క్రీడాభూమి

బ్రాడ్లే చివరి పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 4: కెరీర్‌లో అనేకానేక చాంపియన్‌షిప్స్‌తోపాటు ఏడు ఒలింపిక్ పతకాలను సాధించిన బ్రిటిష్ సైక్లిస్ట్ బ్రాడ్లే విగిన్స్ చివరిసారి రియోలో బరిలోకి దిగనున్నాడు. ఒలింపిక్స్‌లో ఇంత వరకూ నాలుగు స్వర్ణం, ఒక రజతం, మూడు కాంస్య పతకాలను సాధించిన అతని ఖాతాలో మూడు ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిళ్లు కూడా ఉన్నాయి. రియో ఒలింపిక్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న 36 ఏళ్ల విగిన్స్ తనకు ఇవే చివరి ఒలింపిక్స్ అని ఇది వరకే ప్రకటించాడు. దీనితో రియోలో అతని ప్రదర్శనను తిలకించేందుకు ఎంతో మంది అభిమానులు బ్రిటన్ నుంచి ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు.
గ్రాండ్ సాటర్‌డే
రియో ఒలింపిక్స్‌లో బ్రిటన్‌కు ఆగస్టు 13వ తేదీ ‘గ్రాండ్ సాటర్‌డే’గా మారనుంది. పురుషుల 10,000 మీటర్ల విభాగంలో మో ఫరా, మహిళల హెప్ట్థ్లాన్‌లో జెస్ ఎన్నిస్, పురుషుల లాంగ్ జంప్‌లో గ్రెగ్ రూథర్‌ఫర్డ్ అదే రోజు పోటీపడతారు. వీరంతా తమతమ విభాగాల్లో డిఫెండింగ్ చాంపియన్లు కావడం విశేషం. లండన్ ఒలింపిక్స్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించిన ఈ ముగ్గురు స్టార్లు రియో ఒలింపిక్స్‌లో అదే స్థాయిలో చెలరేగుతారా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం గ్రాండ్ సాటర్‌డే రోజే లభిస్తుంది.
మందకొడిగా టికెట్ల అమ్మకాలు
టికెట్ల అమ్మకాలు మందకొడిగా సాగడం రియో ఒలింపిక్స్ నిర్వాహణ కమిటీ (ఒసి) అధికారులను ఆందోళనకు గురి చేస్తున్నది. మొత్తం 75 లక్షల టికెట్లను అమ్మకానికి ఉంచారు. సాధారణంగా ఒలింపిక్స్‌లో అమ్మకానికి ఉంచిన టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. బుకింగ్ తెరిచిన ఒకటిరెండు రోజుల్లోనే టికెట్లు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. కానీ, రియో ఒలింపిక్స్‌కు విడుదల చేసిన టికెట్లలో ఐదు లక్షలు కూడా ఇంకా అమ్ముడుకాలేదు. కొన్ని క్రీడలకు సంబంధించిన స్టేడియాలు ఖాళీగా బోసిపోయి కనిపించడం ఖాయం. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ తొమ్మిది బిలియన్ పౌండ్లు ఖర్చు చేస్తే, దానికి తగినట్టు ఆదాయం రాదని ఇప్పటికే స్పష్టమైంది. కొన్ని క్రీడా వేదికల్లో పనులు ఇప్పటికీ పూర్తికాకపోవడం, కొన్ని చోట్ల జరిగిన తాజా నిర్మాణాల్లో లోపాలు అధికారులను వేధిస్తున్నాయి. కొన్ని భవనాల్లో పైకప్పు పెచ్చులూడుతున్నది. క్రీడా గ్రామంలోని చాలా గదుల్లో వైరింగ్ సరిగ్గా జరగలేదు. దీనితో వైర్లు వేల్లాడుతూ అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నాయి. కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, చివరికి పోలీసులు కూడా ఆందోళన బాటపట్టడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అధికారులకు టికెట్ల అమ్మకం నత్తనడకన సాగడం కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభం కానుండగా, ఇప్పటికీ టికెట్లకు ఆశించినంత డిమాండ్ లేకపోవడం ఒలింపిక్స్ నిర్వాహణ కమిటీని పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టింది.

చిత్రం.. బ్రాడ్లే విగిన్స్