క్రీడాభూమి

శ్రమకు దక్కిన ఫలితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్‌కు పతకాన్ని అందించిన తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించిన 23 ఏళ్ల సాక్షి మాలిక్‌కు అంతర్జాతీయ పోటీల్లో మెరుగైన రికార్డే ఉంది. 2014 గ్లాస్గో కామనె్వల్త్ గేమ్స్‌లో ఆమె రజత పతకాన్ని కైవసం చేసుకుంది. అదే ఏడాది జరిగిన ఇంచియాన్ ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని సాధించింది. భారత్‌కు పురుషుల విభాగంలో కెజి జాదవ్ మొదటిసారి 1952 హెల్సిన్కీ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించి పెట్టాడు. ఆతర్వాత 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ వరుసగా కాంస్య, రజత పతకాలను గెల్చుకున్నాడు. లండన్‌లో యోగేశ్వర్ దత్‌కు కాంస్యం లభించింది. కాగా, మహిళల విభాగంలో ఆ ఘనతను సాక్షి సాధించింది. రియోలో పతకం కోసం 11 రోజుల భారత అభిమానుల నిరీక్షణకు తెరదించింది. పతకాల పట్టికలో భారత్ పేరును చేర్చింది. మన దేశానికి ఒలింపిక్స్‌లో 25వ పతకాన్ని అందించింది.

రియో డి జెనీరో, ఆగస్టు 18: ఒలింపిక్స్‌లో పతకం సాధించాలన్న లక్ష్యంతో తాను ఎంతో శ్రమించానని, అందుకు తగిన ఫలితం ఇప్పుడు లభించిందని మహిళల రెజ్లింగ్ 58 కిలోల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెల్చుకొని చరిత్ర సృష్టించిన సాక్షి మాలిక్ అన్నది. దేశానికి ఒలింపిక్ పతకాన్ని అందించిన తొలి మహిళా రెజ్లర్‌గా గుర్తింపు లభించడం తన అదృష్టమని చెప్పింది. సుమారు 12 సంవత్సరాలుగా తాను చాలా కష్టపడి సాధన చేశానని, ఆ కృషి ఇప్పుడు ఫలించిందని చెప్పింది. రియోలో భారత్ పతకాల పట్టిక తన ద్వారా ప్రారంభం కావడం ఆనందంగా ఉందని చెప్పింది. దేశానికి పతకాన్ని అందించే తొలి మహిళా రెజ్లర్‌గా ఎదుగుతానని తాను ఎన్నడూ ఊహించలేదని చెప్పింది. పురుషుల విభాగంలో పోటీపడుతున్న రెజ్లర్లు కూడా పతకాలు సాధిస్తారన్న నమ్మకం తనకు ఉందని 23 ఏళ్ల సాక్షి తెలిపింది.
కలిసొచ్చిన అదృష్టం
సాక్షి పతకాన్ని సాధించడంలో ఆమె ఆత్మవిశ్వాసం, కృషి ఒక కారణమైతే, అదృష్టం కలిసిరావడం మరో కారణం. క్వార్టర్ ఫైనల్స్‌లో రష్యా రెజ్లర్ వలెరియా కొబ్లొవాను ఢీకొన్న సాక్షి 2-9 తేడాతో ఓటమిపాలైంది. సాధారణంగా క్వార్టర్స్‌లో ఓడిన వారు ఇంటిదారి పడతారు. కానీ, రెజ్లింగ్ నిబంధనలను అనుసరించి, కొబ్లొవా ఫైనల్ చేరడంతో సాక్షికి రెపీచేజ్‌లో కిర్గిస్థాన్‌కు చెందిన అయిసలూ టినిబెకొవాతో తలపడే అవకాశం లభించింది. అక్కడ కూడా సాక్షి పరాజయం దాదాపు ఖాయంగా కనిపించింది. ఒకానొక దశలో ఆమె 0-5 తేడాతో వెనుకబడింది. అయితే, చివరి 11 సెకన్ల వ్యవధిలో ఆమె మొత్తం బౌట్ ఫలితానే్న తిరగరాసింది. చివరి క్షణాల్లో ఎవరూ ఊహించని విధంగా చెలరేగిన ఆమె 8-5 ఆధిక్యంతో టినిబెకొవాను ఓడించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. రోథక్‌కు చెందిన సాక్షి ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాన్ని అందించిన నాలుగో మహిళగా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. ఇంతకు ముందు కరణం మల్లీశ్వరి 2000 సిడ్నీ ఒలింపిక్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో, 2012 లండన్ ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్‌లో మేరీ కోమ్, మహిళల బాడ్మింటన్ సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ కాంస్య పతకాలను గెల్చుకున్నారు. సాక్షి రెజ్లింగ్‌లో కాంస్యాన్ని అందుకొని వారి సరసన స్థానం సంపాదించింది.
ప్రశంసల జల్లు..
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్ 58 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్‌ను పలువురు ప్రస్తుత, మాజీ క్రీడాకారులు అభినందనల్లో ముంచెత్తారు. సాక్షి పతకాన్ని గెల్చుకున్న వార్త వెలువడిన వెంటనే భారత లెజెండరీ క్రికెటర్, రియో ఒలింపిక్స్ బ్రాండ్ అంబాసిడర్ సచిన్ తెండూల్కర్ ఆమెను అభినందిస్తూ ట్వీట్ చేశాడు. ఒక అద్భుతాన్ని సాక్షి సాకారం చేసిందని ప్రశంసించాడు. సాక్షి సాధించిన అపూర్వ విజయాన్ని మనసారా అభినందిస్తున్నానని భారత్‌కు 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిపెట్టిన ఏస్ షూటర్ అభినవ్ బింద్రా ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. భారత్‌కు గతంలో ఎవరూ ఇవ్వలేకపోయిన అద్భుత విజయాన్ని సాక్షి ఇచ్చిందని బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లో పతకాలను సాధించిన రెజ్లర్ సుశీల్ కుమార్ ట్వీట్ చేశాడు. ఆమె కోట్లాది మంది యువతకు మార్గదర్శకురాలిగా నిలుస్తుందని లండన్ ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించిన బాక్సర్ మేరీ కోమ్, బీజింగ్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత విజేందర్ సింగ్ పేర్కొన్నారు. ‘స్వర్ణం కంటే కాంస్య బరువైంది’ అంటూ లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెల్చుకున్న షూటర్ గగన్ నారంగ్ వ్యాఖ్యానించాడు. ఓటమి అంచున నిలిచినప్పటికీ ఆత్మవిశ్వాసంతో పోరాడి, చివరి క్షణాల్లో ఫైట్ ఫలితానే్న మార్చేసిన సాక్షి అసాధారణ ప్రతిభను ప్రతి ఒక్కరూ కీర్తించాల్సిందేనని భారత పరిమిత ఓవర్ల క్రికెట్ జట్లకు నాయకత్వం వహిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ పేర్కొన్నాడు. మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ కూడా సాక్షిని ప్రశంసిస్తూ సందేశం పంపాడు. భారత మాజీ కెప్టెన్, ప్రస్తుత టీమిండియా కోచ్ అనీల్ కుంబ్లే, స్విన్నర్ రవిచంద్రన్ అశ్విన్, భారత హాకీ జట్టు కెప్టెన్ పిఆర్ శ్రీజేష్, హాకీ క్రీడాకారుడు రూపీందర్ పాల్ సింగ్, షూటర్ హీనా సిద్ధు, బాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా తదితరులు కూడా సాక్షిని అభినందిస్తూ సందేశాలు పంపారు. పలువురు రాజకీయ ప్రముఖులు, నాయకలు, అభిమానులు సాక్షి ఇంటికి వెళ్లి, ఆమె తల్లిదండ్రులను అభినందించారు. ఆమె సాధించిన విజయం యావత్ దేశానికే గర్వకారణమని అంటూ, వారికి పుష్పగుచ్ఛాలను అందించారు.