క్రీడాభూమి

భారత్ @ 500

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, సెప్టెంబర్ 21: భారత క్రికెట్ జట్టు గురువారం నుంచి చారిత్రక టెస్టు మ్యాచ్‌ని ఆడనుంది. న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగే ఈ మొదటి మ్యాచ్ టీమిండియాకు 500వ టెస్టు కావడం విశేషం. ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న ఈ టెస్టులో చిరస్మరణీయ విజయాన్ని అందుకోవడానికి విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు పట్టుదలతో ఉంది. బ్రిటిష్ వలస దేశంగా 1932లో భారత్ మొదటిసారి టెస్టు మ్యాచ్ ఆడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ స్పిన్ ట్రాక్స్‌పైన ఆడడానికే ప్రాధాన్యం ఇస్తున్నది. టెస్టు కెరీర్‌లో 434 వికెట్లు కూల్చిన కపిల్ దేవ్, 311 వికెట్లు సాధించిన జహీర్ ఖాన్ వంటి మేటి ఫాస్ట్ బౌలర్లు ఉన్నప్పటికీ, ఎక్కువ శాతం స్పిన్ బౌలింగ్‌పై ఆధారపడే భారత జట్టు క్రికెట్ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నది. టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో ముత్తయ్య మురళీధరన్ (800 వికెట్లు), షేన్ వార్న్ (708 వికెట్లు) తర్వాత మూడో స్థానం భారత స్పిన్నర్ అనీల్ కుంబ్లేకు దక్కుతుంది. అతను 619 వికెట్లు పడగొట్టాడు. హర్భజన్ సింగ్ 417 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 300లకు పైగా వికెట్లు కూల్చిన 30 మందిలో నాలుగురు భారతీయులుకాగా, వారిలో ఇద్దరు స్పిన్నర్లు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు జరిగే గ్రీన్‌పార్క్ స్టేడియంలో అసలుసిసలైన భారత పిచ్‌ని చూడవచ్చు. ఈ మైదానం స్పిన్నర్లకు అనుకూలించడం ఖాయం. అందుకే, ముగ్గురు స్పిన్నర్లతో కోహ్లీ బరిలోకి దిగే అవకాశాలున్నాయి. రవిచంద్ర అశ్విన్, అమిత్ మిశ్రా స్థానాలు పదిలమన్న అభిప్రాయం ఇప్పటికే ఉంది. గ్రీన్ పార్క్ మైదానం స్పిన్‌కు అనుకూలం కాబట్టి రవీంద్ర జడేజాను కూడా తుది జట్టులోకి తీసుకుంటారన్న వాదన వినిపిస్తున్నది.
కివీస్‌కు ఎదురీతే!
భారత్‌తో టెస్టులు ఆడడం న్యూజిలాండ్‌కు అనుకున్నంత సులభం కాదు. భారత పిచ్‌లపై సరైన ప్రాక్టీస్ లేకుండానే కివీస్ మొదటి టెస్టు ఆడనుంది. ఈ సిరీస్‌కు ముందు ఒకే ఒక వామప్ మ్యాచ్ జరిగింది. అందులో ముంబయి బ్యాట్స్‌మెన్ పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచారు. న్యూజిలాండ్ బౌలింగ్ వెలవెలబోయింది. న్యూజిలాండ్ బ్యాటింగ్‌లో కీలక పాత్ర పోషిస్తున్న మార్టిన్ గుప్టిల్ వామప్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో కలిపి 21 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. ల్యూక్ రోన్చీ ఒక్కడే బ్యాటింగ్ ప్రాక్టీస్‌ను కొనసాగించగలిగాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతను శతకంతో రాణించడం కివీస్‌కు ఉపశమనమిచ్చే అంశం. అయితే, బౌలర్ల వైఫల్యం టెస్టులోనూ కొనసాగుతుందా అనే భయం కేన్ విలియమ్‌సన్ నాయకత్వంలోని కివీస్‌ను వేధిస్తున్నది. ముంబయి తరఫున ముగ్గురు బ్యాట్స్‌మెన్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడం న్యూజిలాండ్ బౌలింగ్ వైఫల్యాలకు అద్దం పడుతుంది.
గణాంకాలు సైతం..
గణాంకాలు కూడా భారత్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్పష్టం చేస్తున్నాయి. న్యూజిలాండ్ ఇక్కడ ఆడిన గత 14 మ్యాచ్‌ల్లో ఒక్క విజయాన్ని కూడా సాధించలేకపోయింది. ఆ ఇట్టు చివరిసారి 1998లో ఒక టెస్టు మ్యాచ్‌ని భారత్‌లో గెల్చుకుంది. అప్పటి నుంచి గెలవడానికి చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించలేదు.
భారత్ పరిస్థితి కివీస్‌కు పూర్తి భిన్నంగా ఉంది. స్వదేశంలో ఆడిన గత 10 టెస్టుల్లో ఈ జట్టు తొమ్మిదింటిని గెల్చుకుంది. నిరుడు దక్షిణాఫ్రికాతో ఒక మ్యాచ్‌ని డ్రా చేసుకుంది.
అనుభవజ్ఞుడు టేలర్
జట్టులో ఎక్కువ అనుభవజ్ఞుడిగా రాస్ టేలర్‌ను పేర్కోవాలి. అతనికి భారత్‌లో ఐదు టెస్టులు ఆడిన అనుభవం ఉంది. స్పిన్‌ను కూడా సమర్థంగా ఎదుర్కొంటాడన్న పేరు సంపాదించాడు. గుప్టిల్ ఫామ్‌లోకి వస్తే కివీస్ బ్యాటింగ్ పరిస్థితి మెరుగుపడుతుంది. టేలర్‌తోపాటు రోన్చీ కూడా చెలరేగిపోతే, భారత బౌలర్లకు సమస్యలు తప్పవు. అయితే, గాయాల బెడద న్యూజిలాండ్‌ను వేధిస్తున్నది. సూపర్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ కాలి మడమ గాయం కారణంగా ఇప్పటికే టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. కాగా, ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ పక్కటెముకకు దెబ్బ తగలడంతో మొదటి టెస్టులో ఆడే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ విలియమ్‌సన్, మార్టిన్ గుప్టిల్, రాస్ టేలర్‌పైనే భారం వేసి భారత బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి న్యూజిలాండ్ సిద్ధమవుతున్నది. స్పిన్నర్లు ఇష్ సోధీ, మిచెల్ సాంట్నర్ కాన్పూర్ పిచ్ స్వభావాన్ని ఎంత వరకూ అనుకూలంగా మార్చుకుంటారో చూడాలి.
ఓపెనర్లు ఎవరు?
ఓపెనర్లుగా ఎవరిని దింపాలన్నది భారత కెప్టెన్ కోహ్లీకి తలనొప్పిగా మారనుంది. మురళీ విజయ్ నిలకడగా రాణిస్తున్నాడు కాబట్టి, అతని స్థానానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. రెండో ఓపెనర్‌గా శిఖర్ ధావన్‌తో లోకేష్ రాహుల్ తీవ్రంగా పోటీపడుతున్నాడు. ఇటీవల కాలంలో ధావన్ అనుకున్న స్థాయిలో ఆడలేకపోతున్నాడు. రాహుల్ ఇటీవల విండీస్‌తో జరిగిన టెస్టు, టి-20 సిరీస్‌లలో ఒక్కో శతకాన్ని నమోదు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ధావన్, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని అంటున్న కోహ్లీ మొదటి టెస్టుకు మురళీతో కలిసి ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టే బాధ్యతను ఎవరికి ఇస్తాడన్నది ఆసక్తిని రేపుతున్నది. తాను గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ధావన్‌నే కొనసాగిస్తాడా లేక మంచి ఫామ్‌లో ఉన్న యువ ఆటగాడు రాహుల్‌కు అవకాశం ఇస్తాడా అనేది చూడాలి. చటేశ్వర్ పుజారా, కెప్టెన్ కోహ్లీ భారత మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేస్తున్నారు. రోహిత్ శర్మ నిరాశ పరుస్తుండగా, అతను మళ్లీ ఫామ్‌లోకి రావడానికి వీలుగా కోహ్లీ అవకాశం ఇచ్చినా ఆశ్చర్యం లేదు. రోహిత్‌కు గట్టిపోటీ ఆజింక్య రహానే నుంచి ఎదురవుతున్నది. రహానే సమర్థుడిగా ఇప్పటికే పేరు తెచ్చుకున్నాడు. అయితే, కోహ్లీకి అతనిపై అంతగా నమ్మకం లేదన్న విషయం పలు సందర్భాల్లో స్పష్టమైంది. అతను మరోసారి రహానేను పక్కనపెట్టి, రోహిత్‌కు తుది జట్టులో అవకాశం ఇస్తాడన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
జడేజాకు అవకాశం?
కాన్పూర్ పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుంది కాబట్టి మూడో స్పిన్నర్‌గా రవీంద్ర జడేజాను ప్లేయింగ్ ఎలెవెన్‌లో కోహ్లీ తీసుకునే అవకాశం ఉంది. అతను ఆల్‌రౌండర్ కాబట్టి, బ్యాట్స్‌మన్‌గానూ కెప్టెన్ పరిగణించవచ్చు. ఐదుగురు బౌలర్లతో ఆడాలన్నది కోహ్లీ సూత్రం. దానిని మరోసారి అమలు చేస్తే, ఫాస్ట్ బౌలర్లు మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్‌లలో ఇద్దరికి మాత్రమే తుది జట్టులో అవకాశం దక్కుతుంది. జట్టులో ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు ఉంటారన్నది విశే్లషకుల అభిప్రాయం.

కాన్పూర్‌లో గురువారం నుంచి న్యూజిలాండ్‌తో మొదలు కానున్న తొలి టెస్టు కోసం నెట్స్‌లో శ్రమిస్తున్న భారత స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్