క్రీడాభూమి

రెండోరోజు తడబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), నవంబర్ 18: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి రోజు చటేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీ శతకాలతో కదంతొక్కడంతో ఆధిపత్యాన్ని కనబరచి, ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లకు 317 పరుగులు సాధించి పటిష్టమైన స్థితిలో నిలిచిన టీమిండియా రెండో రోజు తడబాటుకు గురై, అదే స్థాయిలో రాణించలేకపోయింది. మరో 138 పరుగులు జోడించి, మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. 151 పరుగులతో బ్యాటింగ్‌ను కొనసాగించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో 16 పరుగులు జోడించి, ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. మొత్తం 267 బంతులు ఎదుర్కొన్న అతను 18 ఫోర్ల సాయంతో 167 పరుగులు చేసి, మోయిన్ అలీ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్ క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా (3)ను ఎల్‌బిగా అవుట్ చేసిన మోయిన్ అలీ అదే ఓవర్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (0)ను కూడా అదే తీరులో దెబ్బతీశాడు. క్రీజ్‌లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించి, అర్ధ శతకం పూర్తి చేసిన నైట్‌వాచ్‌మన్ రవిచంద్రన్ అశ్విన్ 95 బంతుల్లో 58 పరుగులు సాధించి, బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో జానీ బెయిర్‌స్టో క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న జయంత్ యాదవ్ ఇంగ్లాండ్ బౌలింగ్‌ను చాలా సేపు సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రయత్నించాడు. అతను 84 బంతుల్లో 35 పరుగులు చేసి, అదిల్ రషీద్ బౌలింగ్‌లో జిమీ ఆండర్సన్‌కు దొరికాడు. ఉమేష్ యాదవ్ 13 పరుగులు చేసి అదిల్ రషీద్ బౌలింగ్‌లోనే మోయిన్ అలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 129.4 ఓవర్లలో 455 పరుగుల వద్ద తెరపడింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జిమీ ఆండర్సన్, మోయిన్ అలీ చెరి మూడు వికెట్లు పడగొట్టారు. అదిల్ రషీద్‌కు రెండు వికెట్లు లభించాయి.
షమీ తొలి దెబ్బ
భారత ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లాండ్‌ను ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ తొలి దెబ్బ తీశాడు. 11 బంతుల్లో రెండు పరుగులు చేసిన కెప్టెన్ అలస్టర్ కుక్‌ను అతను అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. హసీబ్ హమీద్, జో రూట్ భాగస్వామ్యంలో ఇంగ్లాండ్ కోలుకుంటున్నట్టు కనిపించింది. అయితే, 50 బంతులు ఎదుర్కొని, 13 పరుగులు చేసిన హమీద్ రనౌట్ కావడంతో ఆ జట్టు కష్టాలు మొదలయ్యాయి. బెన్ డకెట్ (5) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక, అశ్విన్ బౌలింగ్‌లో ఎల్‌బి అయ్యాడు. జట్టును ఆదుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ, 98 బంతుల్లో 53 పరుగులు సాధించిన జో రూట్‌ను ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో అశ్విన్ అవుట్ చేశాడు. ఒక పరుగు చేసిన మోయిన్ అలీని జయంత్ యాదవ్ ఎల్‌బిగా పెవిలియన్ చేర్చాడు. 80 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ను బెన్ స్టోక్స్ (12 నాటౌట్), వికెట్‌కీపర్ జానీ బెయిర్‌స్టో (12 నాటౌట్) ఆదుకునే ప్రయత్నంలో పడ్డారు. వీరిద్దరూ మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడుతూ రెండో రోజు ఆట ముగిసే సమయానికి స్కోరును 103 పరుగులకు చేర్చారు.
స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 4 వికెట్లకు 317): మురళీ విజయ్ సి బెన్ స్టోక్స్ బి జిమీ ఆండర్సన్ 20, లోకేష్ రాహుల్ సి బెన్ స్టోక్స్ బి స్టువర్ట్ బ్రాడ్ 0, చటేశ్వర్ పుజారా సి జానీ బెయిర్‌స్టో బి జిమీ ఆండర్సన్ 119, విరాట్ కోహ్లీ బి బెన్ స్టోక్స్ బి మోయిన్ అలీ 167, ఆజింక్య రహానే సి జానీ బెయిర్‌స్టో బి జిమీ ఆండర్సన్ 23, రవిచంద్రన్ అశ్విన్ సి జానీ బెయిర్‌స్టో బి బెన్ స్టోక్స్ 58, వృద్ధిమాన్ సాహా ఎల్‌బి మోయిన్ అలీ 3, రవీంద్ర జడేజా ఎల్‌బి మోయిన్ అలీ 0, జయంత్ యాదవ్ సి జిమీ ఆండర్సన్ బి అదిల్ రషీద్ 35, ఉమేష్ యాదవ్ సి మోయిన్ అలీ బి అదిల్ రషీద్ 13, మహమ్మద్ షమీ 7 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 10, మొత్తం (129.4 ఓవర్లలో) 455 ఆలౌట్.
వికెట్ల పతనం: 1-6, 2-22, 3-248, 4-316, 5-351, 6-363, 7-363, 8-427, 9-440, 10-455.
బౌలింగ్: జేమ్స్ ఆండర్సన్ 20-3-62-3, స్టువర్ట్ బ్రాడ్ 16-2-49-1, బెన్ స్టోక్స్ 20-4-73-1, జాఫర్ అన్సారీ 12-1-45-0, అదిల్ రషీద్ 34.4-2-110-2, మోయిన్ అలీ 25-1-98-3, జో రూట్ 2-0-9-0.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: అలస్టర్ కుక్ బి మహమ్మద్ షమీ 2, హసీబ్ హమీద్ రనౌట్ 13, జో రూట్ సి ఉమేష్ యాదవ్ బి అశ్విన్ 53, బెన్ డకెట్ బి అశ్విన్ 5, మోయిన్ అలీ ఎల్‌బి జయంత్ యాదవ్ 1, బెన్ స్టోక్స్ 12 బ్యాటింగ్, జానీ బెయిర్‌స్టో 12 బ్యాటింగ్, ఎక్‌స్ట్రాలు 5, మొత్తం (49 ఓవర్లలో 5 వికెట్లకు) 103.
వికెట్ల పతనం: 1-4, 2-51, 3-72, 4-79, 5-80.
బౌలింగ్: మహమ్మద్ షమీ 8-1-15-1, ఉమేష్ యాదవ్ 6-1-14-0, రవీంద్ర జడేజా 15-3-38-0, అశ్విన్ 13-5-20-2, జయంత్ యాదవ్ 7-3-11-1.
ఎదురీత
రెండో టెస్టు మ్యాచ్, రెండో రోజు ఆటలో అటు భారత్, ఇటు ఇంగ్లాండ్ జట్లకు ఎదురీత తప్పలేదు. టీమిండియా తన ఓవర్‌నైట్ స్కోరుకు 138 పరుగులు మాత్రమే జోడించి ఆరు వికెట్లు కోల్పోతే, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి, ఆట ముగిసే సమయానికి 103 పరుగులకే ఐదు వికెట్లు చేజార్చుకుంది. మొత్తం మీద శుక్రవారం ఒక్క రోజే పదకొండు వికెట్లు కూలాయ.

చిత్రం.. మూడు వికెట్ల మోయిన్ అలీ