క్రీడాభూమి

నేను ఏ తప్పూ చేయలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడెలైడ్, నవంబర్ 23: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ఒక మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించడంతో తాను ఏకీభవించడం లేదని, నిజానికి తాను ఏ తప్పూ చేయలేదని దక్షిణాఫ్రికా జట్టుకు నాయకత్వం వహిస్తున్న ఫఫ్ డు ప్లెసిస్ స్పష్టం చేశాడు. బుధవారం అతను విలేఖరులతో మాట్లాడుతూ తాను బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడలేదని అన్నాడు. ఆస్ట్రేలియాతో రెండో టెస్టు జరుగుతున్నప్పుడు, మింట్‌ను నములుతూ అతను దానినే వేలితో తడి చేసుకొని బంతికి రుద్దాడు. ఈ విషయం టీవీ క్లిప్పింగ్స్‌లో స్పష్టంగా కనిపించింది. దీనితో డు ప్లెసిస్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్టు నిర్ధారించిన ఐసిసి అతనికి ఆ మ్యాచ్‌లో అందాల్సిన ఫీజును జరిమానాగా విధించింది. నిషేధం విధించలేదుగానీ, తీవ్రంగా మందలించింది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతమైతే కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇలావుంటే, తాను చేసిన పొరపాటు ఏమిటో ఇప్పటికీ అర్థం కావడం లేదని డు ప్లెసిస్ అన్నాడు. బాల్ ట్యాంపరింగ్‌పై ఐసిసి నిబంధనవాళిలోని అంశాల్లో మార్పులు చేయాల్సిన అవసరాన్ని ఈ సంఘటన తెరపైకి తెచ్చిందన్నాడు. మింట్ నమలడంగానీ ఉమ్మితో బంతికి మెరిపించే ప్రయత్నం చేయడంగానీ తప్పుకాదని వాదించాడు. బంతి షైనింగ్ కోసం తాను చేసిన ప్రయత్నం ట్యాంపరింగ్‌కు రాదని అన్నాడు. జరిమానాతో ఐసిసి విడిచిపెట్టడంతో, గురువారం నుంచి ఆస్ట్రేలియాతో జరిగే మూడవ, చివరి టెస్టుకు నాయకత్వం వహించే అవకాశం అతనికి ఉంటుంది. ఆసీస్‌పై టెస్టుల్లో క్లీన్‌స్వీప్‌కు దక్షిణాఫ్రికా ప్రయత్నిస్తుండగా, ఆ పరాభవం నుంచి తపించుకోవడానికి ఆసీస్ సర్వశక్తులు ఒడ్డనుంది.
ఆరు మార్పులు!
ఒకటికాదు.. రెండు కాదు... దక్షణాఫ్రికాతో జరిగే మూడో టెస్టు కోసం ఆస్ట్రేలియా ఏకంగా ఆరు మార్పులతో బరిలోకి దిగుతున్నది. కాగా, ఫాస్ట్ బౌలర్లు చాడ్ సయెర్స్, జాక్సన్ బర్డ్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అయితే, తుది జట్టులో బర్డ్ ఉంటాడని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ తెలిపాడు. అతను తాను ఆడిన చివరి టెస్టులో ఐదు వికెట్లు పడగొట్టాడని, అంతేగాక, షిఫీల్డ్ షీల్డ్ టోర్నీలో గులాబీ బంతితో అద్భుతంగా బౌల్ చేశాడని ప్రశంసించాడు. దక్షిణాఫ్రికాతో జరిగే మూడో టెస్టుకు జో బర్న్స్, కల్లమ్ ఫెర్గూసన్, పీటర్ నెవిల్, జో మెనీ పేర్లను ఆస్ట్రేలియా క్రికెట్ సెలక్టర్లు పరిశీలించలేదు. వారి స్థానంలో మాట్ రెన్‌షా, పీటర్ హాండ్స్‌కోమ్, నిక్ మాడిసన్, చాద్ సయెర్స్, జాక్సన్ బర్డ్ జట్టులోకి వచ్చారు. అదే విధంగా వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్‌ను మళ్లీ జట్టులోకి ఆహ్వానించారు. గాయాల సమస్యతో బాధపడుతున్న మిచెల్ మార్ష్, ఆడం వోగ్స్, స్టీవ్ ఒ కీఫ్ మూడో టెస్టుకు అందుబాటులో లేకపోవడం ఆసీస్ సమస్యలను పెంచుతున్నది. స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఇప్పటికే 0-2 తేడాతో కోల్పోయిన ఆస్ట్రేలియా చివరిదైన మూడో టెస్టును కనీసం డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే, స్వదేశంలో ఒక టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌ను ఎదుర్కొంటుంది. ఓటమి నుంచి బయటపడేందుకే, ఏకంగా ఆరు మార్పులతో తుది పోరాటానికి సిద్ధమవుతున్నది. 1982 తర్వాత ఆసీస్ ఒక టెస్టులో ఇన్ని మార్పులతో టెస్టు ఆడడం ఇదే మొదటిసారి.
గాయాలను క్లార్క్ రేపుతున్నాడు: వాట్సన్ ధ్వజం
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు మైఖేల్ క్లార్క్, షేన్ వాట్సన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మాజీ కెప్టెన్ క్లార్క్ తన ఆత్మకథలో పలువురు క్రికెటర్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. మాజీ ఆల్‌రౌండర్ వాట్సన్‌ను ‘కణితి’తో పోల్చాడు. దానిని అదే విధంగా వదిలేస్తే కేన్సర్‌గా మారేదని అన్నాడు. 2013లో వాట్సన్‌సహా మొత్తం నలుగురిని అప్పటి ఆస్ట్రేలియా కోచ్ మికీ ఆర్థర్ సస్పెండ్ చేశాడు. వాట్సన్‌ను ఏకంగా స్వదేశానికి పంపేశాడు. జట్టు నైపుణ్యాన్ని ఏ విధంగా పెంచాలి? టీమిండియాకు గట్టిపోటీని ఇవ్వాలంటే ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి? అన్న ప్రశ్నలకు సమాధానాలతో రావాల్సిందిగా అప్పటి వైస్ కెప్టెన్ వాట్సన్‌సహా జట్టులోని సభ్యులందరినీ కోచ్ ఆదేశించాడు. అయితే, అతని ఆదేశాలను పట్టించుకోని వాట్సన్ అసలు రివ్యూ సమావేశానికే హాజరుకాలేదు. మరో ముగ్గురు క్రికెటర్లు కూడా తమతమ సమాధానాలతో వెళ్లలేదు. ఈ పరిణామాన్ని తీవ్రంగా పరిగణించిన ఆర్థర్ కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు. నలుగురు ఆటగాళ్లపై సస్పెన్షన్ వేటు వేశాడు. వాట్సన్‌ను ఆస్ట్రేలియాకు పంపాడు. అప్పటి సంఘటనను క్లార్క్ తన ఆత్మకథలో ప్రస్తావించగా, మూడేళ్ల తర్వాత పాత గాయాలను రేపడం దురదృష్టకరమని క్లార్క్‌పై వాట్సన్ మండిపడ్డాడు. కెరీర్‌లో ఎదురైన వైఫల్యాలను, నిరాశానిస్పృహలను క్లార్క్ ఈ విధంగా బయటపెట్టుకున్నాడని విమర్శించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన తమపై వ్యాఖ్యలు చేయడం సరికాదని ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాట్సన్ అన్నాడు. క్లార్క్‌కు నైతికత లేదని ధ్వజమెత్తాడు.