క్రీడాభూమి

భారత్‌కు ఆధిక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 4 వికెట్లకు 78

రవీంద్ర జడేజా తన టెస్టు కెరీర్‌లోనే అత్యధిక పరుగులు చేశాడు. 2014లో ఇంగ్లాండ్‌పైనే అతను లార్డ్స్ మైదానంలో 68 పరుగులు చేయగా, ఈ ఇన్నింగ్స్‌లో 90 పరుగులు సాధించాడు. జడేజాకు టెస్టుల్లో ఇది మూడో అర్ధ శతకం.
ఏడు లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ముగ్గురు బ్యాట్స్‌మెన్ 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన సంఘటన భారత టెస్టు చరిత్రలో ఎన్నడూ చోటు చేసుకోలేదు. ఈ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జయంత్ యాదవ్ అర్ధ శతకాలను నమోదు చేసి, సరికొత్త రికార్డు సృష్టించారు. ఏడు నుంచి కింది స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్యాట్స్‌మెన్ 230 పరుగులు జోడించారు. ఈ విధంగా రెండు వందలకుపైగా పరుగులు నమోదుకావడం ఇది మూడోసారి. ఇంతకు ముందు, 2007లో ఇంగ్లాండ్‌పై 259, 2013-14 సీజన్‌లో వెల్లింగ్టన్ టెస్టులో న్యూజిలాండ్‌పై 234 చొప్పున స్కోర్లను ఏడు లేదా అంతకంటే కింది స్థాయి ఆటగాళ్లు సాధించారు.

మొహాలీ, నవంబర్ 28: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ ఆటలో టీమిండియా తన ప్రత్యర్థిపై పట్టు బిగించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 417 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు సాధించిన విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత్ ఆతర్వాత సోమవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లకు 78 పరుగుల వద్ద కట్టడి చేసింది. అశ్విన్ ఆల్‌రౌండ్ ప్రతిభ భారత్‌కు కలిసొచ్చింది. రవీంద్ర జడేజా సూపర్ ఇన్నింగ్స్ కూడా టీమిండియా 134 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించడానికి ఉపయోగపడింది. ఇంగ్లాండ్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా తర్వాత మొదటి ఇన్నింగ్స్ ఆరంభించి రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 271 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం ఉదయం ఆటను కొనసాగించి, 381 పరుగుల స్కోరువద్ద అశ్విన్ వికెట్‌ను కోల్పోయింది. అతను మొత్తం 113 బంతులు ఎదుర్కొని, 11 ఫోర్ల సాయంతో 72 పరుగులు చేసి, బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో జొస్ బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సూపర్ ఇన్నింగ్స్ ఆడిన రవీంద్ర జడేజా సెంచరీని సాధించే ఊపుమీద కనిపించాడు. అయితే, 170 బంతుల్లో, 10 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 90 పరుగులు చేసిన అతనిని క్రిస్ వోక్స్ క్యాచ్ అందుకోగా అదిల్ రషీద్ పెవిలియన్‌కు పంపాడు. జడేజాకు చక్కటి సహకారాన్ని అందించి ఎనిమిదో వికెట్‌కు 80 పరుగుల అత్యంత విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేసిన యువ ఆటగాడు జయంత్ యాదవ్ 141 బంతుల్లో 55 పరుగులు చేసి, బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో మోయిన్ అలీకి చిక్కాడు. ఉమేష్ యాదవ్ 42 బంతుల్లో 12 పరుగులు చేసి, బెన్ స్టోక్స్ బౌలింగ్‌లోనే జానీ బెయిర్‌స్టోకు దొరికిపోవడంతో భారత్ ఇన్నింగ్స్‌కు 138.2 ఓవర్లలో 417 పరుగుల వద్ద తెరపడింది. అప్పటికి మహమ్మద్ షమీ ఒక పరుగుతో నాటౌట్‌గా ఉన్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ ‘ఫైవ్‌ఫర్’ సాధించాడు. 73 పరుగులకు అతను ఐదు వికెట్లు పడగొట్టి, భారత్‌కు మరింత భారీ ఆధిక్యం దక్కకుండా అడ్డుకున్నాడు. అదిల్ రషీద్ 118 పరుగులిచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు.
అశ్విన్ దెబ్బ!
బ్యాటింగ్‌లో రాణించి 72 పరుగులు చేసిన అశ్విన్ తన ఆల్‌రౌండ్ ప్రతిభను నిరూపించుకుంటూ ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. భారత్ కంటే 134 పరుగులు వెనుకబడిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి, 27 పరుగుల వద్ద మొదటి వికెట్‌ను కెప్టెన్ అలస్టర్ కుక్ రూపంలో చేజార్చుకుంది. అతను 49 బంతులు ఎదుర్కొని, 12 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. మరో 12 పరుగుల తర్వాత మోయిన్ అలీ కూడా పెవిలియన్ చేరాడు. కేవలం ఐదు పరుగులు చేసిన అతనిని జయంత్ యాదవ్ క్యాచ్ పట్టగా అశ్విన్ వెనక్కు పంపాడు. తొలి ఇన్నింగ్స్‌లో అద్వితీయ ప్రతిభ కనబరచి, ఇంగ్లాండ్‌ను ఆదుకున్న వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టో రెండో ఇన్నింగ్స్‌లో ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయాడు. అతను 34 బంతులు ఎదుర్కొని, 15 పరుగులు చేసి జయంత్ యాదవ్ బౌలింగ్‌లో పార్థీవ్ పటేల్‌కు క్యాచ్ అందించి వెనుదిరిగాడు. బెన్ స్టోక్స్ ఐదు పరుగులకే అశ్విన్ బౌలింగ్‌లో ఎల్‌బి అయ్యాడు. మూడోరోజు ఆటలో అది చివరి ఓవర్ మొదటి బంతి. మిగతా ఐదు బంతులను గారెత్ బాటీ రక్షణాత్మకంగా ఆడాడు. అతను పరుగుల ఖాతాను తెరవలేదు. కాగా, వికెట్లు పడుతున్నప్పటికీ, ఇంగ్లాండ్‌కు రక్షణ కోటగా నిలిచిచిన జోరూట్ (101 బంతుల్లో 36 పరుగులు) నాటౌట్‌గా ఉన్నాడు. ఇంగ్లాండ్ ఇప్పటికీ భారత్ కంటే ఇంకా 56 పరుగులు వెనుకంజలో ఉంది. ఐదు వికెట్లు చేతిలో ఉన్నాయి. రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో, ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం, భారత్ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తున్నాయి.

బెన్ స్టోక్స్ టెస్టుల్లో ‘ఫైవ్ ఫర్’ (ఒక ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు) సాధించడం ఇది మూడోసారి. కాగా, గత మూడు దశాబ్దాల కాలంలో, భారత్‌లో జరిగిన టెస్టుల్లో ఫైవ్ వికెట్స్ హౌల్‌ను నమోదు చేసిన రెండో ఇంగ్లాండ్ బౌలర్‌గా అతను చరిత్ర సృష్టించాడు. 2005-06 సీజన్‌లో భాగంగా నాగపూర్‌లో జరిగిన టెస్టులో మాథ్యూ హోగార్డ్ 57 పరుగులిచ్చి ఆరు వికెట్లు కూల్చాడు.

రెండు వందలు లేదా అంతకంటే ఎక్కువ స్కోరువద్ద ఆరు వికెట్లు కోల్పోయిన తర్వాత భారత్ ఒక టెస్టులో రెట్టింపు స్కోరు నమోదు చేయడం ఇది మూడోసారి. మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 204 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను చేజార్చుకుంది. ఆతర్వాత అంతకు రెట్టింపు స్కోరు సాధించి, 417 పరుగులకు ఆలౌటైంది. చివరిసారి, 1998-99 సీజన్‌లో న్యూజిలాండ్‌పై హామిల్టన్ టెస్టులో కూడా 204 పరుగులకు ఆరు వికెట్లు చేజార్చుకున్న భారత్ ఆతర్వాత 416 పరుగులు చేయగలిగింది. మొత్తం మీద మూడు పర్యాయాలు ఈ ఫీట్‌ను భారత్ అందుకోగా, అందులో రెండుసార్లు ఇంగ్లాండ్ ప్రత్యర్థికావడం గమనార్హం. ఇంతకు ముందు, 1984-85 సీజన్‌లో వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 218 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను చేజార్చుకుంది. ఆతర్వాత ఇన్నింగ్స్ 465 పరుగుల వద్ద ముగిసింది.

స్కోరుబోర్డు

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 93.5 ఓవర్లలో 283 ఆలౌట్ (జానీ బెయిర్‌స్టో 89, బెన్ స్టోక్స్, జొస్ బట్లర్ 43, మహమ్మద్ షమీ 3/63, ఉమేష్ యాదవ్ 2/58, జయంత్ యాదవ్ 2/49, రవీంద్ర జడేజా 2/59).
భారత్ మొదటి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 6 వికెట్లకు 271): మురళీ విజయ్ సి జానీ బెయిర్‌స్టో బి బెన్ స్టోక్స్ 12, పార్థీవ్ పటేల్ ఎల్‌బి అదిల్ రషీద్ 42, చటేశ్వర్ పుజారా సి క్రిస్ వోక్స్ బి అదిల్ రషీద్ 51, విరాట్ కోహ్లీ సి జానీ బెయిర్‌స్టో బి బెన్ స్టోక్స్ 62, ఆజింక్య రహానే ఎల్‌బి అదిల్ రషీద్ 0, కరుణ్ నాయర్ రనౌట్ 4, రవిచంద్ర అశ్విన్ సి జొస్ బట్లర్ బి బెన్ స్టోక్స్ 72, రవీంద్ర జడేజా సి క్రిస్ వోక్స్ బి అదిల్ రషీద్ 90, జయంత్ యాదవ్ సి మోయిన్ అలీ బి బెన్ స్టోక్స్ 55, ఉమేష్ యాదవ్ సి జానీ బెయిర్‌స్టో బి బెన్ స్టోక్స్ 12, మహమ్మద్ షమీ 1 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 16, మొత్తం (138.2 ఓవర్లలో ఆలౌట్) 417.
వికెట్ల పతనం: 1-39, 2-73, 3-148, 4-152, 5-156, 6-204, 7-301, 8-381, 9-414, 10-417.
బౌలింగ్: జేమ్స్ ఆండర్సన్ 21-4-48-0, క్రిస్ వోక్స్ 24-7-86-0, మోయిన్ అలీ 13-1-33-0, అదిల్ రషీద్ 38-6-118-4, బెన్ స్టోక్స్ 26.2-5-73-5, గారెత్ బాటీ 16-0-47-0.
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: అలస్టర్ కుక్ బి అశ్విన్ 12, జో రూట్ 36 నాటౌట్, మోయన్ అలీ సి జయంత్ యాదవ్ బి అశ్విన్ 5, జానీ బెయర్‌స్టో సి పార్థీవ్ పటేల్ బి జయంత్ యాదవ్ 15, బెన్ స్టోక్స్ ఎల్‌బి అశ్విన్ 5, గారెత్ బాటీ 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 5, మొత్తం (38 ఓవర్లలో 4 వికెట్లకు) 78.
వికెట్ల పతనం: 1-27, 2-39, 3-70, 4-78.
బౌలింగ్: మహమ్మద్ షమీ 7-2-0-17, ఉమేష్ యాదవ్ 1-0-7-0, రవిచంద్రన్ అశ్విన్ 12-3-19-3, రవీంద్ర జడేజా 12-4-18-0, జయంత్ యాదవ్ 5-2-12-1.

బౌలర్‌గానేగాక, బ్యాట్స్‌మన్‌గానూ తనను తాను
నిరూపించుకుంటూ 72 పరుగులు సాధించిన అశ్విన్

* మొదటి ఇన్నింగ్స్‌లో 89 పరుగులు చేయడం ద్వారా ఇంగ్లాండ్‌ను ఆదుకున్న జానీ బెయిర్‌స్టో వికెట్‌కీపర్‌గా ఈ ఏడాది ఇప్పటి వరకూ 68 మందిని అవుట్ చేశాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో వికెట్‌కీపర్ ఖాతాలో అత్యధిక డిస్మిసల్స్ జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. 1993లో ఇయాన్ హీలీ (ఆస్ట్రేలియా), 1998లో మార్క్ బౌచర్ (దక్షిణాఫ్రికా) చెరి 67 మందిని అవుట్ చేసి నెలకొల్పిన రికార్డును తాజా మ్యాచ్, మూడో రోజు ఆటలో ఉమేష్ యాదవ్‌ను క్యాచ్ పట్టి అవుట్ చేయడం ద్వారా అధిగమించాడు.