క్రీడాభూమి

విశాఖలో ‘ఆఖరి యుద్ధం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం స్టేడియంలో భారత్ ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్‌లు ఆడింది. నాలుగు విజయాలు సాధించింది. ఒక మ్యాచ్‌ని కోల్పోయింది. చివరిసారి ఈ మైదానంలో 2014 నవంబర్‌లో శ్రీలంకతో మ్యాచ్ ఆడింది. లంకను 5-0 తేడాతో వైట్‌వాష్ చేసే క్రమంలో ఇక్కడ విజయాన్ని నమోదు చేసింది

విశాఖపట్నం (స్పోర్ట్స్), అక్టోబర్ 28: విశాఖపట్నం వైఎస్‌ఆర్ ఎసిఎ-విడిసిఎ స్టేడియం వేదికగా శనివారం జరిగే ఆఖరి యుద్ధానికి భారత్, న్యూజిలాండ్ జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇరు జట్లు చెరి రెండు విజయాలతో సమవుజ్జీలుగా నిలవడంతో, చివరిదైన ఐదో వనే్డ ప్రాధాన్యతను సంతరించుకుంది. సిరీస్‌కు ‘ఫైనల్’గా పేర్కొనే ఈ పోరు భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కూడా కీలకంగా మారింది. విరాట్ కోహ్లీ నాయకత్వంలో భారత టెస్టు జట్టు న్యూజిలాండ్‌కు 3-0 తేడాతో వైట్‌వాష్ వేస్తే, ధోనీ కెప్టెన్సీలో నిలకడలేమితో అల్లాడుతున్నది. ధోనీ స్వయంగా వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. దీనికితోడు మిగతా ఆటగాళ్లు ఎప్పుడు రాణిస్తారో, ఎప్పుడు విఫలమవుతారో తెలియని పరిస్థితి. సాధారణ లక్ష్యాలను కూడా ఛేదించలేక కీలక బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడడం భారత అభిమానులను వేధిస్తున్నది. కేన్ విలియమ్‌సన్ నాయకత్వం వహిస్తున్న కివీస్‌ను చివరి వనే్డలో టీమిండియా ఓడిస్తుందా లేక నాలుగో వనే్డలో మాదిరిగానే చేతులెత్తేస్తుందా అన్న అనుమానం తలెత్తుతున్నది.
కెప్టెన్సీపై విమర్శలు
ధోనీ కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతని నాయకత్వంలో భారత్ వరుసగా మూడు వనే్డ సిరీస్‌లను చేజార్చుకుంది. బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లి 1-2 తేడాతో ఓడింది. ఆస్ట్రేలియా చేతిలో 1-4 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. దక్షిణాఫ్రికాను స్వదేశంలో ఎదుర్కొని, 2-3 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఒకవైపు కోహ్లీ నాయకత్వంలో భారత టెస్టు జట్టు అద్భుత విజయాలను సాధిస్తుంటే, మరోవైపు ధోనీ కెప్టెన్సీలో ఆశించిన స్థాయిలో ఆడలేకపోవడం విమర్శలకు ప్రధాన కారణం. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న భారత్ ఈ సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్ ఆడుతుంది. తిరిగి వచ్చే ఏడాది జూన్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ వరకూ ఈ ఫార్మాట్‌లో మ్యాచ్‌లు ఆడదు. కాబట్టి, చివరి మ్యాచ్‌లో జట్టును గెలిపించడంతోపాటు, ఇంగ్లాండ్‌పైనా సిరీస్‌ను అందిస్తే తప్ప ధోనీ కెప్టెన్సీ పదిలంగా ఉండదనేది వాస్తవం.
కోహ్లీపైనే భారం!
ధోనీ కాదు అంటూ కొట్టివేస్తున్నప్పటికీ, భారత జట్టు ఎక్కువగా విరాట్ కోహ్లీపైనే ఆధారపడిందనడం నిజం. న్యూజిలాండ్‌పై సాధించిన రెండు విజయాల్లోనూ అతను కీలక పాత్ర పోషించాడు. ధర్మశాలలో అతను 85 పరుగులు చేసి, భారత్ సులభంగానే లక్ష్యాన్ని చేరుకోవడానికి సహకరించాడు. మొహాలీ టెస్టులో 154 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, జట్టును గెలిపించాడు. కాగా, ఓపెనర్లు రోహిత్ శర్మ, ఆజింక్య రహానే ఇంకా నిలదొక్కుకోలేకపోవడంతో కోహ్లీపై భారం మరింతగా పెరుగుతున్నది. రాంచీలో జరిగిన నాలుగో వన్డలో 261 పరుగుల సాదాసీదా లక్ష్యాన్ని చేరేందుకు టీమిండియా చేసిన ప్రయత్నంలో రహానే (57) అర్ధ శతకంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. కోహ్లీ 45 పరుగులు చేశాడు. కానీ, ఇద్దరూ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయారు. వీరి తర్వాత ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లలో స్పెషలిస్టు స్పిన్నర్ అక్షర్ పటేల్ (38) మూడో స్థానంలో ఉన్నాడంటే, మిగతా వారు ఏ స్థాయిలో విఫలమయ్యారో ఊహించుకోవచ్చు. అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా టీమిండియా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. బౌలింగ్ విభాగం కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ, బ్యాట్స్‌మెన్ రాణించలేకపోవడమే భారత్ పరాజయాలకు ప్రధాన కారణం. ఈ విభాగం బలోపేతమైతే, కీలకమైన చివరి వనే్డలో కివీస్‌ను ఓడించడం భారత జట్టుకు కష్టం కాదు.
న్యూజిలాండ్‌దీ ఇదే తీరు..
నిలకడలేమి అన్నది భారత్‌నేకాదు.. న్యూజిలాండ్‌ను కూడా వేధిస్తున్నది. వరుస వైఫల్యాలతో సతమతమైన ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ నాలుగో వనే్డలో 72 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫామ్‌ను కోల్పోయిన మాజీ కెప్టెన్ రాస్ టేలర్ 32 పరుగులు చేసి, ధోనీ అసాధారణ ప్రతిభ కారణంగా రనౌటయ్యాడు. వీరిద్దరూ మళ్లీ తమదైన ఆటతో ఆకట్టుకోవడం న్యూజిలాండ్ శిబిరానికి ఊరటనిస్తున్నది. అయితే, జట్టులో ఎవరూ నిలకడగా ఆడడం లేదు. మూడు నెలలుగా విదేశాల్లో పర్యటిస్తున్న ఈ జట్టు అన్ని విభాగాల్లోనూ తక్కువ స్థాయిలో ఉన్న జింబాబ్వే టూర్‌లో మాత్రమే సఫలమైంది. అక్కడ 2-0 తేడాతో టెస్టు సిరీస్‌ను గెల్చుకుంది. అనంతరం దక్షిణాఫ్రికాకు వెళ్లి, ఇదే ఫార్మాట్‌లో సిరీస్‌ను 1-1గా డ్రా చేసుకుంది. భారత్‌లో టెస్టు సిరీస్ ఆడి, 0-3 తేడాతో వైట్‌వాష్ వేయించుకుంది. ఈ వనే్డ సిరీస్‌ను గెల్చుకుంటే కొంతలో కొంతైనా పరువు నిలబడుతుందని ఆ జట్టు కెప్టెన్ విలియమ్‌సన్ ఆలోచన. అందుకే, శనివారం నాటి మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఏవైనా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప, చివరి పోరు హోరాహోరీగా కొనసాగడం ఖాయం.