క్రీడాభూమి

హాంకాంగ్ ఓపెన్ బాడ్మింటన్ సైనా అవుట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలూన్, నవంబర్ 25: భారత బాడ్మింటన్ స్టార్లు, హైదరాబాదీలు పివి సింధు, సైనా నెహ్వాల్ మధ్య పోరు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. హాంకాంగ్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పివి సింధు టైటిల్ వేటను కొనసాగిస్తుండగా, సైనా పరాజయాన్ని ఎదుర్కొని నిష్క్రమించింది. అంతేగాక, కెరీర్‌లో మొట్టమొదటిసారి ప్రపంచ ర్యాంకింగ్స్‌లో సింధు కంటే వెనుకబడింది. క్వార్టర్ ఫైనల్స్‌లో సింధు 21-17, 21-23, 21-18 ఆధిక్యంతో సింగపూర్ క్రీడాకారిణి లియాంగ్ జియాయూను ఓడించి సెమీస్ చేరింది. మొదటి సెట్‌ను అతి కష్టం మీద గెల్చుకున్న సింధుకు రెండో సెట్‌లో ప్రత్యర్థి నుంచి మరింత తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురైంది. చివరి వరకూ పోరాడినప్పటికీ ఆ సెట్‌ను సింధు దక్కించుకోలేకపోయింది. దీనితో చివరిదైన మూడోసెట్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవలే చైనా ఓపెన్‌ను కైవసం చేసుకున్న సింధు హాంకాంగ్‌లోనూ విజయభేరి మోగించాలన్న పట్టుదలతో చివరి సెట్‌లో సర్వశక్తులు ఒడ్డింది. అనుకున్నది సాధించింది. సెమీస్ చేరింది.
అభిమానుల నిరాశ
సింధు సెమీస్ చేరడంతో, సైనా కూడా క్వార్టర్స్ అడ్డంకిని అధిగమిస్తుందని, సెమీస్‌లో వీరిద్దరూ తలపడతారని ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులు నిరాశ చెందారు. టైటిల్ ఫేవరిట్‌గా బరిలోకి దిగిన స్థానిక క్రీడాకారిణి చెయుంగ్ నాన్‌ఈతో తలపడిన సైనా 8-21, 21-18, 19-21 తేడాతో పరాజయాన్ని చవిచూసి, నిష్క్రమించింది. మొదటి సెట్‌లో ఏమాత్రం పోరాట పటిమను చూపలేకపోయిన సైనా రెండో సెట్‌లో ఎదురుదాడికి దిగింది. మొదటి సెట్‌ను ఎంత పేలవంగా కోల్పోయిందో, రెండో సెట్‌లో అంత గొప్పగా పోరాడి గెలిచింది. చివరిదైన మూడో సెట్‌లోనూ ఆమె గెలుపు కోసం ప్రయత్నించింది. కానీ, నాన్‌ఈ అంత కంటే మెరుగైన ఆటతో సైనాను ఓడించింది.
ర్యాంకింగ్స్‌లో మార్పులు
సింధు, సైనా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఈ వారం మార్పులు చోటు చేసుకున్నాయి. సింధు మళ్లీ ‘టాప్-10’లోకి అడుగుపెట్టగా, ఒకప్పుడు ప్రపంచ నంబర్ వన్‌గా వెలిగిపోయిన సైనా ఈ జాబితాలో స్థానం కోల్పోయింది. కరోలినా మారిన్ నంబర్ వన్‌గా ఉన్న ఈ జాబితాలో సింధు 64,749 పాయింట్లతో తొమ్మిదో స్థానాన్ని ఆక్రమించింది. సైనా 63,719 పాయింట్లతో తాజా ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో నిలిచింది. ఇద్దరు భారత స్టార్లలో ఒకరు ‘టాప్-10’లో చేరగా, మరొకరు ఆ జాబితాలో చోటు కోల్పోవడం గమనార్హం.

‘టాప్-10’
1. కరోలినా మారిన్ (80,530 పాయింట్లు),
2. రచానొక్ ఇంతనాన్ (75,524 పాయింట్లు), 3. తాయ్ జూ ఇంగ్ (74,491 పాయింట్లు),
4. నొజోమీ ఒకుహరా (73,927 పాయింట్లు), 5. సంగ్ జీ హ్యున్ (69,076 పాయింట్లు),
6. సంగ్ యూ (68,992 పాయింట్లు),
7. లీ జురుయ్ (67,654 పాయింట్లు),
8. ఆకానే యమాగూచీ (66,999 పాయింట్లు), 9. పివి సింధు (64,749 పాయింట్లు),
10. హీబింగ్ జియావో (64,331 పాయింట్లు)
* సైనా నెహ్వాల్:
63,719 పాయింట్లతో 11వ స్థానం.

పారిస్‌కు స్క్వాష్ జట్లు
చెన్నై, నవంబర్ 25: ఈనెల 27న మొదలై, డిసెంబర్ మూడు వరకు జరిగే ప్రపంచ మహిళల టీం చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు భారత స్క్వాష్ జట్లు శనివారం పారిస్‌కు బయలుదేరి వెళతాయి. జాతీయ కోచ్ సైరస్ పోన్చా, ఈజిప్టుకు చెందిన కోచ్ అచ్రాఫ్ ఎల్ కరార్గుయ్ పర్యవేక్షణలో భారత స్క్వాష్ క్రీడాకారిణులు ముమ్మరంగా ప్రాక్టీస్ చేశారు. జోత్న్స చిన్నప్ప, దీపికా పల్లీకల్ ఒక జట్టుగా, ఆకాంక్ష సాలుంకే, సునన్య కురువిల్లా మరో జట్టుగా ప్రపంచ టీం చాంపియన్‌షిప్‌లో పోటీపడతారు.
కివీస్, పాక్ టెస్టుకు
వర్షం బెడద
హామిల్టన్, నవంబర్ 25: న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య శుక్రవారం మొదలైన రెండో టెస్టుకు వర్షం బెడద మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 21 ఓవర్లలో రెండు వికెట్లకు 77 పరుగులు చేసింది. ఈ దశలో భారీ వర్షం కురవడంతో ఆటను నిలిపివేశారు. అప్పటికి ఓపెనర్ జీత్ రావల్ 35, రాస్ టేలర్ 29 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.

తప్పు చేస్తే ఐసిసి ప్రశ్నించేది: కోహ్లీ
మొహాలీ: ఒకవేళ తాను ట్యాంపరింగ్‌కు పాల్పడి ఉంటే, ఐసిసి ఖచ్చితంగా ప్రశ్నించి ఉండేదని కోహ్లీ అన్నాడు. రాజ్‌కోట్‌లో ఈ సంఘటన జరిగిందని చెప్తున్న బ్రిటిష్ మీడియా, విశాఖపట్నంలో రెండో టెస్టు ఫలితం తమకు అనుకూలంగా వచ్చిన తర్వాతే స్పందించడం అనుమానాలకు తావిస్తున్నదని విలేఖరులతో మాట్లాడుతూ చెప్పాడు.
పార్థీవ్‌కు తుది జట్టులో చోటు!
మూడో టెస్టు ఆడే తుది జట్టులో వికెట్‌కీపర్ పార్థీవ్ పటేల్‌కు చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కోహ్లీ అన్నాడు. వృద్ధిమాన్ సాహా గాయపడతాడని సిరీస్ ఆరంభానికి ముందు తాము ఊహించలేదని అన్నాడు. అందుకే, జట్టు ఎంపిక జరిగినప్పుడు పార్థీవ్ పేరు ప్రతిపాదనకు రాలేదని వివరించాడు. అతను ఎంతో అనుభవజ్ఞుడని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒత్తిడికి గురికాడని కితాబునిచ్చాడు.

బ్యాటింగ్‌కు అనుకూలం!
మొహాలీ: పంజాబ్ క్రికెట్ సంఘం (పిసిఎ) స్టేడియం ఒకప్పుడు బౌలర్లకు స్వర్గ్థామంగా ఉండేది. పిచ్‌పై బంతి విపరీతంగా స్పిన్ కావడం, వేగంగా దిశను మార్చుకోవడం బౌలర్లకు వరంగా ఉంటే, ఒక్కో పరుగు కోసం బ్యాట్స్‌మెన్ నానా తంటాలు పడేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తల్లకిందులైంది. బ్యాట్స్‌మెన్‌కు అనుకూలిస్తున్న ఈ వికెట్‌పై పరుగుల వరదకు అడ్డుకట్ట వేయడానికి, వికెట్లు పడగొట్టడానికి బౌలర్లు నానా తంటాలు పడుతున్నారు. బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉన్న టీమిండియాకు పిచ్ తీరు ఉపయోగపడడం ఖాయంగా కనిపిస్తున్నది. కాగా, మహేంద్ర సింగ్ ధోనీ టెస్టు జట్టులో ఉన్నప్పుడు అనేక పర్యాయాలు వృద్ధిమాన్ సాహా స్పెషలిస్టు బ్యాట్స్‌మన్ హోదాలో తుది జట్టులో స్థానం సంపాదించాడు. అతను ఇప్పుడు రెగ్యులర్ వికెట్‌కీపర్‌గా సేవలు అందిస్తున్నాడు. కానీ, విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టు ఆడుతున్నప్పుడు కాలి కండరాలు బెణకడంతో అతను మూడో టెస్టుకు దూరమయ్యాడు. అతను అందుబాటులో లేనందువల్ల బ్యాటింగ్ కాంబినేషన్‌ను ఖరారు చేయడంలో కోహ్లీకి కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇక ఈ వికెట్‌పై మొత్తం ఐదు రోజులు మ్యాచ్ జరుగుతుందా లేక మూడునాలుగు రోజులకే ముగుస్తుందా అన్నది ఆసక్తి రేపుతున్నది.