క్రీడాభూమి

1,192 రోజుల క్రీడోత్సవాలకు తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనా టాప్
రియో పారాలింపిక్స్‌లో 107 స్వర్ణాలతో చైనా అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఆ దేశానికి మొత్తం 239 పతకాలు లభించాయి. వాటిలో 81 రజతంకాగా, 51 కాంస్య పతకాలు. గ్రేట్ బ్రిటన్ 64 స్వర్ణాలు, 39 రజతాలు, మరో 44 కాంస్యాలు (మొత్తం 147) సాధించి రెండో స్థానంలో నిలిచింది. 41 స్వర్ణాలు, 37 రజతాలు, 39 కాంస్యాలు (మొత్తం 117) దక్కించుకున్న ఉక్రెయిన్ మూడో స్థానాన్ని సంపాదించుకుంది. అమెరికా (40 స్వర్ణాలుసహా 115), ఆస్ట్రేలియా (22 స్వర్ణాలుసహా 81), జర్మనీ (18 స్వర్ణాలుసహా 57), నెదర్లాండ్స్ (17 స్వర్ణాలుసహా 62) వరుసగా నాలుగు నుంచి ఏడు స్థానాల్లోనిలిచాయి. పోటీలకు ఆతిథ్యమిచ్చిన బ్రెజిల్ (14 స్వర్ణం, 29 రజతం, 29 కాంస్యాలతో మొత్తం 72)కు ఎనిమిదో స్థానం లభించింది.

రియో డి జెనీరో, సెప్టెంబర్ 19: బ్రెజిల్‌లో సుమారు మూడేళ్లపాటు కొనసాగిన క్రీడోత్సవాలకు పారాలింపిక్స్ ముగింపుతో తెరపడింది. 2013లో కానె్ఫడరేషన్ కప్ సాకర్ చాంపియన్‌షిప్ పోటీలకు బ్రెజిల్ ఆతిథ్యమిచ్చింది. 2014లో ప్రపంచ కప్‌కు వేదికైంది. ఈ ఏడాది ఆగస్టులో సమ్మర్ ఒలింపిక్స్ జరిగాయి. ఇప్పుడు పారాలింపిక్స్ ముగియడంతో, బ్రెజిల్‌లో మొత్తం 1,192 రోజుల పాటు కొనసాగిన క్రీడా సంబరాలకు శుభం కార్డు పడింది. ఎన్నో సమస్యలు, మరెన్నో ఆటంకాలను అధిగమించి బ్రెజిల్ ఈ మెగా ఈవెంట్స్‌ను పూర్తి చేసింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని అల్లాడుతున్నప్పటికీ కానె్ఫడరేషన్ కప్ నుంచి పారాలింపిక్స్ దాకా అన్ని పోటీలను సమర్థంగా నిర్వహించింది. అన్ని వర్గాల ప్రజల నుంచేగాక, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు చివరికి పోలీసుల నుంచి కూడా ప్రతిఘటనలు ఎదురైన నేపథ్యంలో సమ్మర్ ఒలింపిక్స్, పారాలింపిక్స్ నిర్వాహణ బ్రెజిల్‌కు అసాధ్యమనే అంతా అనుకున్నారు. రాజకీయ అనిశ్చితి కూడా జత కలవడంతో సమస్య మరింత జటిలంగా మారింది. సమ్మర్ ఒలింపిక్స్ ముగిసిన రెండుమూడు రోజుల వ్యవధిలోనే అధ్యక్షురాలు డిల్మా రూసెఫ్‌పై అంతకు ముందు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని అక్కడి చట్టసభ ఆమోదించింది. ఫలితంగా ఆమె బలవంతంగా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అవిశ్వాస తీర్మానం నిర్ణయాన్ని ప్రతిపాదించిన వెంటనే ఆమె స్థానంలో తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న మైఖేల్ టెమెర్‌కే అధికార పగ్గాలు దక్కాయి. పూర్తి స్థాయిలో అధికార మార్పిడి జరిగిన కొద్ది రెండు వారాల్లోనే పారాలింపిక్స్ మొదలయ్యాయి. శారీరక లోపంతో బాధపడుతున్న వారి కోసం నిర్వహించే ఈ పారాలింపిక్స్ నిర్వాహణ కొత్త సర్కారుకు తలనొప్పిగా మారుతుందన్న వాదన వినిపించింది. గందరగోళ పరిస్థితులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, అనుమానాలను పటాపంచలు చేస్తూ తాత్కాలిక అధ్యక్షుడిగా సమ్మర్ ఒలింపిక్స్‌ను, అధ్యక్షుడి హోదాలో పారాలింపిక్స్‌ను టెమెర్ విజయవంతంగా పూర్తి చేశాడు.
30 బిలియన్ డాలర్ల ఖర్చు
మేజర్ క్రీడా ఈవెంట్స్‌కు ఆతిథ్యమిచ్చిన బ్రెజిల్ వాటి నిర్వాహణకుగాను సుమారు 30 బిలియన్ డాలర్లు (రమారమి రెండు లక్షల కోట్ల రూపాయలు) ఖర్చు చేసింది. దీనితో ఖజానా ఖాళీ అయింది. ఆర్థిక మాంద్యం దేశాన్ని కుదిపేస్తున్నది. నిరుద్యోగం, వౌలిక సదుపాయాల లేమి బ్రెజిల్‌ను అతలాకుతలం చేస్తున్నది. మొత్తం మీద కానె్ఫడరేషన్ కప్ నుంచి పారాలింపిక్స్ దాకా అన్ని క్రీడోత్సవాలు పూర్తికావడంతో ఊపిరి పీల్చుకుంది. అయితే, ఆర్థిక లోటు నుంచి బయటపడడానికి కనీసం మరో పదేళ్ల సమయం పడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
చివరి క్షణాల్లో ఊరట
సమ్మర్ ఒలింపిక్స్ తర్వాత తలెత్తిన పరిస్థితుల వల్ల పారాలింపిక్స్ అసలు జరుగుతాయా? లేదా? అన్న అనుమానాలు తలెత్తాయి. అందుకు తగ్గట్టుగానే నిర్వాహణ కమిటీ (ఒసి)కి డబ్బు అందలేదు. కనీస సౌకర్యాలు కూడా పూర్తి చేయలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఒసికి చివరి క్షణాల్లో ఊరట లభించింది. బ్రెజిల్ సర్కారుతోపాటు స్థానిక సంస్థలు కూడా కలిసి 76.5 మిలియన్ డాలర్లు విడుదల చేయడంతో ఒసి ఊపిరి తీసుకుంది. సమ్మర్ ఒలింపిక్స్ కంటే పారాలింపిక్స్‌ను ఘనంగా నిర్వహించింది. సమ్మర్ ఒలింపిక్స్‌తో పోలిస్తే పారాలింపిక్స్‌కు భారీ స్పందన లభించింది. సమ్మర్ ఒలింపిక్స్ సమయంలో దాదాపు అన్ని ఈవెంట్స్‌లోనూ స్టేడియాల్లో సీట్లు సగానికిపైగా ఖాళీగా కనిపించాయి. పారాలింపిక్స్‌లో అందుకు భిన్నంగా ఎక్కువ సీట్లు ప్రేక్షకులతో నిండిపోయాయి. టికెట్ ధరను కేవలం మూడు డాలర్లుగా నిర్ణయించడం ఈ భారీ స్పందనకు ఒక కారణం.
సమ్మర్ కంటే మెరుగు!
పారాలింపిక్స్‌లో సమ్మర్ ఒలింపిక్స్ కంటే ఉత్తమ ఫలితాలు నమోదుకావడం విశేషం. పురుషుల 1,500 మీటర్ల పరుగు (అందులకు/ టి-13 విభాగం)లో మొదటి నాలుగు స్థానాలు సంపాదించిన వారు సమ్మర్ ఒలింపిక్స్ విజేత కంటే వేగంగా గమ్యాన్ని చేరుకొని సంచలనం సృష్టించారు. సమ్మర్ ఒలింపిక్‌సలో అమెరికా రన్నర్ మాథ్యూ సెంట్రోవిజ్ 3 నిమిషాల 50 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని స్వర్ణ పతకం సాధించాడు. అయితే, పారాలింపిక్‌సలో అబ్దెల్లతిఫ్ బకా (అల్జీరియా) 3 నిమిషాల 48.29 సెకన్లలోనే రేస్‌ను పూర్తి చేసి స్వర్ణ పతకం సాధించాడు. తమిరు డెమిసె (ఇథియోపియా) 3 నిమిషాల 48.59 సెకన్లతో రజతాన్ని, హెన్రీ కిర్వా (కెన్యా) 3 నిమిషాల 49.59 సెకన్లతో కాంస్యాన్ని అందుకున్నారు. నాలుగో స్థానంలో నిలిచిన ఫవాద్ బకా (అల్జీరియా) రేస్‌ను 3 నిమిషాల 49.84 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ నలుగురూ సమ్మర్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత సెంట్రోవిజ్ కంటే వేగంగా లక్ష్యాన్ని చేరడం గమనార్హం. పారాలింపిక్స్ ఉన్నత ప్రమాణాలతో జరుగుతాయన్న విషయాన్ని ఈ ఫలితం స్పష్టం చేస్తున్నది.
జర్మనీకి చెందిన మార్సర్ రెమ్ కృత్రిమ కాలుతోనే లాంగ్ జంప్‌ను ప్రాక్టీస్ చేశాడు. రియో పారాలింపిక్స్‌లో అతను 8.40 మీటర్ల దూరానికి లంఘించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడంతోపాటు కొత్త ప్రపంచ రికార్డును కూడా నెలకొల్పాడు. సమ్మర్ ఒలింపిక్స్‌లో లాంగ్ జంప్ స్వర్ణ పతకం అమెరికా అథ్లెట్ జెఫ్ హెండర్సన్‌కు లభించింది. అతను 8.38 మీటర్ల దూరాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు. పారాలింపిక్స్‌లో రెమ్ అంతకంటే 0.20 మీటర్లు ఎక్కువ దూరానికి దూకి సత్తా చాటుకున్నాడు.
బ్యాచ్ గైర్హాజరు
పారాలింపిక్స్ ప్రారంభోత్సవానికి హాజరుకాని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) అధ్యక్షుడు థామస్ బ్యాచ్ ముగింపు ఉత్సవాలకు కూడా హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. 1984 తర్వాత పారాలింపిక్స్ ప్రారంభోత్సవానికిగానీ, ముగింపు ఉత్సవాలకుగానీ ఐఒసి చీఫ్ హాజరుకాకపోవడం ఇదే మొదటిసారి. ఒకప్పటి పశ్చిమ జర్మనీకి అధ్యక్షుడిగా వ్యవహరించిన వాల్టర్ షీల్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బెర్లిన్‌లోనే ఉండిపోయిన బ్యాచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకాలేదని ఐఒసి వర్గాలు ప్రకటించాయి. ముగింపు ఉత్సవానికి అతను తప్పక హాజరవుతాడని పేర్కొన్నాయి. కానీ, న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి శరణార్థుల శిఖరాగ్ర సమావేశానికి హాజరైన అతను ముగింపు ఉత్సవానికి హాజరుకాలేదని ఐఒసి వర్గాలు తెలిపాయి. నిజంగానే వేర్వేరు కారణాల వల్ల అతను పారాలింపిక్స్ మొదలు, తుది ఉత్సవాలకు హజరుకాలేదా? లేక మరేదైనా బలమైన కారణాలు ఉన్నాయా అన్న చర్చ మొదలైంది. రియో సమ్మర్ ఒలింపిక్స్‌లో చోటు చేసుకున్న టికెట్ల కుంభకోణంపై జర్మనీ పోలీసులు బ్యాచ్‌ను ప్రశ్నించనున్నారని, అందుకే ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజకుండా అతను అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని అనధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే అంశంపై బ్యాచ్‌ని ప్రశ్నించేందుకు బ్రెజిల్ పోలీస్ అధికారులు సిద్ధంగా ఉన్నారని, వారి నుంచి తప్పిచుకోవడానికే అతను ముగింపు ఉత్సవాలకు కూడా రాలేదని ఈ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం మీద పారాలింపిక్స్ ఆరంభం నుంచి చివరి వరకూ ఎప్పుడూ బ్యాచ్ లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆద్యంతం.. ఆసక్తికరం..
రియో పారాలింపిక్స్ ముగింపు ఉత్సవం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. బ్రెజిల్ చారిత్రక నేపథ్యాన్ని వివరించే ప్రయత్నం ఒకవైపు, ఆధునిక సంగీత, నృత్యాభినయాలు మరోవైపు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ప్రసిద్ధి చెందిన మరకానా ఫుట్‌బాల్ స్టేడియంలో ముగింపు వేడుకలు జొనథాన్ బాస్టోస్ సంగీతం ప్రదర్శనతో మొదలయ్యాయి. రెండు చేతులు లేకపోయినా, కాళ్లతోనే వాయిద్యాలను వాయించడంలో నైపుణ్యాన్ని సంపాదించాడు. కాళ్లతో గిటార్ వాయించిన అతను ఆహూతులను ఆకట్టుకున్నాడు. అనంతరం ఫైవ్ ఎ సైడ్ ఫుట్‌బాల్‌లో బ్రెజిల్ స్వర్ణ పతకం సాధించడంలో ముఖ్యభూమిక పోషించిన స్టార్ ఆటగాడు రికార్డిన్హో జాతీయ పతాకంతో ముందు నడవగా, వివిధ దేశాలకు చెందిన జెండాలను పట్టుకొని 160 మంది పరేడ్‌లో పాల్గొన్నారు. వనెస్సా డి మటా సంగీత విభావరి అలరించింది.

చిత్రం... వివిధ దేశాల జాతీయ పతాకాలతో పరేడ్ చేస్తున్న రియో పారాలింపిక్స్ వలంటీర్లు, అథ్లెట్లు. కాళ్లతోనే గిటార్ వాయస్తున్న జొనథాన్ బాస్టోస్