క్రీడాభూమి

శోక సంద్రంలో బ్రెజిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, నవంబర్ 30: కొలంబియాలో విమానం కూలిన సంఘటనలో ఫుట్‌బాల్ క్రీడాకారులుసహా మొత్తం 71 మంది మృతి చెందిన సంఘట బ్రెజిల్‌ను శోక సంద్రంలో ముంచేసింది. ఈ సంఘటన పట్ల ప్రస్తుత, మాజీ క్రీడాకారులు, అధికారులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని దేశం నలుమూలలా పెద్ద సంఖ్యలో ప్రజలు, ఫుట్‌బాల్ అభిమానులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజాలు పీలే, లియోనెల్ మెస్సీ తదితరులు వేరువేరు ప్రకటనల్లో మృతులకు ఘన నివాళులర్పించారు. క్రిస్టియానో రొనాల్డో, డిగో మారడోనా తదితరులు కూడా మృతుల కుటుంబాలకు సంఘీభావం ప్రకటించారు. కొలంబియాలోని బగోటాకు సమీపంలో ఉన్న పర్వత ప్రాంతంలో, బ్రెజిలియన్ సాకర్ క్లబ్ చపెకొయన్స్ రియల్ జట్టుకు చెందిన క్రీడాకారులు ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం ఒకటి కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 75 మంది మృతి చెందారని, ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తొలుత ప్రకటించారు. అయితే, ప్రయాణికుల జాబితాలో ఉన్న నలుగురు విమానం ఎక్కలేదని ఆతర్వాత సవరణ చేశారు. మొత్తం మృతుల సంఖ్యను 71గా ధ్రువీకరించారు. ‘ఎలక్ట్రికల్ వైఫల్యం’ కార ణంగా లామియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ చార్టర్డ్ విమానం మెడిలియన్ సిటీ సమీపంలో కూలిపోగా, చపెకొయన్స్ రియల్ జట్టుకు చెందిన 19 మంది క్రీడాకారులు, 17 మంది సిబ్బంది, ఏడుగురు డైరక్టర్లు సహా మొత్తం 43 మంది మృతి చెందారు. ప్రాణాలతో బయటపడిన ఆరుగురిలో ముగ్గురు ఫుట్‌బాల్ ఆటగాళ్లు ఉన్నారు. కొలంబియాకు చెందిన అట్లెటికో నేషనల్ జట్టుతో కోపా సుదామెరికానా ఫైనల్ ఆడేందుకు వెళ్తున్న చపెకొయన్స్ ఫుట్‌బాల్ క్లబ్ క్రీడాకారులు దుర్మరణం పాలయ్యారు. సాకర్‌కు పెద్దపీట వేసే బ్రెజిల్ వీరాభిమానులు ఈ సంఘటనను జీర్ణించుకోలేకపోతున్నారు. బ్రెజిల్ ప్రధాన నగరాలు, పట్టణాల్లోనే కాకుండా మారుమూల ప్రాంతాల్లోనూ శాంతి ప్రార్థనలు జరిగాయి. పలు నగరాల్లో వేలాది మంది అభిమానులు, ప్రజలు వీధుల్లో ర్యాలీలు నిర్వహించి, మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. రోడ్ల కూడళ్లు, చర్చిల్లో కొవ్వొత్తులు వెలిగించారు. బ్రెజిల్ సాకర్ కానె్ఫడరేషన్, దాని అనుబంధ సంఘాలు, వివిధ క్లబ్‌లు ప్రత్యేక సమావేశాలను నిర్వహించి, మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించాయి. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చాయి.

చిత్రం... కొవ్వొత్తులు వెలిగించి మృతులకు
శ్రద్ధాంజలి ఘటిస్తున్న సాకర్ అభిమానులు

హాకీ టెస్టు సిరీస్
రఘునాథ్ శ్రమ వృథా
ఆసీస్ చేతిలో భారత్ ఓటమి
మెల్బోర్న్, నవంబర్ 30: ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ, చివరి హాకీ టెస్టులో భారత్ 3-4 తేడాతో ఓటమిపాలైంది. మొదటి మ్యాచ్‌లో విజయభేరి మోగించిన భారత్‌ను రెండో మ్యాచ్‌లోనూ గెలిపించి, సిరీస్‌ను సాధించిపెట్టేందుకు విఆర్ రఘునాథ్ విశేషంగా కృషి చేశాడు. అతను రెండు గోల్స్‌తో రాణించినప్పటికీ, ప్రపంచ మేటి జట్టు ఆస్ట్రేలియా ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా, వ్యూహాత్మకంగా ఆడి విజయం సాధించింది. మ్యాచ్ ఆరో నిమిషంలోనే భారత ఆటగాడు ఆకాశ్‌దీప్ సింగ్ తొలి గోల్‌ను చేశాడు. మరో ఏడు నిమిషాల తర్వాత ఆస్ట్రేలియాలకు టెంట్ మిట్టన్ ద్వారా ఈక్వెలైజర్ లభించింది. అనంతరం పోరు ముమ్మరంకాగా, 22వ నిమింలో రఘునాథ్ చక్కటి ఫీల్డ్ గోల్‌ను సాధించాడు. కానీ, ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవక ముందే, జాక్ వీటన్ 23వ నిమిషంలో గోల్ చేయడంతో తిరిగి స్కోర్లు సమమయ్యాయి. ఆసీస్ రెండో గోల్ చేసిన రెండు నిమిషాల్లోనే రఘునాథ్ తన ఖాతాలో రెండో గోల్‌ను చేర్చుకున్నాడు. మ్యాచ్‌లో రెండోసారి భారత్ ఆధిక్యంలో నిలిచింది. కానీ, చివరి వరకూ నిలబెట్టుకోలేకపోయింది. భారత రక్షణ వలయంలో లోపాలను పసిగట్టిన జెరెమీ హేవార్డ్ వ్యూహాత్మకంగా ఆడి, 38, 54 నిమిషాల్లో గోల్స్ చేసి ఆస్ట్రేలియాను గెలిపించాడు. ఈ విజయంతో ఆసీస్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-1గా డ్రా చేసుకుంది.

ఇంగ్లాండ్ జట్టులో
జెన్నింగ్స్, డాసన్
న్యూఢిల్లీ, నవంబర్ 30: భారత్‌తో జరిగే చివరి రెండు టెస్టు మ్యాచ్‌లకు ఎంపిక చేసిన జట్టులో దర్హమ్ ఓపెనర్ కీటన్ జెన్నింగ్స్, హమ్స్‌షైర్ ఆటగాడు లియామ్ డాసన్‌లకు ఇంగ్లాండ్ సెలక్టర్లు చోటు కల్పించారు. దుబాయ్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టుతో గురువారం ప్రారంభమయ్యే మ్యాచ్‌తో ఇంగ్లాండ్ ‘ఎ’ జట్టులోకి జెన్నింగ్స్ ఆడుగుపెట్టనున్నాడు. మొహాలీలో జరిగిన మూడో టెస్టులో చేతి వేలికి గాయమైన కారణంగా హసీబ్ హమీద్ స్వదేశానికి వెళ్లిపోగా, అతని స్థానంలో జెన్నింగ్స్‌ను తీసుకుంటున్నట్టు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) ఒక ప్రకటనలో తెలిపింది. సర్రే ఆటగాడు జాఫర్ అన్సారీ వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకోలేదు. ముందు జాగ్రత్త చర్యగా అతనికి విశ్రాంతినిచ్చిన ఇసిబి అతని స్థానంలో హామ్స్‌షైర్ ఆల్‌రౌండర్ డాసన్‌ను తీసుకుంది. అయితే, అన్సారీ జట్టుతోనే కొనసాగుతాడని, భారత్‌లోనే వైద్య సేవలు తీసుకుంటాడని ఇసిబి తన ప్రకటనలో పేర్కొంది.
ఇద్దరు క్రికెటర్లకు
బిసిబి భారీ జరిమానా
ఢాకా, నవంబర్ 30: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసిబి) ఇద్దరు క్రికెటర్లకు భారీ జరిమానా విధించింది. నిబంధనలకు విరుద్ధంగా మహిళా అతిథులను ఫాస్ట్ బౌలర్ అల్ అమీన్ హొస్సేన్, బ్యాట్స్‌మన్ సబ్బీర్ రహ్మాన్ తమ హోటల్ గదులకు రప్పించుకోవడాన్ని బిసిబి సీరియస్‌గా తీసుకుంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బిపిల్) టి-20 టోర్నీ మ్యాచ్ జరుతున్నప్పుడు చోటు చేసుకున్న ఈ సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని బిసిబి ఒక ప్రకటనలో తెలిపింది. నిబంధనలను ఉల్లంఘించిన ఇద్దరు క్రికెటర్లకు చెరి 15,000 డాలర్లు (సుమారు 10 లక్షల రూపాయలు) జరిమానాగా విధించినట్టు తెలిపింది. ఇలాంటి సంఘటన పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.