క్రీడాభూమి

ఆహ్లాద భరితంగా ఆసీస్-కివీస్ డే/నైట్ టెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడిలైడ్, నవంబర్ 27: మూడు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య అడిలైడ్ ఓవల్ మైదానంలో శుక్రవారం ప్రారంభమైన చరిత్రాత్మక డే అండ్ నైట్ మ్యాచ్ (చివరి టెస్టు)లో తొలి రోజు ఎంతో ఆహ్లాద భరితంగా సాగింది. ఫ్లడ్‌లైట్ల వెలుగులో పింక్ బాల్‌తో జరిగిన ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు పోటెత్తారు. 47,441 మంది ప్రేక్షకుల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి రోజే 12 వికెట్లు కూలాయి. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టును ఆతిథ్య ఆస్ట్రేలియా బౌలర్లు గడగడలాడించారు. వీరిని ప్రతిఘటించడంలో న్యూజిలాండ్ జట్టు తీవ్ర ఒడిదుడుకులకు గురైంది. ఏడు పరుగులకే ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ (1) వికెట్‌ను చేజార్చుకున్న న్యూజిలాండ్ జట్టులో టామ్ లాథమ్ (50) టాప్ స్కోరర్‌గా నిలువగా, మిఛెల్ స్టాంటర్ (31), బిజె.వాట్లింగ్ (29), కాన్ విలియమ్‌సన్ (22), రాస్ టేలర్ (21), టిమ్ సౌథీ (16) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు సాధించలేకపోయారు. దీంతో న్యూజిలాండ్ జట్టు 65.2 ఓవర్లలో 202 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో మిఛెల్ స్టార్క్, జోష్ హాజెల్‌వుడ్ మూడేసి వికెట్లు కైవసం చేసుకోగా, నాథన్ లియోన్, పీటర్ సిడిల్ చెరో రెండు వికెట్లు సాధించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు కూడా ఆరంభంలోనే ఒడిదుడుకులకు గురైంది. 6 పరుగుల స్కోరు వద్ద నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (1) వికెట్‌ను కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు 34 పరుగులకు ఓపెనర్ జో బర్న్స్ (14) వికెట్‌ను కూడా చేజార్చుకుంది. అయితే కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (24), ఆడమ్ వోగ్స్ (9) అజేయంగా 20 పరుగులు జోడించారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 22 ఓవర్లలో 54 పరుగులు సాధించిన ఆస్ట్రేలియా ఇంకా 148 పరుగులు వెనుకబడి ఉంది.
హ్యూజెస్‌కు శ్రద్ధాంజలి
కాగా, ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మన్ ఫిలిప్ హ్యూజెస్ ప్రథమ వర్థంతి సందర్భంగా ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరుజట్ల ఆటగాళ్లతో పాటు షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియాలో జరిగిన ఇతర మ్యాచ్‌లలో ఆటగాళ్లు ఆయనకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆటగాళ్లతో పాటు షెఫీల్డ్ షీల్డ్ ఆటగాళ్లంతా సంతాప సూచకంగా నల్ల రంగు ఆర్మ్‌బ్యాండ్లు (చేతి బ్యాండ్లు) ధరించి హ్యూజెస్‌కు నివాళులర్పించారు. కెరీర్‌లో 26 టెస్టు మ్యాచ్‌లు ఆడిన హ్యూజెస్ (25) మైదానంలో బంతి తగలడంతో గత ఏడాది నవంబర్ 27వ తేదీన కన్నుమూసిన విషయం తెలిసిందే.

మిఛెల్ స్టార్క్ (3/24)