క్రీడాభూమి

రియో ఒలింపిక్స్ పురుషుల హాకీలో భారత్ శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 6: ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు శుభారంభం చేసింది. శనివారం ఐర్లాండ్‌తో జరిగిన తొలి గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను 3-2 తేడాతో ఓడించింది. రూపీందర్ పాల్ సింగ్ రెండు గోల్స్ చేసి ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో భారత జట్టు చివరిసారి విజయాన్ని నమోదు చేసింది. 16 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌లో తొలి విజయాన్ని సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి దాడులకు ఉపక్రమించిన భారత్‌కు తొలి గోల్‌ను రఘునాథ్ అందించాడు. పెనాల్టీ కార్నర్‌ను అతను గోల్‌గా మలిచాడు. అనంతరం రూపీందర్ ద్వారా భారత్‌కు రెండో గోల్ లభించింది. పెనాల్టీ అవకాశాన్ని కూడా అతను సద్వినియోగం చేసుకున్నాడు. మ్యాచ్ ప్రథమార్ధం ముగిసే సమయానికి భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలో ఎదురుదాడికి దిగిన ఐర్లాండ్‌కు స్టార్ ఆటగాడు జాన్ జెర్మయిన్ గోల్ సాధించిపెట్టాడు. భారత గోల్‌కీపర్ శ్రీజేష్‌ను ఏమార్చిన అతను మెరుపు వేగంతో బంతిని గోల్ పోస్టులోకి కొట్టాడు. ఈ గోల్ నమోదైన నిమిషాల వ్యవధిలోనే రూపీందర్ తన ఖాతాలో రెండో గోల్‌ను జమ చేసుకున్నాడు. మరోసారి అతను పెనాల్టీ కార్నర్‌గా గోల్‌గా మార్చాడు. భారత్ ఆధిక్యం కొనసాగుతున్న తరుణంలోనే కానర్ హార్ట్ చేసిన గోల్‌తో ఐర్లాండ్ కోలుకున్నట్టు కనిపించింది. కానీ, భారత రక్షణ విభాగం ప్రత్యర్థిని నిలువరించి మ్యాచ్‌ని భారత్ ఒక గోల్ తేడాతో గెల్చుకుంది.
పేస్, బొపన్న అవుట్
వివాదాల నడుమ రియోకు పయనమైన లియాండర్ పేస్, రోహన్ బొపన్న జోడీ మొదటి రౌండ్‌లోనే ఓటమిపాలై నిష్క్రమించింది. తనకు భాగస్వామిగా సాకేత్ మైనేనీని రియోకు పంపాలన్న బొపన్న అభ్యర్థనను తిరస్కరించి భారత టెన్నిస్ సంఘం (ఎఐటిఎ) పెద్ద తప్పే చేసింది. లియాండర్ పేస్‌ను బొపన్నకు జోడీగా పంపి తన పంతాన్ని నిలబెట్టుకోగలిగిందే తప్ప వారి మధ్య ఉన్న విభేదాలకు తెరవేయలేక పోయింది. ఫలితంగా పేస్, బొపన్న జోడీ 4-6, 6-7 తేడాతో లుకాస్ కుబొట్, మార్సిన్ మట్కోవ్‌స్కీ జోడీ చేతిలో ఓడింది.
వౌమా నిష్క్రమణ
మహిళల టేబుల్ టెన్నిస్‌లో భారత క్రీడాకారిణి వౌమా దాస్ మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించింది. మోంటెరో డానియేలాతో తలపడిన ఆమె 2-11, 7-11, 11-7, 3-11 తేడాతో ఓటమిపాలైంది.
రోయింగ్ క్వార్టర్స్‌లో దత్తు
రోయింగ్ పురుషుల సింగిల్ స్కల్స్‌లో దత్తు బాబన్ క్వార్టర్ ఫైనల్ చేరాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్‌లో అతను మూడో స్థానాన్ని ఆక్రమించడం ద్వారా నేరుగా క్వార్టర్స్‌కు అర్హత సంపాదించాడు.

చిత్రం.. ఐర్లాండ్‌ను ఓడించి భారత పురుషుల హాకీ జట్టు