క్రీడాభూమి

రియోకు ‘ఒలింపిక్స్’ భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, సెప్టెంబర్ 4: రియో నగరాన్ని ఒలింపిక్స్ భయపెడుతున్నాయి. సమ్మర్ ఒలింపిక్స్ ముగిసి సుమారు రెండు వారాలు కావస్తున్నా, అప్పటి సమస్యలు ఇంకా బ్రెజిల్‌ను వెంటాడుతునే ఉన్నాయి. ప్రత్యేకించి రియోలో పరిస్థితులు ఇంకా గాడిలో పడలేదు. అనేకానేక అడ్డంకులను అధిగమించి, సమ్మర్ ఒలింపిక్స్‌ను విజయవంతంగా ముగించిన అధికారులు ఊపిరి పీల్చుకునే లోపే పారాలింపిక్స్ వచ్చిపడుతున్నాయి. ఈనెల 7 నుంచి 18 వరకు జరిగే పారాలింపిక్స్‌కు రియో ముస్తాబవుతున్నది. సమ్మర్ ఒలింపిక్స్‌తో పోల్చలేకపోయినా, పారాలింపిక్స్ నిర్వాహణకు కూడా భారీగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయి, పతనం అంచున నిలిచిన బ్రెజిల్‌కు పారాలింపిక్స్ మరింత భారం కానున్నాయి. ఏదో ఒక అవయవ లోపం ఉన్న అథ్లెట్లు పోటీ పడతారు కాబట్టి, వారికి ప్రత్యేక సదుపాయాలను సమకూర్చాల్సిన బాధ్యత నిర్వాహకులపై ఉంది. 23 క్రీడలకు సంబంధించిన 528 ఈవెంట్స్‌లో వివిధ దేశాలకు చెందిన సుమారు 4,500 మంది దివ్యాంగులు పతకాల కోసం బరిలోకి దిగనున్నారు. వీరికి ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో బసను ఏర్పాటు చేస్తున్నారు. అయితే, కోచ్‌లు, అధికారులకు అక్కడి సౌకర్యాలు సరిపోతాయా అన్నదే ప్రశ్న.
మళ్లీ ముస్తాబైన నగరం..
ఇటీవలే సమ్మర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చిన రియో నగరం మరోసారి ముస్తాబైంది. ఈసారి పారాలింపిక్స్‌ను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఒలింపిక్స్ నిర్వాహణ ఖర్చు అంచనాలను మించిపోయింది. బ్రెజిల్ ఆర్థికంగా పతనమయ్యే దుస్థితిని ఎదుర్కొంటున్నది. పారాలింపిక్స్‌కూ ఇదే పరిస్థితి తప్పకపోవచ్చు. ఈ ఆర్థిక ఒడిదుడుకుల మధ్యే రియో నగరం పారాలిపింక్స్ కోసం అస్తశ్రస్త్రాలను సమకూర్చుకుంది. ఈ పోటీల కోసం మరోసారి ముస్తాబైంది. సమస్యలను అధిగమిస్తూ, వివిధ దేశాల నుంచి వచ్చే దివ్యాంగ అథ్లెట్లు, అధికారులు, అభిమానులకు ఆతిథ్యమివ్వడానికి సిద్ధమైంది. నిజానికి రియో నగరం చూసేందుకు చాలా అందంగా కనిపిస్తుంది. కుడివైపు టూ బ్రదర్స్, ఎడమ వైపు కోర్కొవాడో, మధ్యన సుగర్‌లూఫ్ పర్వత శ్రేణులతో అలరిస్తుంది. క్రీస్ట్ ది రిడీమర్ భారీ విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. బొటాలొగో తీరం రియోను పర్యాటక కేంద్రంగా మార్చేసింది. రియో మున్సిపాలిటీ విస్తీర్ణం 1,221 కిలోమీటర్లు. మెట్రో 4,557 కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. నగర జనాభా సుమారు 65 లక్షలు. సమ్మర్ ఒలింపిక్స్ కోసం సుమారు 77,000 మందిని నగరం నుంచి ఇతర ప్రాంతాలకు తరలించారు. చాలా మందిని బలవంతంగా ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఒలింపిక్స్ ముగిసిన తర్వాత వారంతా మళ్లీ తమతమ నివాసాలకు చేరుకుంటున్నారు. పారాలింపిక్స్ కోసం మరోసారి తమను తరలించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని వారంతా స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే కార్మికులు, ఉద్యోగులు తమతమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనలు చేస్తున్నారు. ఒలింపిక్స్ కారణంగా ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిన వారు మళ్లీ అదే పరిస్థితి తలెత్తితే, ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఒలింపిక్స్ సమయంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన బ్రెజిల్ 85,000 మందిని రంగంలోకి దించింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో వినియోగించిన సంఖ్య కంటే ఇది రెట్టింపు. రియో బయటకు ఎంతో అందంగా కనిపించినా, లోనికి అడుగుపెడితే అడుగడుగునా సమస్యలు తాండవిస్తుంటాయి. ప్రత్యేకించి హింసాప్రవృత్తి అక్కడ ఎక్కువ. పోలీసులు కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతుంటారు. ఈ పరి స్థితుల్లో పారాలింపిక్స్‌ను సమ ర్థంగా నిర్వహించడం సాధ్య మా అని అధికారులు ఆం దోళన పడుతున్నారు.

స్పందన డౌటే!

రియో డి జెనీరో, సెప్టెంబర్ 4: ప్రపంచ క్రీడా రంగంలోనే అతి పెద్ద ఈవెంట్ ఒలింపిక్స్‌కే రియోలో స్పందన అంతమాత్రంగా కనిపించింది. సహజంగా ఒలింపిక్స్ సమయంలో స్టేడియాలు కిక్కిరిసిపోయినా పారాలింపిక్స్‌ను చూసేందుకు ఎవరు ఉండరు. స్టేడియాలన్నీ ఖాళీగా కనిపిస్తాయి. రియోలో ఒలింపిక్స్‌కే దిక్కులేకపోతే, పారాలింపిక్స్‌ను చూసేందుకు ఎవరూ రారన్నది వాస్తవం. ఒలింపిక్స్ సమయంలో టికెట్ల అమ్మకాలు మందగొడిగా సాగడంతో ప్రేక్షకుల్లేక క్రీడా వేదికలన్నీ వెలవెలబోయాయి. ఒలింపిక్స్ ఎక్కడ జరిగినా అమ్మకానికి ఉంచిన టికెట్లన్నీ కొద్ది గంటల్లోనే అమ్ముడవుతాయి. పారాలింపిక్స్‌కు మాత్రం అంతటి స్పందన ఉండదు. కానీ, రియోలో ఒలింపిక్స్‌కు మిగతా ప్రాంతాల్లో జరిగిన పారాలింపిక్స్ కంటే ఎక్కువ స్పందన కనిపించలేదు. ఆ అనుభవాన్ని బట్టి చూస్తే పారాలింపిక్స్‌కు వచ్చే వారు దాదాపుగా ఎవరూ ఉండరని స్పష్టమవుతోంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ ఒలింపిక్స్ కోసం తొమ్మిది బిలియన్ పౌండ్లు ఖర్చు చేస్తే, దానికి తగినట్టు ఆదాయం రాలేదు. ఈ పరిస్థితుల్లో పారాలింపిక్స్‌కు చేసే ఖర్చులో ఒక్క పైసా కూడా వెనక్కు రాదన్నది నిజం.

దొంగల బెడద

రియో డి జెనీరో, సెప్టెంబర్ 4: రియోలో దొంగలు చెలరేగిపోతుంటారు. ఈ విషయం గత నెల 21న ముగిసిన సమ్మర్ ఒలింపిక్స్‌లో స్పష్టమైంది. విదేశీ టూరిస్టులపై కాపుకాసి దాడి చేయడం, చేతికి అందినవన్నీ దోచుకోవడం అక్కడ సర్వసామాన్యం. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన అథ్లెట్లు, అధికారులను కూడా దొంగలు వదల్లేదు. ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే మాయమయ్యాయి. ఒలింపిక్ క్రీడా గ్రామంలోనే దొంగతనాలు జరగడం నిర్వాహకుల సామర్థ్యానికి సవాళ్లు విసిరింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులను మోహరింప చేసినా, దొంగతనాలకు అడ్డుకట్ట పడలేదు. సమ్మర్ ఒలింపిక్స్ పరిస్థితే పారాలింపిక్స్ సమయంలో పునరావృతమయ్యే ప్రమాదం లేకపోలేదు. రోడ్లపై వెళుతున్న విదేశీయులను లక్ష్యం చేసుకొని వారి పర్సులు, హ్యాండ్ బ్యాగ్స్, విలువైన వస్తువులను దొంగలు కాజేస్తున్న సిసి టీవీ ఫుటేజీలను యావత్ ప్రపంచం తిలకించింది. పరువు పోగొట్టుకున్న రియో పోలీస్ అధికారులు పారాలింపిక్స్‌లో ఎలాంటి పరిస్థితి ఎదరవుతుందోనని భయపడుతున్నారు. రియో వీధుల్లో దొంగల విజృంభణకు అడ్డూఅదుపూ లేదు. క్రీడా గ్రామంలోనూ అలాంటి సంఘటనలే చోటు చేసుకున్నాయి. చాలా మంది అథ్లెట్ల మొబైల్ ఫోర్లు, దుస్తులు, ఐపాడ్‌లు చోరీకి గురైనట్టు ఆరోపణలు వచ్చాయి. పారాలింపిక్స్ సమయంలో దొంగతనాలకు ఏ విధంగా అడ్డుకట్ట వేయాలో అర్థంగాక అధికారులు ఆందోళన పడుతున్నారు.