క్రీడాభూమి

నర్సింగ్‌కు నిరాశే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సింగ్ యాదవ్‌కు ఒలింపిక్స్‌కు వెళ్లే దారులు దాదాపుగా అన్నీ మూసుకుపోగా, చివరి ఆశగా జాతీయ డోపింగ్ నిరోధక విభాగం (నాడా) ఆధ్వర్యంలోని క్రమశిక్షణ కమిటీ విచారణ మిగిలింది. తాను నిర్దోషినని, తనకు సరఫరా చేసిన ఆహారంలో ఎవరో ఉద్దేశపూర్వకంగా మాదక ద్రవ్యాలను కలిపి ఉంటారని నర్సింగ్ వాదిస్తున్న విషయం తెలిసిందే. నాడా క్రమశిక్షణ కమిటీ బుధవారం సమాశమై ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించింది. తుది నిర్ణయాన్ని గురువారం నాటికి వాయదా వేసింది. ‘బి’ శాంపిల్‌లో ఫలితం కూడా నర్సింగ్‌కు వ్యతిరేకంగా రావడంతో నాడా నిర్ణయం ఏ విధంగా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. నాడా డిసిప్లినరీ కమిటీ నిర్ణయం కూడా నర్సింగ్‌కు వ్యతిరేకంగా ఉంటే, అతను ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని పూర్తిగా కోల్పోతాడు. ఈ నేపథ్యంలో గురువారం నర్సింగ్ కీలకమైన రోజుగా మారింది.

న్యూఢిల్లీ, జూలై 27: ఒలింపిక్స్‌లో రెండు పర్యాయాలు భారత్‌కు పతకాలను సాధించిపెట్టిన రెజ్లర్ సుశీల్ కుమార్ నుంచి ఎదురైన సవాళ్లను సమర్థంగా ఎదుర్కొని, రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్న నర్సింగ్ పంచప్ యాదవ్‌కు నిరాశే మిగిలింది. డోపింగ్ పరీక్షలో పట్టుబడి, పరువుపోగొట్టుకున్న అతనికి చివరి ఆశ ‘బి’ శాంపుల్స్‌తో జరిగే రెండో టెస్టు రూపంలో కనిపించింది. అయితే, రెండో డోప్ పరీక్షలోనూ విఫలమైనట్టు నివేదికలో స్పష్టం కావడంతో అతని ఒలింపిక్స్ అశలకు తెరపడింది. ఇప్పటి వరకూ ఉన్న కొద్దిపాటి అవకాశాలు కూడా నీరుగారిపోగా, నర్సింగ్ ఒలింపిక్స్ కల చెదిరిపోయింది. అతని స్థానంలో ప్రవీణ్ రానాను ఒలింపిక్స్‌కు ఎంపిక చేసినట్టు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో నర్సింగ్‌కు రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాలు ఇక లేనట్టేనని కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ చేసిన వ్యాఖ్యలు అతని ఒలింపిక్ అవకాశాలకు తెరదించాయి.
రియో ఒలింపిక్స్ పురుషుల 74 కిలోల విభాగంలో ఒక అభ్యర్థిని పంపే అవకాశాన్ని భారత్ దక్కించుకుంది. రియోకు వెళ్లేది నేనంటే నేనంటూ సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్ మధ్య తలెత్తిన పోటీ చివరికి కోర్టు కేసుల వరకూ వెళ్లింది. బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన సుశీల్ లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని అందుకున్నాడు. లండన్‌లో సత్తా చాటిన తర్వాత సుశీల్ దాదాపుగా మేజర్ టోర్నీల్లో పాల్గొనలేదు. వివిధ కారణాలను పేర్కొంటూ అతను విశ్రాంతి తీసుకుంటే, నర్సింగ్ పలు అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఎన్నో విజయాలను అందుకున్నాడు. అతని కారణంగానే 74 కిలో విభాగంలో పోటీపడే అవకాశాన్ని భారత్ సొంతం చేసుకుంది. కాగా, రెండు ఒలింపిక్స్‌లో పాల్గొని, పతకాలను సాధించి పెట్టిన తనకే రియో ఒలింపిక్స్‌లో అవకాశం దక్కాలని సుశీల్ వాదిస్తే, నాలుగేళ్ల కాలంలో ఎన్నో టోర్నీల్లో పాల్గొని, దేశ ప్రతిష్ఠను నిలబెట్టిన తనను పంపాలని నర్సింగ్ పట్టుబట్డాడు. డబ్ల్యుఎఫ్‌ఐ మద్దతు లభించడంతో నర్సింగ్ ఊపిరి పీల్చుకోగా, తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు సుశీల్ విజ్ఞప్తులు చేశాడు. తన లేఖలకు ఎలాంటి స్పందన రాకపోవడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. అక్కడ కూడా అతనికి చుక్కెదురైంది. సుశీల్ సేవలను గుర్తించాలని పేర్కొన్న కోర్టు, నర్సింగ్‌కు అన్యాయం జరగకూడదని స్పష్టం చేసింది. ఎవరిని పంపాలన్న నిర్ణయాధికారం డబ్ల్యుఎఫ్‌ఐకే ఉందని పేర్కొంది. అప్పటికే, సమాఖ్య ప్రకటించిన ప్రాబబుల్స్‌లో సుశీల్ పేరు లేకపోవడంతో, రియోకు వెళ్లే మార్గం నర్సింగ్‌కు సుగమమైంది. కానీ, ఎవరూ ఊహించని విధంగా డోప్ పరీక్ష అతని దారుణంగా దెబ్బతీసింది. నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించినట్టు డోప్ పరీక్షలో స్పష్టంకాగా, డబ్ల్యుఎఫ్‌ఐ అతనిపై తాత్కాలికంగా వేటు వేసింది.
‘బి’ శాంపిల్స్‌ను పరీక్షిస్తే ఫలితం మరోలా ఉండవచ్చన్న నర్సింగ్ ఆశలు పూర్తిగా అడుగంటిపోయాయి. రెండో పరీక్షలోనూ అతను స్టెరాయిడ్స్ వాడినట్టు తేలింది. ఈ తాజా పరిణామం అతని ఒలింపిక్స్ ఆశలకు శాశ్వతంగా తెరదించింది. గత నెల 25న జరిగిన డోప్ పరీక్షలో మొదటిసారి దోషిగా తేలిన అతను రెండో పరీక్షలోనూ విఫలం కావడంతో అతని మద్దతుదారుల నోటికి కూడా తాళం పడింది.

కుట్ర జరిగిందేమో!
మహారాష్ట్ర ముఖ్యమంత్రి అనుమానం

ముంబయి: నర్సింగ్ యాదవ్‌పై కుట్ర జరిగిందేమోనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అనుమానం వ్యక్తం చేశాడు. మహారాష్టక్రు చెందిన నర్సింగ్‌ను ఒలింపిక్స్‌కు వెళ్లకుండా చేయడానికి ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అతనికి తెలియకుండానే నిషిద్ధ మాదక ద్రవ్యాలను అందించి ఉండవచ్చని కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్‌కు రాసిన లేఖలో పేర్కొన్నాడు. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న నర్సింగ్‌కు నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించాల్సిన అవసరం లేదన్నాడు. అతనికి సరఫరా చేసిన ఘన, ద్రవ ఆహార పదార్ధాల్లో నిషిద్ధ మాదక ద్రవ్యాలను కలిపి ఉంటారని అన్నాడు. నర్సింగ్‌ను అణగదొక్కడానికి, అతని కెరీర్‌ను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతున్నదన్న అనుమానాలు తనకు ఉన్నాయని చెప్పాడు. ఈ కోణంలో ఆలోచించి నర్సింగ్‌కు న్యాయం చేయాలని ఫడ్నవీస్ తన లేఖలో కోరాడు.

పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు..

న్యూఢిల్లీ: నర్సింగ్ యాదవ్ డోపింగ్ వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. తనపై కుట్ర జరిగిందని, ఉద్దేశపూర్వకంగా తనను డోప్ దోషిగా ఇరికించారని ఆరోపిస్తున్న నర్సింగ్ బుధవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 17 ఏళ్ల యువ రెజ్లర్‌సహా తనతో కలిసి ప్రాక్టీస్ చేసిన ఇద్దరు రెజ్లర్లపై అనుమానాలు ఉన్నాయని, వారే తనకు ఆహారంలో మాదక ద్రవ్యాలను కలిపి ఇచ్చివుంటారని పోలీస్ స్టేషన్‌లో నర్సింగ్ ఫిర్యాదు చేశాడు. ఈ అంశంపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు. తనపై కుట్ర జరుగుతున్నదన్న విషయం పలు సందర్భాల్లో చెప్పానని, ఆ అనుమానంతోనే తాను ఫిర్యాదు చేశానని నర్సింగ్ విలేఖరులతో మాట్లాడుతూ అన్నాడు. తనకు క్లీన్‌చిట్ లభిస్తే, రియోకు వెళతానని అన్నాడు. మాదక ద్రవ్యాలను కలిపిన ఆహారాన్ని తనకు ఇచ్చారన్న అనుమానం వ్యక్తం చేశాడు. కొంత మంది అధికారులకూ ఇందులో వాటా ఉండవచ్చని అన్నాడు. ఇప్పటి వరకూ సిసిటివి ఫుటేజీలు ఇవ్వకపోవడమే తన అనుమానాలను మరింత పెంచుతున్నదని చెప్పాడు. కాగా, ఇద్దరు రెజ్లర్లు సుమీత్, జితేష్‌లపై అతను పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. నర్సింగ్‌కు అందచేసిన ఆహారంలో మందు కలిపినట్టు ఇప్పటికే వీరిలో ఒక రెజ్లర్ అంగీకరించాడని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భషషనణ్ శరణ్ సింగ్ తెలిపాడు. ఇది కుట్ర పూరితంగా జరిగిందా లేక మరేవైనా కారణాలు ఉన్నాయా అన్న ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పడం కష్టమని అన్నాడు. ఇలాంటి సంఘటనలపై విచారణ జరిపే అధికారం తమకు లేదన్నాడు. సిబిఐ విచారణకు నర్సింగ్ చేస్తున్న డిమాండ్‌ను డబ్ల్యుఎఫ్‌ఐ మద్దతునిస్తుందని స్పష్టం చేశాడు.