క్రీడాభూమి

పుజారా, కోహ్లీ శతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), నవంబర్ 17: ఇంగ్లాండ్‌తో గురువారం ఇక్కడ ఆరంభమైన రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం కొనసాగింది. చటేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీ శతకాలతో కదంతొక్కారు. వీరి ప్రతిభతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్లకు 317 పరుగులు సాధించి పటిష్టమైన స్థితికి చేరింది. కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, ఓపెనర్లు మురళీ విజయ్ (20), లోకేష్ రాహుల్ (0) తక్కువ పరుగులకే అవుట్ కావడంతో అతని నిర్ణయం పొరపాటేమోన్న అనుమానం వ్యక్తమైంది. అనుభవజ్ఞుడైన ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్, భుజం గాయం నుంచి కోలుకొని, తిరిగి జాతీయ జట్టులో చేరిన పేసర్ జిమీ ఆండర్సన్ చెరొక వికెట్ పడగొట్టి, భారత్‌పై ఇంగ్లాండ్ బౌలింగ్ ఆధిక్యాన్ని రుజువు చేసే ప్రయత్నం చేశారు. కానీ, ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన పుజారా, సెకండ్ డౌన్‌లో మైదానంలోకి అడుగుపెట్టిన కోహ్లీ చక్కటి సంయమనంతో ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. రెండో వికెట్‌కు 226 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించిన తర్వాత, ఆండర్సన్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జానీ బెయిర్‌స్టో క్యాచ్ పట్టడంతో పుజారా అవుటయ్యాడు. అతను 204 బంతులు ఎదుర్కొని, 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 119 పరుగులు సాధించాడు. ఆజింక్య రహానే 23 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద పుజారా మాదిరిగానే ఆండర్సన్ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి మొదటి రోజు ఆట ముగిసేందుకు మరో ఒకటిన్నర ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్నందున నైట్‌వాచ్‌మన్ రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్‌కు వచ్చాడు. 90 ఓవర్లలో భారత్ నాలుగు వికెట్లకు 317 పరుగులు చేసింది. కోహ్లీ 214 బంతుల్లో 151, అశ్విన్ 9 బంతుల్లో ఒకటి చొప్పున పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నారు. ఆండర్సన్ 44 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. బ్రాడ్‌కు ఒక వికెట్ లభించింది.

14 ఏళ్ల తర్వాత..
ఇంగ్లాండ్‌పై భారత్ మూడో వికెట్‌కు కనీసం సెంచరీ భాగస్వామ్యం ఈ టెస్టుకు ముందు చివరిసారి 2002లో నమోదైంది. హెడింగ్లేలో జరిగిన టెస్టులో రాహుల్ ద్రవిడ్, సచిన్ తెండూల్కర్ 150 పరుగులు జోడించారు. 14 ఏళ్ల తర్వాత పుజారా, కోహ్లీ పార్ట్‌నర్‌షిప్‌లో 226 పరుగులు లభించాయి.

కనీసం హాఫ్ సెంచరీ!
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశాఖ స్టేడియం అచ్చొచ్చిందనే చెప్పాలి. ఇక్కడ ఆడిన ప్రతిసారీ అతను కనీసం హాఫ్ సెంచరీ సాధించాడు. అన్ని ఫార్మెట్స్‌లో కలిపి అతను వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌లో 118, 117, 99, 65 చొప్పున పరుగులు చేశాడు. ఈ టెస్టులో 151 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మొత్తం మీద కెరీర్‌లో 50వ టెస్టు ఆడుతున్న కోహ్లీ 14వ సెంచరీని నమోదు చేశాడు. పుజారాతో కలిసి అతను మూడో వికెట్‌కు 226 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. క్రీజ్‌లో 5 గంటల, 52 నిమిషాలు నిలిచిన కోహ్లీ తన మారథాన్ ఇన్నింగ్స్‌లో 15 బౌండరీలు, రెండు సిక్సర్లు కొట్టాడు.

స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: మురళీ విజయ్ సి బెన్ స్టోక్స్ బి జిమీ ఆండర్సన్ 20, లోకేష్ రాహుల్ సి బెన్ స్టోక్స్ బి స్టువర్ట్ బ్రాడ్ 0, చటేశ్వర్ పుజారా సి జానీ బెయిర్‌స్టో బి జిమీ ఆండర్సన్ 119, విరాట్ కోహ్లీ 151 నాటౌట్, ఆజింక్య రహానే సి జానీ బెయిర్‌స్టో బి జిమీ ఆండర్సన్ 23, రవిచంద్రన్ అశ్విన్ 1 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 3, మొత్తం (90 ఓవర్లలో 4 వికెట్లకు) 317.
వికెట్ల పతనం: 1-6, 2-22, 3-248, 4-316.
బౌలింగ్: జేమ్స్ ఆండర్సన్ 16-3-44-3, స్టువర్ట్ బ్రాడ్ 12-2-39-1, బెన్ స్టోక్స్ 13-3-52-0, జాఫర్ అన్సారీ 12-1-45-0, అదిల్ రషీద్ 26-1-85-0, మోయిన్ అలీ 11-0-50-0.

చిత్రం.. చటేశ్వర్ పుజారా