క్రీడాభూమి

క్రికెట్ బోర్డుకు మరో దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును ప్రక్షాళన చేసేందుకు సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫారసుల విషయంలో బిసిసిఐకి మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సిఫారసులను అమలుచేసి తీరాలని స్పష్టం చేస్తూ గతంలో వెలువరించిన తీర్పును మళ్లీ సమీక్షించాలని కోరుతూ బిజెపి ఎంపీ అనురాగ్ ఠాకూర్ సారథ్యంలోని బిసిసిఐ దాఖలు చేసుకున్న రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు మంగళవారం డిస్మిస్ చేసింది. దేశంలో క్రికెట్ వ్యవహారాలను సంస్కరించేందుకు బోర్డును సమూల ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని జస్టిస్ లోధా కమిటీ పేర్కొంటూ, ఇందుకోసం పలు సిఫారసులను చేసిన విషయం విదితమే. రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 70 ఏళ్ల వయసు పైబడిన వారు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పాలక మండలిలో పదవులు పొందకుండా నిషేధం విధించాలని, ఒక రాష్ట్ర క్రికెట్ సంఘానికి ఒకే ఓటును, ఏ వ్యక్తికైనా ఒకే పదవిని కల్పించాలని, అలాగే ఒకసారి పదవి చేపట్టిన వారు మరోసారి ఏదైనా పదవికి పోటీ చేసేందుకు మధ్యలో మూడేళ్ల విరామం ఉండాలన్న కీలక సిఫారసులు వీటిలో ఉన్నాయి. ఈ సిఫారసులన్నింటినీ అమలుచేసి తీరాల్సిందేనని స్పష్టం చేస్తూ ప్రధాన న్యాయమూర్తి టిఎస్.్ఠకూర్, జస్టిస్ ఎఎం.ఖన్విల్కర్, జస్టిస్ డివై.చంద్రచూడ్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం జూలై 18వ తేదీన తీర్పునివ్వడంతో బిసిసిఐ ఇప్పటికే కొన్ని చిన్నచిన్న సిఫారసులను ఆమోదించినప్పటికీ, పైన పేర్కొన్న మూడు కీలక సిఫారసులను అమలు చేయడంలో తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. ఏళ్ల తరబడి క్రికెట్ బోర్డులో పాతుకుపోయిన పలువురు ‘పెద్దలు’ ఈ కీలక సిఫారసులను జీర్ణించుకోలేకపోతుండటంతో జులై 18న ఇచ్చిన తీర్పుపై మళ్లీ సమీక్ష జరపాలని కోరుతూ సుప్రీం కోర్టులో బిసిసిఐ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.
ఇదిలావుంటే, లోధా కమిటీ సిఫారసులను అమలుచేసే వరకూ బిసిసిఐపై ఆర్థికపరమైన ఆంక్షలు విధించే విషయాన్ని పరిశీలించాలని సుప్రీం కోర్టు సోమవారం నిర్ణయించింది. బోర్డు ఉపయోగించుకునే నిధులపై పరిమితి విధించాలని, అన్ని రకాల ఆర్థిక ఒప్పందాలు, కాంట్రాక్టుల విషయంలో లోధా కమిటీ నుంచి బిసిసిఐ తప్పనిసరిగా అనుమతి పొందేలా చూడాలన్న అంశాలపై సుప్రీం కోర్టు తన ఉత్తర్వులను రిజర్వు చేసింది. అలాగే ప్రస్తుత బిసిసిఐ పాలక మండలి సభ్యుల స్థానంలో స్వతంత్ర అడ్మినిస్ట్రేటర్లను నియమించే అవకాశం కూడా ఉన్నప్పటికీ దీనిని ‘చాలా తీవ్రమైన అవకాశం’గా సుప్రీం కోర్టు పరిగణిస్తోంది.