క్రీడాభూమి

విజయ్, పుజారా అర్ధ శతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, సెప్టెంబర్ 22: భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయమైన 500వ టెస్టు మ్యాచ్ గురువారం ఆరంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది. ఓపెనర్ మురళీ విజయ్, ఫస్ట్‌డౌన్ ఆటగాడు చటేశ్వర్ పుజారా అర్ధ శతకాలతో రాణించగా, న్యూజిలాండ్ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్, స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ చెరి మూడు వికెట్లు పడగొట్టి, భారత్‌ను కట్టడి చేశారు. ఇన్నింగ్స్‌ను లోకేష్ రాహుల్, విజయ్ ధాటిగానే ఆరంభించారు. అయితే, జట్టు స్కోరు 42 పరుగుల వద్ద సాంట్నర్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ బిజె వాల్టింగ్ క్యాచ్ అందుకోగా రాహుల్ వికెట్ కూలింది. అతను 39 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 32 పరుగులు చేశాడు.
మొదటి వికెట్ కూలిన తర్వాత, చటేశ్వర్ పుజారాతో కలిసి విజయ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. విజయ్ క్రీజ్‌లో నిలదొక్కుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వగా, పుజారా పరుగులను రాబట్టే ప్రయత్నం చేశాడు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 112 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించారు. 109 బంతుల్లో, ఎనిమిది ఫోర్లతో 62 పరుగులు చేసిన పుజారాను సాంట్నర్ రిటర్న్ క్యాచ్ అందుకొని పెవిలియన్‌కు పంపాడు. 154 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్‌ను చేజార్చుకుంది. పుజారా వెనుదిగిన తర్వాత టీమిండియా కోలుకోలేకపోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం తొమ్మిది పరుగులు చేసి నీల్ వాగ్నర్ బౌలింగ్‌లో ఇష్ సోధీకి దొరికిపోయాడు. క్రీజ్‌లో నిలదొక్కుకొని ఆడుతున్న విజయ్ 65 పరుగులు చేసి సోధీ బౌలింగ్‌లో వాల్టింగ్ క్యాచ్ అందుకోవడంతో అవుటయ్యాడు. 170 బంతులు ఎదుర్కొన్న అతని స్కోరులో ఎనిమిది ఫోర్లు ఉన్నాయి. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడనుకున్న ఆజింక్య రహానే 18 పరుగులు చేసి మార్క్ క్రెగ్ బౌలింగ్‌లో మాట్ లాథమ్‌కు చిక్కాడు. వరుస వైఫల్యాలతో అల్లాడుతున్న రోహిత్ శర్మ ఈ ఇన్నింగ్స్‌లోనూ ఫామ్‌లోకి రాలేకపోయాడు. 67 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో అతను 35 పరుగులు చేసి, సాంట్నర్ బౌలింగ్‌లో సోధీ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. రవిచంద్రన్ అశ్విన్ కొంత వరకూ కివీస్ బౌలింగ్‌ను సుమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నాన్ని కొనసాగించాడు. వృద్ధిమాన్ సాహా రెండు బంతులు ఎదుర్కొని, పరుగుల ఖాతాను తెరవకుండానే ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. కాగా, బౌల్ట్ తన తర్వాతి ఓవర్‌లో అశ్విన్‌ను కూడా పెవిలియన్ చేర్చాడు. 76 బంతుల్లో అశ్విన్ ఏడు ఫోర్లతో 40 పరుగులు సాధించి, రాస్ టేలర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మహమ్మద్ షమీ ఒక్క పరుగు కూడా చేయకుండానే బౌల్ట్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆట ముగిసే సమయానికి భారత్ తొమ్మిది వికెట్లకు 291 పరుగులు చేయగా, రవీంద్ర జడేజా (16), ఉమేష్ యాదవ్ (8) క్రీజ్‌లో ఉన్నారు. బౌల్ట్ 57 పరుగులకు మూడు, సాంట్నర్ 77 పరుగులకు మూడు చొప్పున వికెట్లు పడగొట్టారు.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: లోకేష్ రాహుల్ సు బిజె వాల్టింగ్ బి మిచెల్ సాంట్నర్ 32, మురళీ విజయ్ సి వాల్టింగ్ బి ఇష్ సోధీ 65, చటేశ్వర్ పుజారా సి అండ్ బి సాంట్నర్ 62, విరాట్ కోహ్లీ సి సోధీ బి నీల్ వాగ్నర్ 9, ఆజింక్య రహానే సి మాట్ లాథమ్ బి మార్క్ క్రెగ్ 18, రోహిత్ శర్మ సి సోధీ బి సాంట్నర్ 35, రవిచంద్రన్ అశ్విన్ సి రాస్ టేలర్ బి ట్రెంట్ బౌల్ట్ 40, వృద్ధిమాన్ సాహా బి బౌల్ట్ 0, రవీంద్ర జడేజా 16 నాటౌట్, మహమ్మద్ షమీ బి బౌల్ట్ 0, ఉమేష్ యాదవ్ 8 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 6, మొత్తం (90 ఓవర్లలో 9 వికెట్లకు) 291.
వికెట్ల పతనం: 1-42, 2-154, 3-167, 4-185, 5-209, 6-261, 7-262, 8-273, 9-277.
బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 17-2-57-3, నీల్ వాగ్నర్ 14-3-42-1, మిచెల్ సాంట్నర్ 20-2-77-3, మాట్ క్రెగ్ 24-6-59-1, ఇష్ సోధీ 15-3-50-1.

న్యూజిలాండ్‌పై మురళీ విజయ్ మొట్టమొదటిసారి అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌కు ముందు కివీస్‌పై అతని అత్యధిక స్కోరు 48 పరుగులు. విజయ్ 65 పరుగులు చేయగా, ఓపెనర్‌గా వచ్చిన లోకేష్ రాహుల్ 32, ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన చటేశ్వర్ పుజారా 62 చొప్పున పరుగులు సాధించారు. ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో మొదటి ముగ్గురు బ్యాట్స్‌మెన్ 30 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం 2014 తర్వాత ఇదే మొదటిసారి.
ఈ ఏడాది స్వదేశంలో జరిగిన ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో పుజారా సగటున 109.5 పరుగులు సాధించాడు. గత ఇన్నింగ్స్‌లో అతను 256 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఏడు ఇప్పటి వరకూ ఏడు ఫస్ట్‌క్లాస్ ఇన్నింగ్స్ ఆడిన అతను మూడు సెంచరీలు చేశాడు.

భారత్‌లో పర్యటనకు వచ్చిన జట్లలో ఇంగ్లాండ్ మాత్రమే కాన్పూర్‌లో మొదట ఫీల్డింగ్‌కు దిగి, ఆతర్వాత మ్యాచ్‌ని గెలిచింది. 1952లో ఇంగ్లాండ్ విజయాన్ని నమోదు చేసిన తర్వాత ఇప్పటి వరకూ ఈ మైదానంలో 12 టెస్టులు పూర్తికాగా, ఒక్కసారి కూడా విదేశీ జట్టు గెలవలేదు. ఇలావుంటే, కాన్పూర్‌లో టీమిండియా నాలుగు టెస్టులను కోల్పోయింది. కాగా, 1983లో వెస్టిండీస్ చేతిలో కాన్పూర్ గ్రీన్ పార్క్ మైదానంలో భారత్ చివరిసారి ఓడింది. ఆతర్వాత నాలుగు విజయాలను సాధించింది. న్యూజిలాండ్‌తో ఈ మైదానంలో రెండు మ్యాచ్‌లు ఆడింది. ఒక మ్యాచ్‌ని గెల్చుకోగా, మరొకటి డ్రా అయింది.

కోహ్లీకి వాగ్నర్ ఫోబియా!
కాన్పూర్: భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి నీల్ వాగ్నర్ ఫోబియా పట్టుకున్నట్టు కనిపించింది. అతని బౌలింగ్‌లో ఇష్ సోధీకి క్యాచ్ ఇచ్చి కోహ్లీ అవుటయ్యాడు. కాగా, కోహ్లీ వికెట్‌ను సాధించడం వాగ్నర్ 77 బంతుల వ్యవధిలో ఇది మూడోసారి. న్యూజిలాండ్‌పై కోహ్లీ సగటు 85.20 పరుగులు. ఈ టెస్టు ఆరంభానికి ముందు కేవలం ఏడు ఇన్నింగ్స్‌లో అతను రెండు సెంచరీలు, మూడు అర్ధ శతకాలు సాధించాడు.

చిత్రం.. అర్ధ శతకాలు సాధించిన చటేశ్వర్ పుజారా, మురళీ విజయ్