క్రీడాభూమి

ఆశలన్నీ సింధుపైనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒడెన్స్, అక్టోబర్ 17: డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బాడ్మింటన్ టోర్నమెంట్ మంగళవారం నుంచి ఇక్కడ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పాల్గొనే భారత బృందానికి ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, తెలుగు తేజం పివి.సింధు సారథ్యం వహించనుంది. రియో ఒలింపిక్ క్రీడల్లో భారత కీర్తి, ప్రతిష్టలను ఇనుమడింపజేసిన తర్వాత సింధు మళ్లీ అంతర్జాతీయ సర్క్యూట్‌లోకి దిగనుండటం ఇదే తొలిసారి. దీంతో ఆమెపై అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఒలింపిక్స్‌లో భారత్‌కు రజత పతకాన్ని అందించిన తొలి బాడ్మింటన్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన సింధు రియో డీ జెనిరో నుంచి స్వదేశానికి చేరుకున్న తర్వాత గత ఒకటిన్నర నెల రోజుల నుంచి అభినందన కార్యక్రమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఒలింపిక్స్‌లో అద్భుతమైన ప్రదర్శనతో అలరించి దేశానికే గర్వకారణంగా నిలిచిన సింధు ఇప్పుడు డెన్మార్క్ ఓపెన్ టోర్నీలోనూ అదే జోరు కొనసాగిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ టోర్నీలో ఆరో సీడ్‌గా బరిలోకి దిగుతున్న సింధు చైనాకు చెందిన హీ బింగ్జియావోతో బుధవారం జరిగే మ్యాచ్‌తో పోరాటాన్ని మొదలు పెట్టనుంది. ఈ టోర్నీ సెకెండ్ హాఫ్ డ్రాలో చోటు దక్కించుకున్న సింధు థాయిలాండ్‌కు చెందిన రెండో సీడ్ రచనోక్ ఇతనోన్, కొరియాకు చెందిన నాలుగో సీడ్ సంగ్ జీ హ్యున్‌లతో పాటు చైనీస్ తైపీకి చెందిన ఐదోసీడ్ క్రీడాకారిణి తై జు ఇంగ్‌తో తలపడే అవకాశాలున్నాయి. మోకాలి గాయం కారణంగా ఒలింపిక్స్‌లో అవకాశాలను చేజార్చుకున్న భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఇంకా ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేకపోవడంతో ఇప్పుడు అభిమానులంతా సింధు పైనే ఆశలు పెట్టుకున్నారు. అయితే అభిమానులు తనపై ఎంతగా ఆశలు పెట్టుకున్నారో తెలుసని, వారి అంచనాలకు తగ్గట్టు రాణించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సింధు స్పష్టం చేసింది. ‘ఒలింపిక్ క్రీడలు నాలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ఇకపై ఇదే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతా. గతంలో కంటే ఇప్పుడు నా బాధ్యతలు మరింత పెరిగాయి. అయినప్పటికీ ఎటువంటి వత్తిడికి గురికాకుండా నా ఆట నేను ఆడుతా. బరిలోకి దిగి వందకు వంద శాతం రాణించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తా’ అని బింగ్జియావోతో 1-3 రికార్డును కలిగివున్న సింధు పేర్కొంది.
ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రెండుసార్లు కాంస్య పతకాలను సాధించిన సింధు ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకోవడానికి ముందు ముగ్గురు టాప్ ప్లేయర్లను మట్టికరిపించిన విషయం విదితమే. అయితే గత ఏడాది డెన్మార్క్ ఓపెన్‌లో రన్నరప్ టైటిల్‌ను గెలుచుకున్న సింధు సూపర్ సిరీస్ టోర్నీల్లో తన అత్యుత్తమ ప్రదర్శన అదేనని తెలిపింది. కాగా, డచ్ ఓపెన్‌లో అద్భుత ప్రదర్శనతో రాణించి సోమవారం ఫైనల్‌లో పోరాటాన్ని ముగించిన భారత ఆటగాడు అజయ్ జయరామ్ (29) ఇప్పుడు డెన్మార్క్ ఓపెన్‌లోనూ అదే ప్రదర్శన కొనసాగించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. థాయిలాండ్‌కు చెందిన బూన్సక్ పోన్సానాతో జరిగే మ్యాచ్‌తో అతని పోరాటం ఆరంభమవుతుంది. డెన్మార్క్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో అజయ్ జయరామ్‌తో పాటు కామనె్వల్త్ గేమ్స్ చాంపియన్ పారుపల్లి కశ్యప్‌తో పాటు బి.సాయి ప్రణీత్, హెచ్.ఎస్.ప్రణయ్ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా, ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన కిదాంబి శ్రీకాంత్ మడమ గాయం కారణంగా ఈ టోర్నీకి దూరమయ్యాడు. ఇక పురుషుల డబుల్స్ విభాగంలో మను అత్రి, బి.సుమిత్ రెడ్డి జోడీతో పాటు ప్రణవ్ జెర్రీ చోప్రా, అక్షయ్ దేవాల్కర్ జోడీ, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ప్రణవ్, ఎన్.సిక్కీ రెడ్డి భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు. ప్రస్తుత సీజన్‌లో బ్రెజిల్, రష్యాల్లో రెండు టైటిళ్లను గెలుచుకున్న ప్రణవ్, సిక్కీరెడ్డి డెన్మార్క్‌కు చెందిన జోవాచిమ్ ఫిషర్ నీల్సన్, క్రిస్టినా పెడర్సన్ (ఐదో సీడ్ జోడీ)లతో మంగళవారం పోరాటాన్ని ఆరంభించనున్నారు.