క్రీడాభూమి

ఎస్‌జిఎంపై ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 30: చాలకాలంగా వాయిదా పడుతూ వస్తున్న లోధా కమిటీ సిఫార్సుల అమలుపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) శుక్రవారం జరిగే ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం)లో తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. సుమారు రెండేళ్లుగా నానుతున్న ఈ వివాదానికి ఇకనైనా తెరపడుతుందా లేక మరికొంత కాలం తాత్సారం చేయడానికే బోర్డు ప్రయత్నిస్తుందా అన్నది చూడాలి. లోధా కమిటీ సిఫార్సుల అమలుపై ఒక నిర్ణయం తీసుకోవడానికి గత నెల జరగాల్సిన ఎస్‌జిఎం ఒక రోజు వాయిదా పడి, ఆతర్వాత ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండానే ముగిసిన విషయం తెలిసిందే. రోజులు గడుస్తున్న కొద్దీ, లోధా ప్రతిపాదనలను అమలుచేసి తీరాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేయడంతో ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించాల్సిన అవసరం బిసిసిఐకి ఏర్పడింది. తొలి విడత సిఫార్సుల అమలుకు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించడానికి కోర్టు ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ, కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేస్తూ, గతంలో చేసిన వాదననే మరోసారి తెరపైకి తెస్తూ, చెప్పిన అభ్యంతరాలనే మళ్లీమళ్లీ వ్యక్తం చేస్తూ రోజులు దొర్లించే ప్రయత్నం చేస్తున్నది బిసిసిఐ. కానీ, ఇంకా ఎంతోకాలం ఇది సాధ్యపడదన్న వాస్తవం ఇప్పటికే బోర్డు అధికారులకు స్పష్టమైంది. శుక్రవారం జరిగే సమావేశంలో లోధా కమిటీ చేసిన ప్రతిపాదనల అమలుపై ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదన్న అభిప్రాయానికి వచ్చిన బోర్డు అధికారులు ఏం చేస్తారన్నది మాత్రం ఇంకా గోప్యంగా ఉంచుతున్నారు. వాస్తవానికి ఎస్‌జిఎం విషయంలోనూ బోర్డు ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వలేదు. దీనిని బట్టి లోధా సిఫార్సులపై వారు ఎంతటి ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారో తెలుస్తున్నది.
కీలక అంశాలు
ఎన్నో కీలక అంశాలపై ఎస్‌జిఎం చర్చించి, నిర్ణయాలు తీసుకోవాలి. మొదడి విడత సిఫార్సుల అమలుకు అనుగుణంగా సంస్థ నిబంధనావళిని కూడా మారుస్తూ తీర్మానాన్ని ఆమోదించడం అందులోని కీలక అజెండా. ఇప్పటికే పలు సందర్భాల్లో లోధా కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకొని బిసిసిఐ సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురైంది. అయితే, న్యాయ సలహాదారు మార్కండేయ ఖడ్జూపై నమ్మకం ఉంచి, సుప్రీం కోర్టులో తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేసిన బోర్డు అధికారులకు క్రమంగా వాస్తవ పరిస్థితులు తెలుస్తున్నాయి. ఏదో ఒక రకంగా బయటపడకపోతామా అన్న ధీమాతో సిఫార్సుల అమలును వాయిదా వేసిన అధికారులకు భవిష్యత్తులో సుప్రీం కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు అందుతాయోనన్న భయం పట్టుకుంది. అందుకే, ఎస్‌జిఎంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం.
ఎటూ తేల్చుకోలేక..
లోధా కమిటీ ప్రతిపాదనల అములపై బిసిసిఐ అధికారులు ఎటూ తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతున్నారు. సిఫార్సులు అమలు చేస్తే, భారత క్రికెట్‌పై దశాబ్దాలుగా కొనసాగిస్తున్నా ఆధిపత్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అంతేగాక, అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కే అందరి కంటే ముందుగా తమ పదవులను కోల్పోవాల్సి వస్తుంది. దీనికి భయపడి అమలు చేయకపోతే, సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురికాక తప్పదు. కోర్టు ఎన్ని పర్యాయాలు ఆదేశించినా పట్టించుకోకుండా, ఏదో ఒక వంకతో నిర్ణయాలను వాయిదా వేసినందుకే బోర్డు అధికారులు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నారు. ఈ పరిస్థితికి వారి స్వయంకృతమే కారణం. అంతకు ముందు జరిగిన ఎజిఎంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. లోధా సిఫార్సులకు విరుద్ధంగా ప్రధాన కార్యదర్శిగా అజయ్ షిర్కేను కార్యదర్శిగా ఎన్నుకున్నారు. అంతటితో ఆగకుండా ఐదుగురు సభ్యులతో జాతీయ సెలక్షన్ కమిటీని నియమించారు. సెలక్షన్ కమిటీలో బోర్డు తరఫున ముగ్గురే ఉండాలని లోధా కమిటీ తేల్చిచెప్పినా పట్టించుకోలేదు. సిఫార్సులను అమలు చేయలేదు. కనీసం ఆ దిశగా అడుగులు కూడా వేయలేదు. ఒకవైపు కమిటీ మరోవైపు సుప్రీం కోర్టు విధించిన డెడ్‌లైన్లను పట్టించుకోలేదు. విశ్రాంత న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా చైర్మన్‌గా, రవీంద్రన్, అశోక్ భాన్ సభ్యులుగా ఉన్న కమిటీపై సుప్రీం కోర్టు పూర్తి నమ్మకం ఉంచి, పలు కీలక అంశాలపై నిర్ణయాలను దానికే విడిచిపెట్టింది. కానీ, బోర్డు అధికారులు మాత్రం ఎన్నడూ లోధా కమిటీ అధికారాలను గుర్తించలేదు. ఆదేశాలను పాటించలేదు. సూచనలను ఖాతరు చేయలేదు. ఇకపైన కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తుందా లేక రాజీ ధోరణితో వెళుతుందా అన్నది చూడాలి.