్రోవర్ సీమా పునియా 16 ఏళ్ల క్రితం అండర్-20 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకం సాధించినప్పటికీ ఆ తర్వాత ఆమె డోపింగ్ పరీక్షలో విఫలమవడంతో ఆ పతకాన్ని వాపసు ఇచ్చేయాల్సి వచ్చింది.
ప్రధాని అభినందనలు
ఇదిలావుంటే, ఐఎఎఎఫ్ అండర్-20 అథ్లెటిక్స్ ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పసిడి పతకాన్ని కైవసం చేసుకోవడంతో పాటు ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రాకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఆదివారం అభినందనలు తెలిపారు. అద్భుతమైన క్రీడా నైపుణ్యంతో నీరజ్ చోప్రా దేశానికే గర్వకారణంగా నిలిచాడని ‘ట్విట్టర్’లో మోదీ ప్రశంసించారు. కాగా, ప్రపంచ రికార్డుతో దేశ కీర్తిపతాకాన్ని రెపరెపలాడించిన నీరజ్ చోప్రాకు 10 లక్షల రూపాయల రివార్డును అందజేస్తామని కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి విజయ్ గోయల్ ప్రకటించారు.