క్రీడాభూమి

హాకీకి రీతూ గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: భారత మహిళల హాకీ జట్టు మాజీ కెప్టెన్ రీతూ రాణి కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. రియో ఒలింపిక్స్‌కు ఎంపిక చేయకపోవడం ఆమెను మానసికంగా కుంగతీసింది. హాకీ ఇండియా (హెచ్‌ఐ) వైఖరిని నిరసిస్తూ, బహిరంగంగానే వ్యాఖ్యలు చేసింది. హాకీ శిక్షణ శిబిరానికి ఎంపిక చేసిన ప్రాబబుల్స్‌లో రీతూకు చోటు కల్పించినప్పటికీ ఆమె సంతృప్తి చెందలేదు. ఆమె నాయకత్వంలోనే భారత్ 36 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్ మహిళల హాకీలో పోటీపడే అర్హతను సంపాదించుకుంది. 2013 ఇండియాన్ ఆసియా హాకీ చాంపియన్‌షిప్, 2014 ఆసియా క్రీడల్లో భారత్ కాంస్య పతకాలను ఆమె నాయకత్వంలోనే భారత్ కైవసం చేసుకుంది. ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిపెట్టినప్పటికీ, తనను రియోకు ఎంపిక చేయకపోవడం రీతూను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమెను ఎందుకు జట్టు నుంచి తొలగించాల్సి వచ్చిందనే విషయంపై హెచ్‌ఐ కూడా సరైన వివరణ ఇవ్వలేకపోయింది.

స్పిన్‌పైనా దృష్టి: కోహ్లీ
కాన్పూర్, సెప్టెంబర్ 21: ఫాస్ట్ బౌలింగ్‌తోపాటు స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోవడంపైనా దృష్టి పెడతామని భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. గురువారం నుంచి న్యూజిలాండ్‌తో మొదటి టెస్టు ఆరంభం కానున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అతను మాట్లాడుతూ ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాల్లో జరిపిన పర్యటనలో జట్టు ప్రదర్శన సంతృప్తికరంగానే ఉందన్నాడు. ఆ దేశాల్లో పిచ్‌లు ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలిస్తాయి కాబట్టి, ఎక్కువ భాగం పేస్‌ను ఎదుర్కోవడానికే ప్రాధాన్యం ఇచ్చామని అన్నాడు. కాన్పూర్ పిచ్ స్పిన్‌కు సహకరిస్తుందని వస్తున్న వార్తలను ప్రస్తావించగా, అందుకే ఇప్పుడు స్పిన్‌పైనా దృష్టి కేంద్రీకరిస్తున్నామని తెలిపాడు. నిరుడు శ్రీలంక టూర్‌కు వెళ్లినప్పుడు గాలే టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. ముఖ్యంగా రంగన హెరాత్ స్పిన్‌కు దాసోహమన్నారు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 176 పరుగుల విజయ లక్ష్యాన్ని కూడా ఛేదించలేక, 112 పరుగులకే కుప్పకూలింది. హెరాత్ ఏడు వికెట్లు కూల్చి, లంకకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఆ ఫలితాన్ని గురించి కోహ్లీ ప్రస్తావిస్తూ, అప్పట్లో బ్యాటింగ్ వ్యూహాల్ని సక్రమంగా అమలు చేయలేకపోయామని అంగీకరించాడు. ఇప్పుడు లోపాలను సరిదిద్దుకున్నామని, అన్ని విభాగాల్లోనూ జట్టు బలోపేతమైందని చెప్పాడు. స్పిన్‌ను ఎక్కువ సమయం ఎదుర్కోవడమే లక్ష్యంగా ప్రాక్టీస్ చేశామని అన్నాడు. ప్రతి చిన్న అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని, ఎక్కడా పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పాడు. ప్రపంచ మేటి జట్లలో భారత్ ఒకటని, జట్టు అన్ని విధాలా సమతూకంతో ఉందని కోహ్లీ అన్నాడు. మైదానంలోకి అడుగుపెట్టిన వెంటనే, మరో పదేళ్ల కాలం జట్టులో ఉంటామనే నమ్మకంతో, ఉత్తమంగా ఆడాలన్న దృఢ సంకల్పంతో ఆడాలని సహచరులకు హితవు పలికాడు. అప్పుతే ఒత్తిడి లేకుండా, స్వేచ్ఛగా ఆడగలుగుతామని అన్నాడు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, సవాళ్లను స్వీకరించడం, ధైర్యంగా ఆడడం క్రికెట్ చాలా ముఖ్యమైన అంశాలని వ్యాఖ్యానించాడు. భయం లేకుండా ఆడినప్పుడే ఫలితాలు మనకు అనుకూలంగా ఉంటాయని చెప్పాడు. న్యూజిలాండ్ నుంచి గట్టిపోటీ తప్పదని కోహ్లీ స్పష్టం చేశాడు. అందుకే, ప్రతి మ్యాచ్‌లోనూ చివరి క్షణం వరకూ పోరాడాల్సి ఉంటుందని చెప్పాడు. కివీస్ జట్టులో సమర్థులు ఉన్నారని, వారికి గట్టిపోటీని ఇవ్వాలంటే మైదానంలో ప్రతి నిమిషాన్నీ సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుందని అన్నాడు. మొత్తం 13 టెస్టులు ఆడనున్నామని, ఒక రకంగా రాబోయే కాలానికి ఇది మంచి పునాది అవుతుందని చెప్పాడు. క్రమం తప్పకుండా ఏ సీజన్‌లోనూ ఇన్ని టెస్టులు ఆడే అవకాశం రాదని అన్నాడు. జట్టు తుది కూర్పుపై అడిగిన ప్రశ్నలకు కోహ్లీ సమాధానం చెప్పలేదు. ఒకే ఒక కాంబినేషన్‌ను మాత్రమే దృష్టిలో పెట్టుకోబోమని, అవసరాన్ని బట్టి ఆలోచన, వ్యూహం మారుతునే ఉంటాయని అన్నాడు. సందర్భాన్ని బట్టి తుది జట్టును ఎంపిక చేస్తామని, కాబట్టి ముందుగానే వివరాలు అందించడం సాధ్యం కాదని చెప్పాడు.

వర్షం బెడద!
కాన్పూర్: భారత్ ఆడే 500వ టెస్టు మ్యాచ్‌ని వర్షం భయపెడుతున్నది. కాన్పూర్‌లో రానున్న ఆరు రోజుల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్‌ను వర్షాలు వేధిస్తున్నాయి. దీనితో కాన్పూర్ టెస్టు సవ్యంగా సాగుతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తున్న గ్రీన్ పార్క్ మైదానంలో వర్షం నీటిని ఎప్పటికప్పుడు తొలగించడానికి సౌకర్యాలు ఉన్నప్పటికీ, భారీ వర్షం కురిస్తే ఆటకు జరిగే అవకాశం ఉండదు. ఒకవేళ వర్షం తగ్గినా, అవుట్ ఫీల్డ్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలియదు. ఈ స్థితిలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి ప్రారంభం కానున్న మొదటి టెస్టు ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుందా అన్నది అనుమానంగానే ఉంది.
మ్యాచ్ గురువారం ఉదయం 9.30 గంటలకు మొదలవుతుంది.