క్రీడాభూమి

వెస్టర్న్ ఆస్ట్రేలియాతో భారత్ వామప్ మ్యాచ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్, జనవరి 7: వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎలెవెన్ జట్టుతో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని భారత జట్టు రెండు వామప్ మ్యాచ్‌లు ఆడుతుంది. శుక్రవారం టి-20 మ్యాచ్ జరుగుతుంది. ఒక రోజు తర్వాత అదే జట్టుతో 50 ఓవర్ల మ్యాచ్‌లో తలపడుతుంది. వివిధ టోర్నీల్లో పెర్త్ స్కార్చర్స్ పేరుతో ఆడే వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టులోని కీలక ఆటగాళ్లకు భారత్‌తో జరిగే రెండు వామప్ మ్యాచ్‌ల నుంచి మినహాయింపునిచ్చారు. ప్రస్తుతం పెర్త్ స్కార్చర్స్ జట్టు బిగ్ బాష్ లీగ్‌లో పాల్గొంటున్న కారణంగా, ద్వితీయ శ్రేణి ఆటగాళ్లను బరిలోకి దించుతారు. ఈనెల 12న ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచ్‌తో వనే్డ సిరీస్‌ను టీమిండియా ఆరంభిస్తుంది.
ఆసీస్ జట్టులో పారిస్‌కు స్థానం
భారత్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో భాగంగా మొదటి మూడు మ్యాచ్‌లకు 13 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఫాస్ట్ బౌలింగ్‌పైనే సెలక్టర్లు నమ్మకం ఉంచారు. ఫలితంగా స్పెషలిస్టు స్పిన్నర్ నాథన్ లియాన్‌కు స్థానం దక్కలేదు. అదే విధంగా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ పేరును కూడా సెలక్టర్లు చేర్చలేదు. ఇప్పటి వరకూ ఆసీస్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించని ఎమడచేతి వాటం పేసర్ జోల్ పారిస్‌ను ఎంపిక చేయడం విశేషం. బంతిని వికెట్‌కు ఇరువైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం ఉన్న పారిస్‌తోపాటు స్కాట్ బొలాండ్, కేన్ రిచర్డ్‌సన్ జట్టులో చోటు దక్కించుకున్నారు. గాయాలతో బాధపడుతున్న మిచెల్ స్టార్క్, నాథన్ కౌల్టర్ నైల్, పీటర్ సిడిల్‌లకు తగినంత విశ్రాంతినివ్వాలని సెలక్టర్లు భావించారు. కాగా, వాట్సన్‌తోపాటు జో బర్న్స్, జేమ్స్ పాటిన్సన్‌లకు నిరాశే ఎదురైంది. వీరి ఎంపిక పట్ల సెలక్టర్లు సుముఖత వ్యక్తం చేయలేదు. భారత జట్టుతో ఆస్ట్రేలియా ఈనెల 12న పెర్త్‌లో, 15న బ్రిస్బేన్‌లో, 17న మెల్బోర్న్, 20న కాన్‌బెరా, 23న సిడ్నీలో వనే్డ మ్యాచ్‌లు ఆడనుంది. వనే్డ సిరీస్ తర్వాత మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్ ఉంటుంది.
మొదటి మూడు వనే్డలకు ఆస్ట్రేలియా జట్టు: స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, జార్జి బెయిలీ, స్కాట్ బొలాండ్, జొష్ హాజెల్‌వుడ్, జేమ్స్ ఫాల్క్‌నెర్, ఆరోన్ ఫించ్, మిచెల్ మార్ష్, షాన్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, కేన్ రిచర్డ్‌సన్, జోల్ పారిస్, మాథ్యూ వేడ్.
దేశానికే ప్రాధాన్యమివ్వండి: క్లార్క్
వివిధ దేశాల్లో జరుగుతున్న క్లబ్ క్రికెట్ టోర్నీల కంటే దేశానికే ప్రాధాన్యం ఇవ్వాలని క్రికెటర్లకు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ సూచించాడు. ప్రపంచ వ్యాప్తంగా పలు టి-20 టోర్నీలు జరుగుతున్న విషయాన్ని అతను ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ, వాటివైపే చాలా మంది ఆటగాళ్లు మొగ్గు చూపుతున్నందువల్ల జాతీయ జట్లు బలహీన పడుతున్నాయని అన్నాడు. ఇటీవల కాలంలో వెస్టిండీస్ జట్టులో ప్రమాణాలు పడిపోవడాన్ని అతను గుర్తుచేశాడు. క్లబ్‌ల కంటే జాతీయ జట్లకే ప్రాధాన్యం ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)కి అతను హితవు పలికాడు. ఆస్ట్రేలియా దేశవాళీ చాంపియన్‌షిప్ బిగ్ బాష్‌లో పాల్గొంటున్న చాలా మంది విండీస్ క్రికెటర్లు తమ జాతీయ జట్టులో లేకపోవడం విచిత్రంగా ఉందని అన్నాడు. క్లబ్‌లు, ఇతర టోర్నీల్లో పాల్గొనడంలో తప్పులేదని, అయితే, కేవలం ధనార్జనే ధ్యేయంగా ఎంచుకొని జాతీయ జట్లకు ఆడకుండా ఎగ్గొట్టడం దారుణమని అన్నాడు. ఈ తీరు మారాలని చెప్పాడు. ఆటగాళ్లు తమ విధానాలను మార్చుకోకపోతే, ఐసిసి జోక్యం చేసుకోవాల్సిందేనని క్లార్క్ అన్నాడు. క్రిస్ గేల్, డ్వెయిన్ బ్రేవో, డారెన్ సమీ, ఆండ్రె రసెల్, శామ్యూల్స్ బద్రీ, లెండల్ సిమన్స్ తదితరులు ఇప్పుడు బిగ్ బాష్ టోర్నీలో ఆడుతూ, ఆసీస్ టూర్‌కు వచ్చిన విండీస్ జట్టుతో చేరేందుకు నిరాకరించడం దురదృష్టకరమని అన్నాడు. విండీస్ క్రికెటర్లు అనుసరిస్తున్న విధానాలే మిగతా దేశాల్లోనూ పలువురు ఆటగాళ్లు అనుకరిస్తున్నారని చెప్పాడు. ఆటగాళ్లంతా దేశానికే పెద్దపీట వేయాలని, జాతీయ జట్టుకు సేవలు అవసరం లేనప్పుడు మిగతా టోర్నీల్లో ఆడాలని క్లార్క్ సూచించాడు. క్రికెటర్లు మారకపోతే, వారిని దారిలోపెట్టే బాధ్యతను ఐసిసి స్వీకరించాలని అన్నాడు. లేకపోతే జాతీయ జట్లు వెలవెలబోతాయని చెప్పాడు.