క్రీడాభూమి

టీమిండియాకు ఉజ్వల భవిష్యత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: ఇప్పటి భారత టెస్టు క్రికెట్ జట్టుకు ఉజ్వల భవిష్యత్తు ఉందని భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత్‌లో జరగనున్న టెస్టు సిరీస్‌లపై ఒక చానెల్ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీతో కలిసి పాల్గొన్న లక్ష్మణ్ మాట్లాడుతూ న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి ప్రపంచ మేటి జట్లతో టీమిండియా మొత్తం 13 టెస్టులు ఆడనున్న విషయాన్ని అతను గుర్తుచేశాడు. స్వదేశంలో, గొప్ప జట్లపై ఆడిన అనుభవం రానున్న కాలంలో ఆటగాళ్లకు బాగా ఉపయోగపడుతుందని చెప్పాడు. టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ట్రెండ్‌సెట్టర్‌గా అభివర్ణించాడు. అతని నాయకత్వంలో టీమిండియా అద్భుతాలు సృష్టిస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నాడు. జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారని, కాబట్టి సుదీర్ఘ కాలం వీరి కెరీర్ కొనసాగుతుందని ‘వేరీ వేరీ స్పెషల్’గా అభిమానులు ముద్దుగా పిలుచుకునే హైదరాబాదీ అన్నాడు. అందుకే, ఇప్పటి టీమిండియా చాలాకాలం అగ్రశ్రేణి జట్టుగా రాణించే అవకాశాలు ఉన్నాయని అన్నాడు. సరైన సమయంలో జాతీయ జట్టులోకి వచ్చిన యువ ఆటగాళ్లకు 13 టెస్టులు ఆడే అవకాశం లభించడం అదృష్టమని అన్నాడు.
త్వరలోనే కుదుటపడుతుంది: కపిల్
టీమిండియాలో లెజెండరీ క్రికెటర్లు చాలా మంది ఇటీవల కాలంలో రిటైరయ్యారని, అయితే, వారు లేకపోయినా త్వరలోనే టీమిండియా పరిస్థితి కుదుటపడుతుందని మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ధీమా వ్యక్తం చేశాడు. సచిన్ తెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ వంటి మేటి క్రికెటర్లు ప్రస్తుతం జట్టులో లేకపోయినప్పటికీ, యువ ఆటగాళ్లు చక్కటి ప్రతిభతో రాణిస్తారన్న నమ్మకం తనకు ఉందన్నాడు. పేరొందిన క్రికెటర్లు రిటైరైన తర్వాత జట్టుకు మార్గదర్శకాన్ని ఇచ్చే బాధ్యతను కోహ్లీ స్వీకరించాడని కపిల్ చెప్పాడు. రవిచంద్రన్ అశ్విన్‌ను కేవలం బౌలర్‌గానే కాకుండా ఆల్‌రౌండర్‌గా చూడాలని చెప్పాడు. టెస్టు క్రికెట్‌లో అన్ని విభాగాల్లోనూ రాణిస్తే సత్తా అతనికి ఉందన్నాడు. న్యూజిలాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌లో విజయం భారత్‌నే వరిస్తుందని అన్నాడు.
నెట్స్‌లో కష్టపడాలి: బ్రెట్ లీ
ఫాస్ట్ బౌలర్లు నెట్స్‌లో ఎక్కువగా కష్టపడాలని, పదునైన బంతులు వేయడం నేర్చుకోవాలని బ్రెట్ లీ హితవు పలికాడు. ఇటీవల కాలంలో చాలా మంది యువ ఫాస్ట్ బౌలర్లు ఎక్కువ సవమయాన్ని జిమ్‌లకు కేటాయించడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని అన్నాడు. శరీరంలో నడుము పైభాగాన్ని తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్న బౌలర్లు సామర్థ్యాన్ని విస్మరిస్తున్నారని చెప్పాడు. సమర్థులైన బౌలర్లుగా రాణించేందుకు కృషి చేయాలన్నాడు. కివీస్, భారత్ పోరు ఉత్కంఠగా సాగుతుందన్నాడు.