క్రీడాభూమి

ఒంటిచేత్తో స్వర్ణం ( పారాలిపింక్స్ జావెలిన్ త్రోలో దేవేంద్ర రికార్డు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారాలిపింక్స్ జావెలిన్ త్రోలో దేవేంద్ర రికార్డు

రియో డి జెనీరో: పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో స్వర్ణ పతకాన్ని జావెలిన్‌త్రోయర్ దేవేంద్ర
ఝజారియా అందించాడు. టైటిల్‌ను సాధించే క్రమంలో అతను కొత్త ప్రపంచ రికార్డును సృష్టించాడు. పారాలింపిక్స్‌లో రెండు స్వర్ణాలను కైవసం చేసుకున్న తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర నెలకొల్పాడు. పురుషుల ఎఫ్-46 విభాగంలో అతను జావెలిన్‌ను 63.97 మీటర్ల దూరానికి విసిరి, 2004 ఏథెన్స్ పారాలింపిక్స్‌లో 62.15 మీటర్లతో తాను
నెలకొల్పిన రికార్డును తానే అధిగమించాడు. పారా జావెలిన్ త్రోయర్స్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో దేవేంద్ర
మూడో స్థానంలో ఉండగా, నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న గవో చుంన్‌లియాంగ్ (చైనా) 59.93 మీటర్ల
దూరానికి జావెలిన్‌ను విసిరి రజత పతకాన్ని సాధించాడు. శ్రీలంకకు చెందిన హెరాత్ ముదియన్‌సేలగే
(58.23 మీటర్లు) కాంస్య పతకాన్ని అందుకున్నాడు.

కూతురుకిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు

12 ఏళ్ల తర్వాత..

పారాలింపిక్స్‌లో దేవేంద్ర 12 సంవత్సరాల తర్వాత పాల్గొన్నప్పటికీ స్వర్ణ పతకాన్ని సాధించడమేగాక, కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పడం విశేషం. 2004 ఏథెన్స్ పారాలింపిక్స్‌లో అతను తొలిసారి పోటీపడ్డాడు. అప్పుడు ప్రపంచ రికార్డును తిరగరాస్తూ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 2008, 2012 పారాలింపిక్స్‌ల ఎఫ్-46 విభాగంలో పోటీలను నిర్వహించలేదు. ఈసారి మళ్లీ ఈ విభాగంలో పోటీలను ప్రవేశపెట్టగా, 36 ఏళ్ల దేవేంద్ర తాను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నానని నిరూపించుకున్నాడు. 2013లో అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ నిర్వహించిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో విజేతగా నిలిచిన దేవేంద్రకు 2004లో భారత ప్రభుత్వం అర్జున అవార్డును ప్రదానం చేసింది. 2012లో అతనికి పద్మశ్రీ లభించింది. ఈ అవార్డును స్వీకరించిన తొలి పారాలింపియన్‌గా దేవేంద్ర గుర్తింపు సంపాదించాడు.

రియో డి జెనీరో, సెప్టెంబర్ 14: రియో పారాలింపిక్స్ పురుషుల ఎఫ్-46 ఈవెంట్‌లో స్వర్ణ పతకాన్ని గెల్చుకున్న దేవేంద్ర ఝజారియా ప్రపంచ రికార్డును నెలకొల్పడానికే పరిమితం కాలేదు. తన కూతురుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడుకూడా. పారాలింపిక్స్ కోసం ఫిన్లాండ్‌లో శిక్షణ పొందడానికి బయలుదేరే ముందు ఎల్‌కెజి చదువుతున్న కుమార్తె జియాతో పందెం వేశాడు. ఆమె టాప్‌గా వస్తే, తాను ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధిస్తానని శపథం చేశాడు. ఈ విషయాన్ని ఈవెంట్ పూర్తయిన తర్వాత అతను పిటిఐతో మాట్లాడుతూ చెప్పాడు. పోటీ ఆరంభానికి ముందు జియా తనకు ఫోన్ చేసి, తాను టాపర్‌గా వచ్చానని, ఒలింపిక్ పతకాన్ని తీసుకురావాలని చెప్పిందని అన్నాడు. జావెలిన్‌ను విసరడానికి వెళ్లినప్పుడు ఆమె మాటలే తన చెవిలో మారుమోగాయని, విజయమే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డానని చెప్పాడు.
రాత్రంతా జాగరణ
స్వర్ణ పతకం సాధించిన తర్వాత దేవేంద్ర రాత్రంతా నిద్ర పోలేదు. రాజస్థాన్‌లోని తన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడుతూ గడిపాడు. ‘అబ్ క్యా సోనా? అబ్ హమే కుఛ్ నహీ హోగా. హమ్‌తో రాష్ట్రీయ ధ్వజ్ కే సాథ్ సెలబ్రేషన్ కరేంగే’ (ఇప్పుడు ఏం నిద్రపోతాను. ఇప్పుడు నాకేమీ కాదు. త్రివర్ణ పతాకాన్ని ధరించి సెలబ్రేషన్ చేసుకుంటాను) అన్నాడు.
మా అబ్బాయి గుర్తుపట్టడు!
పారాలింపిక్స్ కోసం తాను చాలా కాలంగా ప్రత్యేక శిక్షణ పొందుతున్నానని దేవేంద్ర చెప్పాడు. ఎక్కువ సేపు ఇంటికి దూరంగా ఉంటున్నానని, అందుకే తన కొడుకు కావ్యన్ తనను గుర్తుపట్టే అవకాశం కూడా లేదని అన్నాడు. తన భార్య మంజు ఫొటోలు చూపిస్తుందని, ఆ రకంగానైనా కావ్యన్ తనను గుర్తుపడతాడేమోనని దేవేంద్ర చెప్పాడు.
ప్రశంసల వెల్లువ
న్యూఢిల్లీ: రియో పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్ త్రోయర్ దేవేంద్రను ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు. దేవేంద్ర ప్రతిభ యువతకు మార్గదర్శకమవుతుందని, అతని విజయం భారతీయులందరికీ గర్వకారణమని మోదీ ట్వీట్ చేశారు.
దేవేంద్ర స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడంతోపాటు కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పడం ఎంతో ఆనందంగా ఉందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. భారత మాజీ క్రికెటర్లు సచిన్ తెండూల్కర్, వీరేంద్ర సెవాగ్, మహమ్మద్ కైఫ్‌తోపాటు షూటర్ అభినవ్ బింద్రా తదితరులు కూడా దేవేంద్రను అభినందించారు.
అందరికీ కృతజ్ఞతలు
ఎంతో మంది కృషి ఫలితంగానే తాను రియో పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించగలిగానని దేవేంద్ర అన్నాడు. తల్లి జివానీ దేవి, భార్య మంజు, పర్సనల్ కోచ్ సునీల్ తన్వర్, చిన్ననాటి స్నేహితులు తన ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారని చెప్పాడు. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియచేశాడు. ఫిన్లాండ్‌లో శిక్షణ పొందుతున్నంత కాలం తాను ఎవరితోనూ ఫోన్లో కూడా మాట్లాడలేదని చెప్పాడు. తన ఏకాగ్రత దెబ్బ తినకూడదన్న ఉద్దేశంతోనే కుటుంబ సభ్యులు కూడా ఫోన్ చేసేవారు కారని తెలిపాడు. ఎంతోమంది ఎన్నో రకాలుగా త్యాగాలు చేయడం వల్లే తాను లక్ష్యాన్ని అందుకోగలిగానని చెప్పాడు.
స్ఫూర్తిదాయకుడు ఎగో
దేవేంద్రకు స్ఫూర్తినిచ్చిన వారిలో కెన్యా త్రోయర్ జూలియస్ ఎగోను ప్రముఖంగా ప్రస్తావించాలి. దేవేంద్ర ఫిన్లాండ్‌లో శిక్షణ పొందుతున్నప్పుడు ఎగో కూడా అక్కడే ప్రాక్టీస్ చేశాడు. ఇద్దరి మధ్య స్నేహం బలపడింది. దుర్భర దారిద్య్రాన్ని ఎదుర్కొంటూ ఏ విధంగా తాను త్రోయర్‌గా ఎదిగిందీ దేవేంద్రకు ఎగో చెప్పేవాడు. యూ ట్యూబ్‌లో చూసి జావెలిన్ త్రోను నేర్చుకున్న విధానాన్ని వివరించేవాడు. రియో పారాలింపిక్స్‌లో అతనికి తప్పక స్వర్ణ పతకం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఎగో మాటలే దేవేంద్రకు స్ఫూర్తిమంత్రాలయ్యాయి. కాగా, తన విభాగంలో ఎగో కాంస్య పతకాన్ని అందుకోవడం విశేషం.

చచ్చిబతికాడు..

న్యూఢిల్లీ: రాజస్థాన్ చురూ జిల్లాలోని మారుమూల గ్రామంలో పుట్టిన దేవేంద్ర ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు ప్రమాదానికి గురయ్యాడు. ఆడుకుంటూ చెట్టు ఎక్కిన అతను పొరపాటున విద్యుత్ వైరును పట్టుకున్నాడు. షాక్ కొట్టి కింద పడిన అతనిని అంతా చనిపోయాడనే అనుకున్నారు. కానీ, అదృష్టం బాగుండి దేవేంద్ర బతికాడు. అయితే, విద్యుదాఘాతం వల్ల అతని ఎడమ చేయి మోచేతికి కింది భాగాన్ని తీసివేయక తప్పలేదు. వైకల్యాన్ని ఏమాత్రం పట్టించుకోని అతను సాధారణ పిల్లలతో ఆడేందుకు ఇష్టపడేవాడు. కానీ, వారు మాత్రం అతనితో ఆడేందుకు విముఖత చూపేవారు. ఒంటరి తనాన్ని జయించే క్రమంలోనే అతను కర్రనే జావెలిన్‌గా చేసుకొని విసిరేవాడు. దేవేంద్ర స్కూల్‌లో చదువుతున్నప్పుడు అర్జున అవార్డు గ్రహీత ఆర్డీ సింగ్ అతనిలోని ప్రతిభను తొలుత గుర్తించాడు. జావెలిన్‌త్రోలో శిక్షణ ఇచ్చాడు. 2013 ఐపిసి ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తర్వాత అతనికి వెనక్కు తిరిగి చూసుకునే అవసరం లేకపోయింది.