క్రీడాభూమి

కివీస్‌పై మరో దాడికి ధోనీ సేన సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: న్యూజిలాండ్‌పై మరోసారి దాడి చేసేందుకు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని భారత క్రికెట్ జట్టు సిద్ధంగా ఉంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భాగంగా ధర్మశాలలో జరిగిన మొదటి వనే్డను టీమిండియా ఇంకా 101 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో గెల్చుకున్న విషయం తెలిసిందే. ప్రత్యర్థిని 43.5 ఓవర్లలో 190 పరుగులకే పరిమితం చేసిన ధోనీ బృందం ఆతర్వాత 33.1 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ 85 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. బౌలింగ్‌లో హార్దిక్ పాండ్య, అమిత్ మిశ్రా (చెరి మూడు వికెట్లు), ఉమేష్ యాదవ్ (రెండు వికెట్లు) చక్కటి ప్రతిభ కనబరిచారు. వనే్డ కెరీర్‌లో తొలిసారి బౌలింగ్‌కు దిగిన యువ బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్ రెండు వరుస బంతుల్లో రెండు వికెట్లు కూల్చాడు. అతను రెండు ఓవర్లలో ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడు. మొత్తం మీద అన్ని విభాగాల్లోనూ తనదైన ముద్ర వేసిన భారత జట్టు అదే ఆధిపత్యాన్ని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో గురువారం జరిగే రెండో వనే్డలోనూ కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది. కెప్టెన్ ధోనీ ఫామ్‌పై అనుమానాలను మినహాయిస్తే, జట్టు మేనేజ్‌మెంట్‌ను వేధిస్తున్న సమస్యలు ఏమీ లేవు.
మార్పులు లేకుండానే: మొదటి వనే్డలో ఆడిన జట్టును ఎలాంటి మార్పులుచేర్పులు లేకుండానే రెండో మ్యాచ్‌లోనూ మైదానంలోకి దించడం ఖాయంగా కనిపిస్తున్నది. వైరల్ జ్వరం కారణంగా మొదటి వనే్డకు దూరమైన సురేష్ రైనా ఇంకా కోలుకోలేదు. అతను రెండో మ్యాచ్‌కి కూడా అందుబాటులో ఉండడని జట్టు మేనేజ్‌మెంట్ ఇప్పటికే ప్రకటించింది. దీనితో మొదటి వనే్డలో స్థానం దక్కించుకున్న మనీష్ పాండే లేదా కేదార్ జాదవ్ రెండో మ్యాచ్‌లో ఉంటారన్నది విశే్లషకుల అభిప్రాయం. అంతేగాక, విజయాలు సాధిస్తున్నంత కాలం జట్టులో మార్పులను ధోనీ అంగీకరించడు. ఈ సెంటిమెంట్‌ను బట్టి చూసినా మొదటి వనే్డలో ఆడిన జట్టునే కొనసాగిస్తారన్న వాదన బలపడుతుంది.
ఫామ్‌లో లేని ధోనీ: టీమిండియా కెప్టెన్ ధోనీ వికెట్‌కీపర్‌గా రాణిస్తున్నప్పటికీ, బ్యాటింగ్‌లో విఫలమవుతున్నాడు. భారీ స్కోర్లతో మ్యాచ్‌ల ఫలితాలను నిర్ణయిస్తూ, గొప్ప ఫినిషర్‌గా పేరుసంపాదించిన అతను కొంతకాలంగా అనుకున్న స్థాయిలో పరుగులు కొల్లగొట్టలేకపోతున్నాడు. ధర్మశాల వనే్డలో అతను 21 పరుగులు చేసి రనౌటయ్యాడు. అయితే, మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు ధోనీకి ఎక్కువ సమయం పట్టదని జట్టు చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే ధీమా వ్యక్తం చేస్తున్నాడు. కాగా, వనే్డల్లో 9,000 మైలురాయికి ధోనీ 61 పరుగుల దూరంలో ఉన్నాడు. ఫిరోజ్ షా కోట్లాలో ఈ స్కోరు చేయగలిగితే, అతను ఫామ్‌లోకి వచ్చినట్టే అనుకోవాలి. పైగా, విరాట్ కోహ్లీ తదితరులు భారీగా పరుగులు సాధించగల సమర్థులు కాబట్టి బ్యాటింగ్‌కు దిగాల్సిన అవసరం ధోనీకి రాకపోవచ్చన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నది.
లాథమ్ ఒక్కడే: న్యూజిలాండ్ ఆటగాళ్లలో టామ్ లాథమ్ ఒక్కడే మొదటి వనే్డలో పోరాటాన్ని కొనసాగించాడు. అతను 79 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, టెయిలెండర్ టిమ్ సౌథీ 55 పరుగులు సాధించాడు. న్యూజిలాండ్ చేసిన 190 రన్స్‌లో వీరిద్దరు కలిసి చేసినవి 134 పరుగులు కావడం గమనార్హం. మిగతా ఆటగాళ్లంతా కలిసి 56 పరుగులకే పరిమితమయ్యారు. మార్టిన్ గుప్టిల్ (12) తప్ప మిగతా టాప్ బ్యాట్స్‌మెన్ కొరీ ఆండర్సన్, కేన్ విలియమ్‌సన్, రాస్ టేలర్, ఆల్‌రౌండర్ మిచెల్ సాంట్నర్ కనీసం రెండంకెల స్కోర్లు కూడా చేయలేకపోయారు. వీరు ఫామ్‌లోకి వస్తే తప్ప భారత బౌలింగ్‌ను కివీస్ సమర్థంగా ఎదుర్కొనే అవకాశం లేదు. చాలాకాలంగా జట్టుకు భారంగా పరిణమించిన రాస్ టేలర్‌ను తప్పించే సాహసం కెప్టెన్ విలియమ్‌సన్ చేస్తాడా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది.
మ్యాచ్ గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు మొదలవుతుంది.

భారత వనే్డ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నెట్ ప్రాక్టీస్. గురువారం నుంచి న్యూజిలాండ్‌తో న్యూఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగే రెండో వనే్డకు భారత క్రికెట్ జట్టు సిద్ధమవుతున్నది. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా మూడు మ్యాచ్‌ల టెస్టు సిఠీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో ధోనీ నాయకత్వంలో బరిలోకి దిగిన భారత్ తొలి మ్యాచ్‌ని గెల్చుకొని, 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ సిరీస్‌లో కనీసం మరో మూడు మ్యాచ్‌ల్లో విజయభేరి మోగిస్తే, వనే్డ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ నాలుగు నుంచి మూడో స్థానానికి చేరుతుంది.