క్రీడాభూమి

పరుగుల వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 5: మొత్తం 323 బంతులు.. 59 సిక్సర్లు.. 129 ఫోర్లు.. 1,009 పరుగులు.. ఇది ఒక ఇన్నింగ్స్‌కు సంబంధించిన వివరాలుకావు. ఒక టీనేజర్ సాధించిన పరుగులు. 15 ఏళ్ల ప్రణవ్ ధనవాదే నెలకొల్పిన అరుదైన రికార్డు. భండారీ కప్ అంతర్ పాఠశాల క్రికెట్ టోర్నమెంట్‌లో ఆర్య గురుకుల్‌తో జరిగిన మ్యాచ్‌లో కెసి గాంధీ హయ్యర్ సెకండరీ స్కూల్ తరఫున ఆడిన ప్రణవ్ పరుగుల వరద పారించాడు. ఆ జట్టు మూడు వికెట్లకు 1,465 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, అప్పటికి ప్రణవ్ 1,009 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఒక జట్టు, ఒక బ్యాట్స్‌మన్ అత్యధిక స్కోర్ల రికార్డులు ఈ మ్యాచ్‌లో నమోదయ్యాయి. 90 సంవత్సరాల క్రితం, 1926లో న్యూ సౌత్ వేల్స్‌పై విక్టోరియా 1,107 పరుగులతో నెలకొల్పిన రికార్డును గాంధీ స్కూల్ అధిగమించడం విశేషం. ప్రణవ్ ఏకంగా 1899 సంవత్సరం నాటి రికార్డును బద్దలు చేశాడు. నార్త్ టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో క్లార్క్స్ హౌస్ ఆటగాడు ఎఇజె కొలిన్స్ 628 (నాటౌట్) పరుగులతో సృష్టించిన రికార్డు ప్రణవ్ దెబ్బతో రెండో స్థానానికి పడిపోయింది. ఆటోరిక్షా డ్రైవర్ కుమారుడైన ప్రణవ్ పదో తరగతి విద్యార్థి, ముంబయి క్రికెట్ సంఘం (ఎంసిఎ) కోచ్ మోబిన్ షేక్ వద్ద శిక్షణ పొందుతున్నాడు. తన మారథాన్ ఇన్నింగ్స్‌లో భాగంగా అతను 546 పరుగులకు చేరుకున్నప్పుడు, భారత స్కూల్స్ క్రికెట్‌లో పృథ్వీ షా నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. 2013లో జరిగిన హారిస్ షీల్డ్‌లో రజ్వీ స్ప్రింగ్ ఫీల్డ్‌కు ప్రాతినిథ్యం వహించిన పృథ్వీ సెయింట్ ఫ్రాన్సిస్ డి అసిస్సీ పాఠశాలపై 545 పరుగులు సాధించాడు. ముంబయికే చెందిన పృథ్వీ రికార్డును అదే నగరానికి చెందిన ప్రణవ్ తిరగరాయడం విశేషం. క్రికెట్ చరిత్రలోనే ఒక ఇన్నింగ్స్‌లో 1,000 పరుగుల మైలురాయిని అధిగమించిన తొలి బ్యాట్స్‌మన్‌గా ప్రణవ్ రికార్డు పుస్తకాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించాడు.

ప్రణవ్ సాధించింది సామాన్యమైన స్కోరుకాదు. అన్ని పరుగులు చేయడం సులభం కాదు. వెయ్యికిపైగా పరుగులు చేసిన అతను అభినందనీయుడు.
- మహేంద్ర సింగ్ ధోనీ, భారత వనే్డ, టి-20 కెప్టెన్

ఒక ఇన్నింగ్స్‌లో వెయ్యికిపైగా పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించిన ప్రణవ్‌కు అభినందనలు. ఇంకా కష్టపడి, ఉన్నత శిఖరాలకు చేరుకుంటావని ఆశిస్తున్నాను. నీ నుంచి మరిన్ని గొప్ప ఇన్నింగ్స్‌ను కోరుకుంటున్నాను.
- సచిన్ తెండూల్కర్, భారత మాజీ క్రికెటర్

ప్రణవ్ చాలా గొప్పగా ఆడాడు. అత్యంత అరుదైన రికార్డును నెలకొల్పాడు. అతనికి అభినందనలు. ఏ స్థాయిలో ఈ రికార్డు నెలకొన్నదనేది ముఖ్యం కాదు. సచిన్ తెండూల్కర్‌లా ప్రణవ్ కూడా అత్యున్నత శిఖరాలను అందుకుంటాడన్న నమ్మకం నాకు ఉంది.
- హర్భజన్ సింగ్, సీనియర్ స్పిన్నర్
ప్రణవ్‌ను చూసి గర్విస్తున్నాను. అతనికి ఆటపై అంకిత భావం ఉంది. చాలా కష్టపడతాడు. అతని శ్రమ ఫలించింది. అతని ఇన్నింగ్స్ ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ప్రణవ్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంది. అతని ఆటే ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఇదే దీక్షతో అతను మున్ముందు శిక్షణను కొనసాగించాలి.
- మోబిన్ షేక్, ఎంసిఎ కోచ్
ప్రణవ్ బ్యాటింగ్ ప్రతిభ గురించి ఎంత చెప్పినా తక్కువే. సమర్థులైన క్రికెటర్లకు మన దేశంలో కొదువలేదని అతను నిరూపించాడు. భవిష్యత్తులో జాతీయ జట్టుకు అతను సేవలు అందించే అవకాశాలున్నాయి. కళ్యాణ్‌లో క్రికెట్ అకాడెమీని నెలకొల్పేందుకు సాయపడాలని కోచ్ మోబిన్ షేక్ కోరాడు. స్థలం దొరికితే అకాడెమీకి ఎంసిఎ సాయం చేస్తుంది. ప్రణవ్ లాంటి ప్రతిభావంతులకు నిలయమైన కళ్యాణ్‌లో అకాడెమీ అవసరం ఎంతైనా ఉంది.
- దిలీప్ వెంగ్‌సర్కార్, ఎంసిఎ ఉపాధ్యక్షుడు, మాజీ క్రికెటర్