క్రీడాభూమి

రియో పారాలింపిక్స్‌లో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, సెప్టెంబర్ 18: రియో పారాలింపిక్స్‌లో విషాదం చోటు చేసుకుంది. ఇరాన్ సైక్లిస్టు బహ్మాన్ గొల్బార్నెజాద్ రేసు జరుగుతున్నప్పుడు ప్రమాద వశాత్తు కింద పడి తీవ్ర గాయాలకు లోనయ్యాడు. అతనిని బర్రాలోని యూనిమ్డ్ రియో ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అంగ వైకల్యం ఉన్నప్పటికీ, సైకిల్ తొక్కగల వారికి ప్రత్యేకించిన సి 4-5 విభాగంలో 48 ఏళ్ల బహ్మాన్ పోటీపడ్డాడు. రెండు గంటలకుపైగా సమయం పట్టే ఈ రేసులో ఎత్తయిన ప్రదేశం నుంచి కిందకు వస్తుండగా పొరపాటున అతను బ్యాలెన్స్ కోల్పోయి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతనిని సంఘటన స్థలంలోనే ప్రాథమిక చికిత్సను అందించారు. అనంతరం క్రీడా గ్రామంలోని అథ్లెట్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ బహ్మాన్‌కు గుండెపోటు రావడంతో తక్షణమే యూనిమ్డ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడికి చేరుకున్న కొన్ని నిమిషాల్లోనూ అతను మృతి చెందాడు.
ఐపిసి దిగ్భ్రాంతి
ఇరాన్ సైక్లిస్టు బహ్మాన్ ప్రమాదంలో గాయపడి మృతి చెందిన సంఘటన పట్ల అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ (ఐపిసి) దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ఇరాన్‌లోని అతని కుటుంబ సభ్యులకు తెలిపామని ఐపిసి ఒక ప్రకటనలో పేర్కొంది. క్రీడా గ్రామంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి బహ్మాన్ మృతికి సంతాపం ప్రకటించింది. ఇరాన్, హెర్జగోవినా జట్ల మధ్య వాలీబాల్ ఫైనల్ జరుగుతున్నప్పుడు ఇరాన్ పారాలింపిక్ పతాకాన్ని అవతనం చేసింది. అదే విధంగా క్రీడా గ్రామంలో ఇరాన్ జెండాను సగానికి దించింది. పారాలింపిక్స్ ముగింపు దశకు చేరుకున్న తరుణంలో ఇలాంటి విషాద సంఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని ఐపిసి అధ్యక్షుడు ఫిలిప్ క్రావెన్ అన్నాడు. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించాడు.
సమ్మర్ ఒలింపిక్స్‌లోనూ..
రియో సమ్మర్ ఒలింపిక్స్‌లోనూ సైక్లిస్టుకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే, గాయాలు ప్రాణాంతకం కాకపోవడంతో బతికిబట్టకట్టింది. మహిళల రోడ్ రేస్‌లో అందరి కంటే ముందు దూసుకెళుతూ పొరపాటున పట్టుతప్పి కింద పడిన డచ్ సైక్లిస్ట్ అనేమిక్ వాన్ వీటన్ తీవ్రంగా గాయపడింది. స్పృహ కోల్పోయిన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెను ఐసియులో ఉంచి చికిత్స జరుపుతున్నారు. 137 కిలోమీటర్లు ఉండే ఈ రేస్‌లో ఆమె 127 కిలోమీటర్లను పూర్తి చేసింది. అప్పటికే అందరి కంటే ముందున్న ఆమె మరో పది కిలోమీటర్లను పూర్తి చేసి ఉంటే స్వర్ణ పతకాన్ని గెల్చుకునేది. కానీ, వేగంగా వెళుతున్నప్పుడు పెడల్ పైనుంచి ఆమె కాలు జారడంతో పట్టుతప్పింది. హ్యాండిల్ బార్ మీద నుంచి తల్లకిందులుగా పడిన ఆమె తల బలంగా నేలకు తగిలింది. రెండు చోట్ల మెడ ఎముకలు విరిగినట్టు వైద్యులు నిర్ధారించారు.
విజేత కంట నీరు!
మహిళల రోడ్ రేస్‌లో లీడర్ పొజిషన్‌లోవున్న అనేమిక్ వీటన్ గాయపడగా, నెదర్లాండ్స్‌కే చెందిన అన్నా వాన్ డెర్ బ్రెగెన్ ఆ రేసును గెల్చుకుంది. స్వర్ణ పతకం సాధించిన తర్వాత మాట్లాడుతూ బ్రెగెన్ కన్నీటి పర్యంతమైంది. అనేమిక్ వీటన్ కిందపడడం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, అయితే, ఆమె స్థానంలో దేశానికి పతకాన్ని సాధించే బాధ్యతను తాను స్వీకరించి రేసును పూర్తి చేశానని తెలిపింది. ఆమె త్వరలోనే కోలుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసింది. రజత పతకాన్ని గెల్చుకున్న స్వీడన్ సైక్లిస్టు ఎమ్మా జొహాన్సన్ కూడా ఈ సంఘటనపై స్పందించింది. అనేమిక్ వీటన్ త్వరలోనే మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టాలని కోరుకుంటున్నట్టు అప్పట్లో ఆమె చెప్పింది.

చిత్రం.. అనేమిక్ వీటన్