క్రీడాభూమి

సర్వత్రా ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: చాలాకాలంగా నలుగుతూ వస్తున్న క్రికెట్ సంస్కరణలకు సోమవారం తెరపడుతుందా లేక మరోసారి వాయిదా పడి, అనిశ్చితి కొనసాగుతుందా అనే ప్రశ్నలు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. లోధా సిఫార్సులను అమలు చేసి తీరాల్సిందేనని, దారికి రాకపోతే, ఏ విధంగా దారికి తెచ్చుకోవాలో తమకు తెలుసునని సుప్రీం కోర్టు ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సమర్పించబోయే అఫిడవిట్ ప్రభావం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం లోధా కమిటీ సిఫార్సులపై అనేక సందర్భాల్లో విస్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. బిసిసిఐ గతంలో లేవనెత్తిన అంశాలనే మళ్లీ వినిపించేందుకు సిద్ధమవుతున్నది. శనివారం ముంబయిలో జరిగిన బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం)లో ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోలేదు. ‘ఒక రాష్ట్రానికి ఒకే ఓటు’ వంటి అంశాలను కౌంటర్ అఫిడవిట్‌లో ప్రస్తావించాలని తప్ప ఎస్‌జిఎం ప్రత్యేకంగా తీసుకున్న నిర్ణయాలుగానీ, ఆమోదించిన తీర్మానాలుగానీ లేవు.
ఓటు హక్కుపై పట్టు!
ఒక రాష్ట్రానికి ఒకే ఓటు ఉండాలని, బోర్డు అధ్యక్షుడిని కూడా మూడు ఓట్లకు కాకుండా ఒక ఓటుకే పరిమితం చేయాలని లోధా కమిటీ చేసిన సూచనను ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం బిసిసిఐలో 30 యూనిట్లకు సభ్యత్వం ఉంది. సర్వీసెస్, రైల్వేస్ వంటి యూనిట్లకు సరిహద్దులంటూ ఏవీ లేవు. అంతేగాక, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి రెండు మించిన సంఘాలకు బిసిసిఐలో సభ్యత్వముంది.
ఈ విధమైన అసమానతలను తొలగించి, ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సంఘం మాత్రమే ఉండాలని లోధా కమిటీ స్పష్టం చేస్తున్నది. అదే విధంగా అధ్యక్షుడికి మూడు ఓట్లు ఉండడాన్ని కూడా తప్పుపట్టింది. ప్రస్తుత నిబంధనల బోర్డు అధ్యక్షుడికి ఆ హోదాలో ఒకటి, తాను ప్రాతినిథ్యం వహించే క్రికెట్ సంఘం తరఫున మరొకటి చొప్పున రెండు ఓట్లు ఉంటాయి. ఏదైనా తీర్మానానికి ఓటింగ్ అవసరమైనప్పుడు, అనుకూలంగా, వ్యతిరేకంగా సమానంగా ఓట్లు పోలైతే, కాస్టింగ్ ఓటు వేసే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. అంటే, బోర్డు అధ్యక్షుడు అవసరాన్ని బట్టి కనీసం రెండు, అత్యధికంగా మూడు ఓట్లు వేయవచ్చు. నిబంధనావళి నుంచి ఈ నిబంధనను తీసివేయాలని లోధా కమిటీ సూచించింది. అయితే, ఈ ప్రతిపాదనను అమలు చేయకూడదని బిసిసిఐ నిర్ణయించింది. ఇప్పటి వరకూ ఉన్న ఓటు హక్కు విధానానే్న కొనసాగించాలని పట్టుబడుతున్నది. ఒక రాష్ట్రానికి ఒకే ఓటు సూత్రాన్ని అమలుచేస్తే సమస్యలు మరింతగా పెరుగుతాయే తప్ప తగ్గవని బిసిసిఐ స్పష్టం చేస్తున్నది. ఆ విధానాన్ని అమలు చేస్తే, ఒక రాష్ట్రానికి ఎవరు ప్రాతినిథ్యం వహించాలన్న విషయంలో తీవ్రమైన పోటీ నెలకొంటుందని పేర్కొంది. దీనితో ఘర్షణపూరిత వాతావరణం నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది వరకు వినిపించిన ఇదే వాదనను సోమవారం దాఖలు చేయనున్న అఫిడవిట్‌లోనూ ప్రస్తావించడం ఖాయంగా తెలుస్తున్నది.
159 పేజీల నివేదిక
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌కు పాల్పడినట్టు రుజువైన చెన్నై సూపర్ కింగ్స్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గురునాథ్ మెయప్పన్, రాజస్థాన్ రాయల్స్ సహ భాగస్వామి రాజ్ కుంద్రాలను జీవితకాలం సస్పెండ్ చేసిన లోధా కమిటీ ఆతర్వాత భారత క్రికెట్ పారదర్శకంగా నడవడాలన్న ఉద్దేశంతో 159 పేజీలతో కూడిన నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. ఆ నివేదికలోని అంశాలను అమలు చేసి తీరాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేస్తుంటే, కొన్ని అంశాలు ఆచరణకు సాధ్యం కావని బోర్డు వాదిస్తున్నది. ఒక రాష్ట్రానికి ఒకే క్రికెట్ సంఘం, ఒకే ఓటు ఉండాలని, పరిధుల్లేని సర్వీసెస్, రైల్వేస్ వంటి క్రికెట్ సంఘాలను రద్దు చేయాలని లోధా కమిటీ చేసిన సూచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. సుప్రీం కోర్టులో సోమవారం సమర్పించే అఫిడవిట్‌లో ఇదే కీలకాంశంగా ఉంటుందని అంటున్నారు.
‘కూల్ ఆఫ్’పైనా వ్యతిరేకతే..
ఒక వ్యక్తి బిసిసిఐ పాలక మండలికి వరుసగా రెండుసార్లు, గరిష్టంగా మూడు సార్లు ఎన్నికకావచ్చని, అంతకంటే ఎక్కువ పర్యాయాలు లేదా తొమ్మిది సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పదవిలో ఉండరాదని లోధా కమిటీ చేసిన సూచనపైనా బోర్డు వ్యతిరేకతతో ఉంది. వరుసగా రెండు పార్యాయాలు బోర్డు మేనేజింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నవారు ఎవరైనా ఒక టెర్మ్ పోటీ చేయడానికి అనర్హులు. ఆ విశ్రాంత సమయానే్న లోదా కమిటీ ‘కూల్ ఆఫ్’గా అభివర్ణించింది. దీనిపైన కూడా బోర్డు తీవ్ర వ్యతిరేకతతో ఉంది. మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ బోర్డు పాలక మండలికి ఎన్నికైనా, గతంలో మాదిరి సేవలు అందించడం అసాధ్యమని వ్యాఖ్యానిస్తున్నది. ఠాకూర్ సమర్పించనున్న అఫిడవిట్‌లో ఇది కూడా ఒక ప్రధానాంశమని బోర్డు వర్గాలు అంటున్నాయి. అయితే, బిసిసిఐ ఇంత వరకూ అధికారకంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనితో ఠాకూర్ సోమవారం నాటి అఫిడవిట్ తీరుతెన్నులపై సస్పెన్స్ కొనసాగుతున్నది. అదే విధంగా సుప్రీం కోర్టు ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. బోర్డు అభ్యంతరాలను మరోసారి పరిశీలించడానికి సమయం తీసుకుంటుందా లేక ముందుగా హెచ్చరించిన విధంగానే ఆదేశాలు జారీ చేస్తుందా అన్నది చూడాలి.