క్రీడాభూమి

ఇశాంత్‌కు చోటు ఖాయమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 1: ఇంగ్లాండ్‌తో కొద్ది రోజుల్లో జరుగనున్న టెస్టు సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేసేందుకు జాతీయ సెలెక్షన్ కమిటీ బుధవారం ముంబయిలో సమావేశం కానుంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) వర్గాలు మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించాయి. కొద్ది రోజుల క్రితం న్యూజిలాండ్‌తో ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో ‘క్లీన్ స్వీప్’ చేసినప్పటికీ ఇప్పుడు ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు భారత జట్టును ప్రకటించే ముందు ఎంఎస్‌కె.ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ కొన్ని అంశాలను పరిశీలించనుంది. కివీస్‌తో కాన్పూర్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ లోకేష్ రాహుల్ గాయపడటం, అలాగే పేస్ బౌలర్ ఇశాంత్ శర్మ అనారోగ్యానికి గురవడంతో కోల్‌కతాలో జరిగిన రెండో టెస్టులో సీనియర్ ఓపెనర్ గౌతం గంభీర్‌తో పాటు ఆఫ్‌బ్రేక్ బౌలర్ జయంత్ యాదవ్‌కు సెలెక్టర్లు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఈడెన్ గార్డెన్స్‌లో గంభీర్ ఆడకపోయినప్పటికీ కోల్‌కతా టెస్టులో వేలికి గాయమడవంతో ఇండోర్‌లో చివరి టెస్టుకు దూరమైన శిఖర్ ధావన్ స్థానంలో గంభీర్ బరిలోకి దిగి రెండేళ్ల సుదీర్ఘ వ్యవధి తర్వాత మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించడంతో పాటు ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం సాధించి తన సత్తా నిరూపించుకోగలిగాడు. ఈ టెస్టులో శిఖర్ ధావన్‌కు బదులుగా కరుణ్ నాయర్‌ను జట్టులోకి తీసుకున్నప్పటికీ తుది జట్టులో అతనితో పాటు జయంత్ యాదవ్‌కు చోటు దక్కలేదు. అయితే ఇప్పుడు లోకేష్ రాహుల్, శిఖర్ ధావన్ ఫిట్నెస్ పరీక్షలో నెగ్గి, ఇంగ్లాండ్‌తో ఆడేందుకు సిద్ధమైన పక్షంలో గంభీర్‌పై సెలెక్టర్లు మళ్లీ విశ్వాసం ఉంచుతారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇంతకుముందు ఒడిశా జట్టుతో జరిగిన రంజీ మ్యాచ్‌లో కూడా గంభీర్ ఢిల్లీ తరఫున ఆడి 147 పరుగులతో రాణించాడు.
అయితే చికున్‌గున్యా వ్యాధి నుంచి కోలుకున్న పేస్ బౌలర్ ఇశాంత్ శర్మకు ఇంగ్లాండ్‌తో తలపడే భారత జట్టులో సెలెక్టర్లు చోటు కల్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కివీస్‌తో కాన్పూర్‌లో జరిగిన తొలి టెస్టులోనే ఇశాంత్‌కు చోటు కల్పించినప్పటికీ ఆ మ్యాచ్‌తో పాటు మిగిలిన రెండు టెస్టుల్లోనూ అతను ఆడేలేకపోయాడు. అయితే ఇటీవల రెండు రంజీ మ్యాచ్‌లు ఆడిన ఇశాంత్ శర్మ చక్కటి పేస్‌తో 40 ఓవర్లకు పైగా బౌలింగ్ చేశాడు. ఏది ఏమైనప్పటికీ కివీస్‌తో తలపడిన కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టులో సెలెక్టర్లు పెద్దగా మార్పులేమీ చేయకుండానే ఇంగ్లాండ్‌తో పోరుకు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గాయాల కారణంగా కివీస్‌తో ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేకపోయిన లోకేష్ రాహుల్‌తో పాటు పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఇంకా తమ ఫిట్నెస్‌ను నిరూపించుకోలేదు. వేలి గాయంతో ఇబ్బందులు పడుతున్న శిఖర్ ధావన్‌తో పాటు చీలమండ గాయానికి చికిత్స చేయించుకుంటున్న రాహుల్, మడమ గాయంతో బాధపడుతున్న భువనేశ్వర్ కుమార్ ఫిట్నెస్‌ను నిరూపించుకుంటే తప్ప వారికి జట్టులో చోటు లభించే అవకాశాలు కనిపించడం లేదు.
నేడు ఇంగ్లాండ్ జట్టు రాక
ఇదిలావుంటే, బంగ్లాదేశ్‌లో రెండు టెస్టుల సిరీస్‌ను డ్రాగా ముగించిన ఇంగ్లాండ్ జట్టు బుధవారం నేరుగా ముంబయికి చేరుకోనుంది. ఇంగ్లాండ్ జట్టు షెడ్యూలులో ప్రాక్టీస్ మ్యాచ్ ఏదీ లేదని, అయితే టీమిండియాతో తొలి టెస్టు ఆడేందుకు రాజ్‌కోట్‌కు బయలుదేరే ముందు ఆ జట్టు 5వ తేదీన క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ఒకే ఒక్క ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంటుందని బిసిసిఐ వర్గాలు తెలిపాయి. ‘ఇంగ్లాండ్ జట్టు షెడ్యూలులో ప్రస్తుతం ఒక్క ప్రాక్టీస్ సెషన్ మాత్రమే ఉంది. ఒకవేళ మరిన్ని సెషన్లు కావాలని వారు కోరితే ఏర్పాటు చేస్తాం’ అని ఆ వర్గాలు స్పష్టం చేశాయ. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు జరిగే తొలి టెస్టు కోసం ఇంగ్లాండ్ జట్టు 5వ తేదీ సాయంత్రం గానీ లేక ఆ మరుసటి రోజు ఉదయం గానీ రాజ్‌కోట్‌కు బయలుదేరుతుంది.