క్రీడాభూమి

కివీస్‌పై స్పిన్ చార్జి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, సెప్టెంబర్ 20: న్యూజిలాండ్‌పై స్పిన్ అస్త్రాన్ని ప్రయోగించి విజయాలను నమోదు చేయడానికి భారత క్రికెట్ జట్టు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నది. పిచ్‌లను స్పిన్ బౌలింగ్‌కు అనుకూలంగా తయారు చేసుకొని, స్వదేశంలో రెచ్చిపోవడం టీమిండియాకు అలవాటే. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధికారుల నుంచి జట్టు కోచ్, కెప్టెన్ వరకూ ప్రతి ఒక్కరూ క్యూరేటర్లపై ఒత్తిడి పెంచేవారే. సాధ్యమైనంత వరకూ పచ్చిక ఎక్కువగా ఉండేలా చూడడం ద్వారా స్పిన్నర్లు వేసే బంతులు సుడులు తిరుగుతూ దూసుకొచ్చి, బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టడమే టీమిండియా వ్యూహం. చాలా దశాబ్దాలుగా ఇదే తంతు కొనసాగుతున్నది. ప్రబీర్ ముఖర్జీ వంటి ఒకరిద్దరిని మినహాయిస్తే, క్యూరేటర్లంతా కెప్టెన్లు, కోచ్‌లు, బిసిసిఐ అధికారుల చెప్పుచేతల్లోని వారే. వారి అడుగులకు మడుగులొత్తేవారే. అందుకే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టింది మొదలు భారత్ స్పిన్ పిచ్‌లపైనే ఆధారపడింది. స్వదేశంలో పులి, విదేశాల్లో పిల్లిలా మాదిరి మారిపోయింది. 2012లో ఇంగ్లాండ్‌ను స్వదేశంలో ఎదుర్కొని, 1-2 తేడాతో టెస్టు సిరీస్‌లో పరాజయాన్ని ఎదుర్కోవడం వంటి ఒకటిరెండు సంఘటనలను మినహాయిస్తే, భారత్ స్వదేశంలో ఆడిన ప్రతిసారీ అసాధారణ ప్రతిభ కనబరచింది. ఆ ఘనతను జట్టు మొత్తానికి ఆపాదించడం కంటే స్పిన్నర్ల ఖాతాలో వేయడమే సబబు. ఎర్రాపల్లి ప్రసన్న, భగవత్ చంద్రశేఖర్, బిషన్ సింగ్ బేడీ, వెంకటరాఘవన్ వంటి స్పిన్నర్లు ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించారు. ప్రసన్న ఒక్కడిని తమకు ఇస్తే, ప్రపంచాన్ని గడగడలాడిస్తామని వెస్టిండీస్ లెజెండ్ రోహన్ కన్హాయ్ అన్నాడని ప్రచారం. అది నిజమైనా, అబద్ధమైనా, ప్రసన్న స్పిన్‌కు యావత్ క్రికెట్ ప్రపంచం దాసోహమైందనేది వాస్తవం. టెస్టు క్రికెట్‌లో స్పిన్‌కు ఎంతో ప్రాధాన్యం ఉందని అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితానే స్పష్టం చేస్తున్నది. మొదటి మూడు స్థానాల్లో ముత్తయ్య మురళీధరన్ (800 వికెట్లు), షేన్ వార్న్ (708 వికెట్లు), అనీల్ కుంబ్లే (619 వికెట్లు) ఉన్నారు. ఈ ముగ్గురూ స్పిన్నర్లే. పరిమిత ఓవర్ల ఫార్మెట్స్‌లో కళాత్మక ఆటకు ఏమాత్రం స్థానం ఉండదు. బంతిని సాధ్యమైనంత బలంగా బాదడం, పరుగుల వరద సృష్టించడమే ఆ ఫార్మెట్స్‌లో అనుసరించే ప్రధాన వ్యూహం. కానీ, టెస్టుల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. బ్యాట్, బాల్ మధ్య సమతుల్యం స్పష్టంగా కనిపిస్తుంది. బ్యాట్స్‌మెన్, బౌలర్ల కళాత్మక విన్యాసాలు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. క్రికెట్‌ను ‘జంటిల్మన్ గేమ్’ అన్నది కూడా అందుకే. మారుతున్న కాలానికి అనుగుణంగా క్రికెట్‌లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నప్పటికీ, టెస్టులు ఇంకా క్రికెట్ స్ఫూర్తిని నిలబెడుతున్నాయి.
ఇద్దరా? ముగ్గురా?
న్యూజిలాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత జట్టు ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందా లేక ముగ్గురికి అవకాశం ఇస్తుందా అన్నది చూడాలి. రవిచంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రా ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించడం ఖాయం. వారికి తుది జట్టులో స్థానం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మూడో స్పిన్నర్‌ను తీసుకుంటే, రవీంద్ర జడేజా ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి రావచ్చు. కాన్పూర్‌లో 22 నుంచి మొదలయ్యే మొదటి టెస్టులోనే స్పిన్నర్ల పాత్ర ఏమిటో స్పష్టమవుతుంది. భారత్ వాతావరణం న్యూజిలాండ్ ఆటగాళ్లకు సమస్యలు సృష్టిస్తాయి. దీనికి తోడు ఇక్కడ స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై పరుగులు రాబట్టాలంటే వారికి చుక్కలు కనిపిస్తాయి. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదుగురు స్పెషలిస్టు బౌలర్ల సూత్రానే్న కొనసాగించే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు తుది జట్టులో ఉండవచ్చు. స్పిన్నర్లు ఎంతమంది ఉన్నా, వారి నుంచి కివీస్‌కు తలనొప్పి తప్పదు. 2012లో రాస్ టేలర్ నాయకత్వంలో భారత్ పర్యటనకు వచ్చినప్పుడు ఈ జట్టు 0-2 తేడాతో వైట్‌వాష్ వేయించుకుంది. ఆ సిరీస్‌లో అశ్విన్, ప్రజ్ఞాన్ ఓఝా గొప్పగా రాణించారు. అశ్విన్ 18 వికెట్లు పడగొడితే, ఓఝాకు 13 వికెట్లు లభించాయి. బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందన్న కారణంగా తొలుత జట్టులో స్థానం కోల్పోయిన ఓఝా క్లీన్ చిట్ లభించినప్పటికీ తిరిగి అవకాశాన్ని దక్కించుకోలేకపోతున్నాడు. అతని స్థానంలో కోహ్లీకి అమిత్ మిశ్రా, జడేజా రూపంలో స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. ఎన్ని మార్పులు జరిగినా, అశ్విన్ స్థానం పదిలంగానే ఉంటుంది.
ఎన్నో విమర్శలు
భారత్‌లో జరిగే సిరీస్‌లకు పిచ్‌లను స్పిన్‌కు అనుకూలంగా తయారు చేయించడం పట్ల బిసిసిఐపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదు రోజుల టెస్టు మూడు రోజుల్లోనే ముగిసే విధంగా వికెట్‌ను రూపొందించడం అన్యాయమని, క్రీడాస్ఫూర్తికి, క్రికెట్ వౌలిక సూత్రాలకు ఇది విరుద్ధమని చాలా మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. టెస్టు క్రికెట్‌కు సజీవ సమాధి కట్టడానికి బిసిసి తెగించిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
స్వదేశంలో పిచ్‌లు స్పిన్నర్లకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో చెప్పడానికి అశ్విన్ గణాంకాలను ప్రస్తావిస్తే చాలు. అతను స్వదేశంలో 19 టెస్టులు ఆడి 126 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్‌పై 18 వికెట్లు సాధిస్తే, నిరుడు దక్షిణాఫ్రికాపై ఏకంగా 31 వికెట్లు కూల్చాడు. అదే విధంగా జడేజా కూడా స్వదేశంలో మెరుగైన రికార్డునే నమోదు చేశాడు. అతను స్వదేశంలో తొమ్మిది టెస్టులు ఆడి, 50 వికెట్లు సాధించాడు. అమిత్ మిశ్రా 10 టెస్టులు ఆడి, 32 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
కివీస్‌కు కష్టమే!
భారత్‌లో స్పిన్ ట్రాక్‌పై ఆడడం న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందికరంగా మారడం ఖాయం. జట్టులోని కొంత మంది ఆటగాళ్లు భారత్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టోర్నీ మ్యాచ్‌లు ఆడారు. అయితే, స్పిన్‌ను సమర్థంగా ఆడే సత్తా వారికి లేదు. అంతేగాక, టి-20 ఫార్మెట్‌లో ఒక బౌలర్ అత్యధికంగా నాలుగు ఓవర్లు మాత్రమే బౌల్ చేస్తాడు. అంతేగాక, విజయమో.. వీర స్వర్గమో అన్న చందంగా బ్యాట్స్‌మన్ హార్డ్ హిట్టింగ్‌కు ప్రయత్నిస్తారు. కానీ, టెస్టుల్లో బౌలర్లు ఎన్ని ఓవర్లు వేయాలన్న అంశంపై నిబంధనలేవీ లేవు. సహజంగా ఫాస్ట్ బౌలర్లు త్వరగా అలసిపోతారు కాబట్టి, స్పిన్నర్లతో ఎక్కువ ఓవర్లు వేయిస్తారు. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో ఎక్కువ బంతులు వేసిన బౌలర్ల జాబితాలో మొదటి మూడు స్థానాలను స్పిన్నర్లే ఆక్రమించడం ఇందుకు ఉదాహరణ. వెస్టిండీస్‌కు చెందిన సోనీ రాందీన్ 1957 మే 30న ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు ఇన్నింగ్స్‌లో 588 బంతులు వేశాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్ టామ్ వీవర్స్ 1964 జూలై 23న ఇంగ్లాండ్‌పై ఒక ఇన్నింగ్స్‌లో 571 బంతులు బౌల్ చేశాడు. మూడో స్థానంలో ఉన్న అల్ఫ్ వాలెంటైన్ (వెస్టిండీస్) 1950 జూలై 20న ఇంగ్లాండ్‌పై 552 బంతులు వేశాడు. స్పిన్నర్లను అంతసేపు ఎదుర్కోవడం న్యూజిలాండ్‌కు సులభసాధ్యం కాదన్నది వాస్తవం. ఆ జట్టులో మిచెల్ సాంట్నర్, ఇష్ సోధీ స్పిన్నర్లుగా సేవలు అందిస్తున్నారు. భారత్ పిచ్‌లపై వారు ఎంత వరకూ రాణిస్తారో చూడాలి. మొత్తం మీద ‘స్పిన్’ను ఆయుధంగా చేసుకొని, ఈనెల 22 నుంచి కాన్పూర్‌లో మొదలయ్యే మొదటి టెస్టులో భారత్ మైదానంలోకి దిగనుంది. ఏ రకంగా చూసినా టీమిండియాకు న్యూజిలాండ్ సరైన పోటీ ఇవ్వలేదన్నది వాస్తవం. అశ్విన్, మిశ్రా, జడేజా కివీస్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించే అవకాశాలున్నాయి.

భారత్, న్యూజిలాండ్ షెడ్యూల్
సెప్టెంబర్ 22-26: మొదటి టెస్టు (కాన్పూర్‌లో), సెప్టెంబర్ 30-అక్టోబర్ 4: రెండో టెస్టు (కోల్‌కతాలో), అక్టోబర్ 8-12: మూడో టెస్టు (ఇండోర్‌లో).
అక్టోబర్ 16: మొదటి వనే్డ (్ధర్మశాలలో), అక్టోబర్ 20: రెండో వనే్డ (న్యూఢిల్లీలో), అక్టోబర్ 23: మూడో వనే్డ (మొహాలీలో), అక్టోబర్ 26: నాలుగో వనే్డ (రాంచీలో), అక్టోబర్ 29: ఐదో వనే్డ (విశాఖపట్నంలో).

చిత్రం.. భారత పిచ్‌లపై అద్భుతంగా రాణిస్తున్న స్పిన్నర్ అమిత్ మిశ్రా , రవీంద్ర జడేజా