క్రీడాభూమి

మియాందాద్‌కు దమ్ముంటే.. దావూద్‌ను పంపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ భారత్‌పై చేసిన విమర్శలకు బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ మంగళవారం దీటైన జవాబిచ్చాడు. అటు క్రికెట్ మైదానంలోనూ, ఇటు రణ క్షేత్రంలోనూ పాకిస్తాన్ విజయం సాధించలేకపోవడంతో ఎదురైన షాక్ నుంచి మియాందాద్ ఇంకా కోలుకున్నట్లు లేడని, అతను ఇంకా షాక్‌లోనే ఉన్నట్లు స్పష్టమవుతోందని బిసిసిఐ చీఫ్ వ్యాఖ్యానించాడు. జమ్మూ-కాశ్మీరులోని ఉరీలో కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడికి తెగబడి 19 మంది జవాన్ల ప్రాణాలను బలితీసుకోవడంతో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు మెరపు దాడులు నిర్వహించి దాయాది దేశానికి గట్టిగా బుద్ధి చెప్పిన విషయం విదితమే. దీంతో భారత్‌పై పూర్తిస్థాయి యుద్ధానికి పాకిస్తాన్ సిద్ధంగా ఉందని మియాందాద్ వ్యాఖ్యానించడంతో అనురాగ్ ఠాకూర్ పైవిధంగా స్పందించాడు. ‘1965, 1971లో జరిగిన యుద్ధాలతో పాటు కార్గిల్ యుద్ధంలో ఎదురైన పరాజయాల నుంచి పాకిస్తాన్ ఇంకా కోలుకోలేదు. అదేవిధంగా ప్రపంచ కప్ క్రికెట్ చరిత్రలో టీమిండియాపై పాకిస్తాన్ జట్టు కనీసం ఒక్కసారి కూడా గెలుపొందకపోవడంతో ఎదురైన షాక్ నుంచి మియాందాద్ కూడా ఇప్పటికీ బయటపడలేదు. అవసరమైతే క్రికెట్ మైదానంలోనైనా లేక రణ క్షేత్రంలోనైనా భారత్ మరోసారి పాకిస్తాన్‌ను మట్టికరిపిస్తుంది’ అని అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నాడు. అంతేకాకుండా మియాందాద్‌కు దమ్ము, ధైర్యం ఉంటే తన బంధువు, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంను బహిరంగ ప్రదేశంలో తిరగాల్సిందిగా చెప్పాలని బిసిసిఐ చీఫ్ సవాలు విసిరాడు. ‘సొంత బంధువుల పట్ల మియాందాద్‌కు నమ్మకం ఉంటే భారత్‌కు తిరిగి వెళ్లాల్సిందిగా దావూద్ ఇబ్రహీంకు ఎందుకు చెప్పడు? గతంలో మేము అన్నిసార్లూ పాకిస్తాన్‌ను ఓడించాం. భవిష్యత్తులోనూ ఓడించి తీరుతాం’ అని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశాడు. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు పునఃప్రారంభమయ్యే అవకాశాలు లేవని బిసిసిఐ చీఫ్ ఇప్పటికే పేర్కొన్న విషయం తెలిసిందే.