క్రీడాభూమి

‘గోల్ఫ్ కింగ్’ పామెర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, సెప్టెంబర్ 26: బాక్సింగ్ అంటే మహమ్మద్ అలీ, సాకర్ అంటే పీలే మాదిరిగానే గోల్ఫ్ అంటే వెంటనే స్ఫురించే పేరు అర్నాల్డ్ పామెర్. ‘గోల్ఫ్ కింగ్’గా అందరికీ సుపరిచితుడైన ఈ లెజెండరీ ఆటగాడు మృతి చెందిన వార్త గోల్ఫ్ రంగాన్ని శోక సంద్రంలో ముంచేసింది. 87 ఏళ్ల పామెర్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడని అతని కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. గోల్ఫ్ క్రీడకు ఒక ప్రత్యేకతను, ఆకర్షణను సంపాదించిపెట్టిన పామెర్ అభిమానులను ‘అమీస్ ఆర్మీ’గా పిలుస్తారు. ఎంతో మంది గోల్ఫర్లకు అతను మార్గదర్శకుడు. ఒక రకంగా గోల్ఫ్ క్రీడకు పామెర్ బ్రాండ్ అంబాసిడర్. పెన్సిల్వేనియాలో జన్మించిన పామెర్ పిట్స్‌బర్గ్‌లోని ప్రెస్బిటెరియన్ ఆసుపత్రిలో మృతి చెందాడు. గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ మూడు రోజులుగా అతను చికిత్స పొందుతున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
అభిమానులకు రాజు
బాక్సర్ మహ్మమద్ అలీ తనను తాను ‘ది గ్రేటెస్ట్’ అని ప్రకటించుకున్నాడు. గోల్ఫర్ పామెర్‌కు అతని అభిమానులే ‘ది కింగ్’ అనే బిరుదును ఖాయం చేశారు. కెరీర్‌లో సాధించిన ఏడు మేజర్ టోర్నమెంట్ టైటిళ్లే అతని ప్రతిభకు నిదర్శనం. అతను ఆటగాడిగా కొనసాగిన కాలంలో ఇప్పటి మాదిరిగా ఎక్కువ సంఖ్యలో గోల్ఫ్ టోర్నీలు ఉండేవికావు. ఉన్న అతి తక్కువ అవకాశాలను పామెర్ సద్వినియోగం చేసుకున్నాడు. గోల్ఫ్‌ను ఆకర్షణీయమైన క్రీడగా మార్చేశాడు. బ్రిటిష్ ఓపెన్‌ను నాలుగు పర్యాయాలు (1958, 1960, 1962, 1964), బ్రిటష్ ఓపెన్‌ను రెండుసార్లు (1961, 1962), యుఎస్ ఓపెన్ గోల్ఫ్ టోర్నీని ఒకసారి (1960) గెల్చుకున్న పామెర్ మొట్టమొదటి గోల్ఫ్ టెలివిజన్ సూపర్‌స్టార్‌గా వెలిగాడు. అతను బరిలోకి దిగితే చాలు గోల్ఫ్ టోర్నీల ప్రత్యక్ష ప్రసార హక్కుల కోసం టీవీ సంస్థలు పోటీపడేవి.
గోల్ఫ్‌తో అనుబంధం
పామెర్ 1929 సెప్టెంబర్ 10న జన్మించాడు. అతని తండ్రి లాట్రోబ్ కంట్రీ క్లబ్‌లో పని చేసేవాడు. అందుకే అతనికి చిన్నతనం నుంచే గోల్ఫ్‌తో అనుబంధం ఏర్పడింది. 11వ ఏట కాడీగా ప్రస్థానాన్ని ప్రారంభించిన అతను క్లబ్‌లో దాదాపుగా అన్ని విభాగాల్లోనూ పని చేశాడు. 1954లో ప్రొఫెషనల్ గోల్ఫర్‌గా మారిన అతను 2006లో కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. కెరీర్‌లో 95 టైటిళ్లను సాధించాడు. వీటిలో 62 పిజిఎ టూర్ టైటిళ్లు. 50 ఏళ్లు అతను ఉత్తమ పైలట్‌గానూ పేరు పొందాడు. అతనికి సొంతంగా ఒక జెట్ విమానం ఉంది. ధార్మిక కార్యక్రమాలకు పామెర్ దానిని ఉచితంగా ఇచ్చేవాడు. ఈ కారణంగానే అమెరికా అధ్యక్షుడి నుంచి సామాన్యుడి వరకూ అందరూ అతనికి అభిమానులుగా మారారు. గోల్ఫ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో అతనికి 1974లోనే స్థానం లభించింది. నాలుగు సీజన్లలో అతను లక్ష డాలర్లకుపైగా టూర్ మనీ సంపాదించి రికార్డు నెలకొల్పాడు. ఆ రోజుల్లో ఇది చాలా పెద్దమొత్తం. సహచరులు జాక్ నికలాస్, గారీ ప్లేయర్‌తో కలిసి అతను గోల్ఫ్‌ను అత్యున్నత శిఖరాలకు చేర్చాడు. అతని మృతి గోల్ఫ్ ప్రపంచానికి తీరని లోటు.

ప్రముఖుల సంతాపం
మినియాపొలిస్, సెప్టెంబర్ 26: ప్రముఖ గోల్ఫర్ ఆర్నాల్డ్ పామెర్ మృతికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒమానాసహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌ను పామెర్ సందర్శించినప్పటికీ ఫొటోను ఒబామా ట్వీట్ చేశాడు. అతనితో గడిపిన ప్రతి క్షణం, మాట్లాడిన ప్రతిమాట తనకు జీవితాంతం గుర్తుంటాయని పేర్కొన్నాడు. పామెర్ లేని గోల్ఫ్‌ను ఊహించడానికి కూడా కష్టంగా ఉందని స్టార్ ఆటగాడు టైగల్ ఉడ్స్ ఒక ప్రకటనలో తెలిపాడు. అతని నుంచి తాను ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని అన్నాడు. పామెర్ జీవితమే గోల్ఫర్లకు పాఠ్యాంశమని వ్యాఖ్యానించాడు. గోల్ఫ్ ప్రపంచానికి పామెర్ చేసిన సేవలు మరువలేనివని ప్రపంచ చాంపియన్ రొరీ మెక్‌రాయ్ అన్నాడు. పలువురు ప్రస్తుత, మాజీ గోల్ఫర్లు, ఇతర క్రీడా విభాగాల ప్రముఖులు కూడా పామెర్ మృతికి సంతాపం ప్రకటించారు.

అర్నాల్డ్ పామెర్ (ఫైల్ ఫొటో)