క్రీడాభూమి

భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ చీఫ్‌గా ఎమ్మెస్కే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 21: తెలుగు వీరుడు, మాజీ వికెట్‌కీపర్ ఎమ్మెస్కే ప్రసాద్ భారత జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యాడు. ఐదుగురు సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీని బుధవారం ఇక్కడ జరిగిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం) ప్రకటించింది. వీరిలో ఇద్దరికి టెస్టు క్రికెట్ ఆడిన అనుభవం లేకపోవడం గమనార్హం. ఎమ్మెస్కే గత సెలక్షన్ ప్యానెల్‌లో దక్షిణ మండలం ప్రతినిధిగా సేవలు అందించాడు. ఇప్పుడు సందీప్ పాటిల్ స్థానంలో చీఫ్ సెలక్టర్‌గా నియమితుడయ్యాడు. గుంటూరుకు చెందిన 41 ఏళ్ల ఈ మాజీ కీపర్ తన కెరీర్‌లో ఆరు టెస్టులు, 17 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడాడు. గత సెలక్షన్ కమిటీలోని మరో సభ్యుడు గగన్ ఖోడా కూడా తన పదవిని నిలబెట్టుకున్నాడు. అతను కెరీర్‌లో ఒక్క టెస్టు కూడా ఆడలేదు. కాగా, ప్యానెల్‌లోకి కొత్తగా దేవాంగ్ గాంధీ, జతిన్ పరాంజపే, శరణ్‌దీప్ సింగ్ వచ్చారు. వీరిలో పరాంజపేకు టెస్టు మ్యాచ్ ఆడిన అనుభవం లేదు. అయితే, అతను నాలుగు వనే్డల్లో ఆడాడు. అతను పశ్చిమ మండలం ప్రతినిధిగా సెలక్షన్ కమిటీలోకి వచ్చాడు. మాజీ ఆఫ్ స్పిన్నర్ శరణ్‌దీప్ నార్త్ జోన్ నుంచి విక్రం రాథోడ్ స్థానంలో కమిటీలోకి స్థానం సంపాదించాడు. అతను కెరీర్‌లో మూడు టెస్టులు, ఐదు వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడాడు. మొత్తం మీద జాతీయ సెలక్షన్ కమిటీ సభ్యులందరి అంతర్జాతీయ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటే, వారు ఆడినవి 13 టెస్టులు 31 వనే్డలు.
వెంకటేశ్ స్థానం పదిలం
జూనియర్ సెలక్షన్ కమిటీకి చైర్మన్‌గా మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ తన పదవిని దక్కించుకున్నాడు. జాతీయ సెలక్షన్ కమిటీలోకి రావాలన్న ఉద్దేశంతో అతను దరఖాస్తు చేసుకున్నప్పటికీ, బోర్డు జూనియర్స్ విభాగంలో అతని సేవలను కొనసాగించాలని నిర్ణయించింది. ఈ కమిటీలో రాకేష్ పారిఖ్, ఆశిష్ కపూర్, అమిత్ శర్మ, జ్ఞానేంద్ర పాండే సభ్యులు. వీరిలో రాకేష్ 52 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఆశిష్‌కు నాలుగు టెస్టులు, 17 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడిన అనుభవం ఉంది. అమిత్ శర్మ 53 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడగా, జ్ఞానేంద్ర పాండే కెరీర్‌లో 117 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లతోపాటు రెండు వనే్డలు ఆడాడు.
మహిళల చీఫ్ సెలక్టర్ హేమలత
మహిళల క్రికెట్ జాతీయ సెలక్షన్ కమిటీ చైర్‌పర్సన్‌గా హేమలత కాలా ఎంపికైంది. కమిటీలో సాక్షి గుప్త, అంజలి పెందార్కర్, లోపాముద్ర బెనర్జీ, సుధా షా సభ్యులు.

‘లోధా’ సిఫార్సులు బేఖాతరు
ముంబయి: లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయడానికి ససేమిరా అంటున్న బిసిసిఐ తన మొండి వైఖరిని మరోసారి ప్రదర్శించింది. పురుషులు, మహిళలతోపాటు, జూనియర్స్ విభాగంలోనూ జాతీయ సెలక్షన్ కమిటీల్లో సభ్యులుగా ఉండేవారికి టెస్టులు ఆడిన అనుభవం ఉండాలని లోధా కమిటీ తన ప్రతిపాదనల్లో స్పష్టం చేసింది. టెస్టులు ఆడిన అనుభవం లేని వారికి ఏ విభాగంలోనూ సెలక్షన్ కమిటీ సభ్యులుగా కొనసాగడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. కానీ, అత్యంత కీలకమైన పురుషుల క్రికెట్ సెలక్షన్ కమిటీలోనే టెస్టు ఆడిన అనుభవం లేని ఇద్దరు సభ్యులకు బిసిసిఐ అవకాశం ఇచ్చింది. గగన్ ఖోడా అసలు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టలేదు. జతిన్ పరాంజపేకు కూడా టెస్టు మ్యాచ్‌లు అడిన అనుభవం లేదు. అయితే, అతను నాలుగు వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడాడు. లోధా కమిటీ సిఫార్సులను అంగీకరించడం లేదని, వాటిని తు.చ తప్పకుండా అమలు చేయబోమని బిసిసిఐ ఈ ఎంపిక ద్వారా స్పష్టం చేసింది. మహిళలు, జూనియర్స్ విభాగాల్లోనూ టెస్టు క్రికెట్ అనుభవం లేని వారిని అందలం ఎక్కించింది.