క్రీడాభూమి

ఇంగ్లాండ్ ఎదురుదాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, నవంబర్ 12: ఇంగ్లాండ్‌తో జరుతున్న మొదటి టెస్టు డ్రా దిశగా సాగుతున్నది. మ్యాచ్ నాలుగో రోజు ఆటను నాలుగు వికెట్లకు 319 పరుగుల స్కోరుతో మొదలుపెట్టిన టీమిండియాపై ఇంగ్లాండ్ ఎదురుదాడికి దిగింది. స్పిన్నర్లు, ప్రత్యేకించి అదిల్ రషీద్ భారత బ్యాట్స్‌మెన్‌ను భారీ స్కోర్లు చేయకుండా కట్టడి చేశారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో 49 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించి, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టం లేకుండా 114 పరుగులు చేసింది. దీనితో ఇంగ్లాండ్ ఆధిక్యం 163 పరుగులకు చేరుకోగా, పది వికెట్లు చేతిలోనే ఉన్నాయి. మరొక్క రోజు ఆట మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో, ఈ టెస్టు డ్రాగా ముగియడం ఖాయంగా కనిపిస్తున్నది. చివరి రోజైన ఆదివారం నాటి ఆటలో ఇంగ్లాండ్ వేగంగా పరుగులు రాబట్టి, ఆతర్వాత ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడం ద్వారా భారత్‌పై ఒత్తిడిని పెంచడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. అయితే, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం అసాధ్యంగా కనిపిస్తున్నది.
అశ్విన్ అర్ధ శతకం
నాలుగో రోజు ఆటలో రవిచంద్రన్ అశ్విన్ అర్ధ శతకం సాధించడాన్ని మినహాయిస్తే, భారత్ చెప్పుకోతగ్గ స్థాయిలో ఆడలేకపోయింది. మూడోరోజు ఆట చివరి ఓవర్, మూడో బంతికి నైట్ వాచ్‌మన్ అమిత్ మిశ్రా క్లీన్ బౌల్డ్‌కావడంతో, ఆ వెంటనే ఆటను నిలిపివేశారు. దీనితో నాలుగో రోజు ఉదయం నాటౌట్ బ్యాట్స్‌మన్, కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి ఆజింక్య రహానే మైదానంలోకి దిగాడు. కానీ, అతను ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక, జాఫర్ అన్సారీ బౌలింగ్‌లో బంతిని అర్థం చేసుకోలేక, బౌల్డ్ అయ్యాడు. మరికొద్ది సేపటికే కోహ్లీ కూడా పెవిలియన్ చేరాడు. అదిల్ రషీద్ బంతిని రక్షణాత్మకంగా ఆడే క్రమంలో అతను పొరపాటు చేశాడు. ఎడమకాలు వికెట్లకు తగిలి, బెయిల్ కిందపడడంతో హిట్ వికెట్‌గా కోహ్లీ అవుటయ్యాడు. అతను 95 బంతుల్లో 40 పరుగులు చేశాడు. అశ్విన్, వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా ఏడో వికెట్‌కు 64 పరుగులు జోడించి, ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. సాహా 82 బంతుల్లో 35 పరుగులు చేసి, మోయిన్ అలీ బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టోకు దొరికిపోయాడు. రవీంద్ర జడేజా (12), ఉమేష్ యాదవ్ (5) ఒకరి తర్వాత మరొకరిగా పెవిలియన్ చేరితే, 139 బంతులు ఎదుర్కొని, ఏడు ఫోర్ల సాయంతో 70 పరుగులు చేసిన అశ్విన్‌ను జాఫర్ అన్సారీ క్యాచ్ అందుకోగా మోయిన్ అలీ అవుట్ చేశాడు. దీనితో 488 పరుగుల స్కోరువద్ద భారత్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. అప్పటికి మహమ్మద్ షమీ 8 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు.
సెంచరీ భాగస్వామ్యం
భారత్ మొదటి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత, రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు అలిస్టర్ కుక్, హసీబ్ హమీద్ సెంచరీ భాగస్వామ్యాన్ని అందించారు. వీరిద్దరూ 37 ఓవర్లలో 114 పరుగులు జోడించి, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి నాటౌట్‌గా ఉన్నారు. కుక్ 107 బంతుల్లో 46, హమీద్ 116 బంతుల్లో 62 చొప్పున పరుగులు చేశారు. మ్యాచ్ చివరి రోజు వీరు ఎంత వేగంగా స్కోరును ముం దుకు తీసుకెళతారన్న అంశాలపైనే ఈ టెస్టు ఫలితం ఆధారపడింది.

స్కోరుబోర్డు
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్: 159.3 ఓవర్లలో ఆలౌట్ 537 (జో రూట్ 124, మోయిన్ అలీ 117, బెన్ స్టోక్స్ 128, మహమ్మద్ షమీ 2/65, ఉమేష్ యాదవ్ 2/112, అశ్విన్ 2/167, రవీంద్ర జడేజా 3/86.
భారత్ మొదటి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 4 వికెట్లకు 319): మురళీ విజయ్ సి హసీబ్ హమీద్ బి అదిల్ రషీద్ 126, గౌతం గంభీర్ ఎల్‌బి స్టువర్ట్ బ్రాడ్ 29, చటేశ్వర్ పుజారా సి అలిస్టర్ కుక్ బి బెన్ స్టోక్స్ 124, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ హిట్ వికెట్ 40, అమిత్ మిశ్రా సి హసీబ్ హమీద్ 0, ఆజింక్య రహానే బి జాఫర్ అన్సారీ 13, రవిచంద్ర అశ్విన్ సి జాఫర్ అన్సారీ బి మోయిన్ అలీ 70, వృద్ధిమాన్ సాహా సి జానీ బెయిర్‌స్టో బి మోయిన్ అలీ 35, రవీంద్ర జడేజా సి హసీబ్ హమీద్ బి అదిల్ రషీద్ 12, ఉమేష్ యాదవ్ సి బెన్ స్టోక్స్ బి అదిల్ రషీద్ 5, మహమ్మద్ షమీ 8 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 26, మొత్తం (162 ఓవర్లలో ఆలౌట్) 488.
వికెట్ల పతనం: 1-68, 2-277, 3-318, 4-319, 5-349, 6-361, 7-425, 8-449, 9-459, 10-488.
బౌలింగ్: స్టువర్ట్ బ్రాడ్ 29-9-78-1, క్రిస్ వోక్స్ 31-6-57-0, మోయిన్ అలీ 31-7-85-2, జాఫర్ అన్సారీ 23-1-77-2, అదిల్ రషీద్ 31-1-114-4, బెన్ స్టోక్స్ 17-2-52-1.
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: అలిస్టర్ కుక్ 46 నాటౌట్, హసీబ్ హమీద్ 62 నాటౌట్, మొత్తం (37 ఓవర్లలో వికెట్ నష్టం లేకుండా) 114.
బౌలింగ్: మహమ్మద్ షమీ 6-1-12-0, రవీంద్ర జడేజా 10-1-33-0, ఉమేష్ యాదవ్ 5-1-13-0, అమిత్ మిశ్రా 6-0-19-0.

65 ఏళ్ల తర్వాత..
రాజ్‌కోట్: ఇంగ్లాండ్ లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్ వేసిన బంతిని రక్షణాత్మకంగా ఆడేందుకు ప్రయత్నించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, వికెట్‌కీపర్‌కు స్టంపింగ్ అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశంతో ఎడమకాలును క్రీజ్‌లోకి జాపాడు. అయితే, కాలు స్టంప్స్‌కు తగలడంతో బెయిల్ కిందపడింది. అతను హిట్ వికెట్‌గా అవుటయ్యాడు. టెస్టుల్లో భారత కెప్టెన్ హిట్ వికెట్‌గా వెనుదిరగడం 65 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 1949లో ట్రెవర్ గోడార్డ్ నాయకత్వంలో వచ్చిన వెస్టిండీస్ జట్టుతో చెన్నైలో జరిగిన టెస్టులో అప్పటి భారత కెప్టెన్ లాలా అమర్‌నాథ్ 13 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద జాన్ ట్రిమ్ బౌలింగ్‌లో ఇదే విధంగా హిట్ వికెట్ అయ్యాడు. ఇలావుంటే, భారత క్రికెటర్లు హిట్ వికెట్‌గా అవుట్‌కావడం ఇది 22వసారి. లాలా అమర్‌నాథ్ కుమారుడు మొహీందర్ అమర్‌నాథ్ ఏకంగా మూడు పర్యాయాలు హిట్‌వికెటయ్యాడు. కాగా, 2002లో వెస్టిండీస్‌తో జరిగిన సెయింట్ జాన్స్‌లో జరిగిన టెస్టులో వివిఎస్ లక్ష్మణ్ తర్వాత, భారత బ్యాట్స్‌మన్ హిట్ వికెట్‌గా వెనక్కు వెళ్లడం ఇదే తొలిసారి.