క్రీడాభూమి

సుప్రీం తీర్పుపై ఉత్కంఠ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: లోధా కమిటీ సిఫార్సులను అమలుపై సుప్రీం కోర్టు తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. సోమవారం విచారణకు రానున్న ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు తుది తీర్పునిచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ కొన్ని అంశాలను వాయిదా వేసినా, కొన్ని కీలక సిఫార్సులపై భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కు ఆదేశాలు జారీ చేయవచ్చని అంటున్నారు. లోధా కమిటీ సిఫార్సులను అమలుకు గతంలో సుప్రీం కోర్టు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా, ఎన్ని పర్యాయాలు డెడ్‌లైన్లు మార్చినా బిసిసిఐ స్పందించని విషయం తెలిసిందే. తాజాగా నిర్వహించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం)లోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గతంలో చేసిన వాదనకే పరిమితం కావడంతో, సుప్రీం కోర్టు కఠినంగా వ్యవహరిస్తుందా లేక మరో అవకాశం ఇస్తుందా అన్నది చర్చనీయాంశమైంది. మొత్తానికి సుమారు రెండేళ్లుగా నానుతున్న ఈ వివాదానికి ఇకనైనా తెరపడుతుందా లేక మరికొంత కాలం వాయిదా పడుతుందా అన్నది చూడాలి. లోధా కమిటీ సిఫార్సుల అమలుపై ఒక నిర్ణయం తీసుకోవడానికి గత నెల జరగాల్సిన ఎస్‌జిఎం ఒక రోజు వాయిదా పడి, ఆతర్వాత ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండానే ముగిసిన విషయం తెలిసిందే. తాజా ఎస్‌జిఎంలోనూ అదే పరిస్థితి పునరావృతమైంది. లోధా ప్రతిపాదనలను అమలుచేసి తీరాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేయడంతో ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించాల్సిన అవసరం ఏర్పడినప్పటికీ బిసిసిఐ ఏమాత్రం పట్టించుకోలేదన్నది వాస్తవం. తొలి విడత సిఫార్సుల అమలుకు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించడానికి కోర్టు ఇచ్చిన గడువు ఈఏడాది జూలై మాసంతోనే ముగిసినప్పటికీ, కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేస్తూ, గతంలో చేసిన వాదననే మరోసారి తెరపైకి తెస్తూ, చెప్పిన అభ్యంతరాలనే మళ్లీమళ్లీ వ్యక్తం చేస్తూ బిసిసిఐ రోజులు దొర్లించింది. ఇదే పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుందనేది సోమవారంతో తేటతెల్లమవుతుంది.
కీలక అంశాలు
బిసిసిఐ నిర్ణయాలు తీసుకోవాల్సిన ఎన్నో కీలక అంశాలపై సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పునివ్వచ్చు లేదా మార్గదర్శకాలను జారీ చేయవచ్చు. మొదటి విడత సిఫార్సుల అమలుకు అనుగుణంగా సంస్థ నిబంధనావళిని మార్చాలని బోర్డును ఆదేశించే అవకాశం ఉంది. అదే జరిగితే, న్యాయ సలహాదారు మార్కండేయ ఖడ్జూపై నమ్మకం ఉంచి, సుప్రీం కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేసిన బోర్డు అధికారులకు విషమ పరిస్థితి తప్పకపోవచ్చు. సిఫార్సుల అమలును చాలకాలంగా వాయిదా వేసిన అధికారులకు ఇప్పుడు సుప్రీం కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు అందుతాయోనన్న భయం పట్టుకుంది.
ఎటూ తేల్చుకోలేక..
లోధా కమిటీ ప్రతిపాదనల అమలుపై బిసిసిఐ అధికారులు ఎటూ తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతున్నారు. సిఫార్సులు అమలు చేస్తే, భారత క్రికెట్‌పై దశాబ్దాలుగా కొనసాగిస్తున్న ఆధిపత్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అంతేగాక, అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కే అందరి కంటే ముందుగా తమ పదవులను కోల్పోవాల్సి వస్తుంది. దీనికి భయపడే ప్రతిపాదనలను అమలు చర్యలకు వారు గండికొడుతూ వచ్చారు. కోర్టు ఎన్ని పర్యాయాలు ఆదేశించినా పట్టించుకోకుండా, ఏదో ఒక వంకతో నిర్ణయాలను వాయిదా వేసినందుకే అనురాగ్ ఠాకూర్, అజయ్ షిర్కే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఈ పరిస్థితికి వారి స్వయంకృతమే కారణం. సెప్టెంబర్‌లో జరిగిన ఎజిఎంలో వీరే వివాదాస్పద నిర్ణయాలకు కారణమయ్యారు. అజయ్ షిర్కే ఎన్నికే లోధా సిఫార్సులకు విరుద్ధంగా జరిగింది. అంతటితో ఆగకుండా ఐదుగురు సభ్యులతో జాతీయ సెలక్షన్ కమిటీని నియమించారు. సెలక్షన్ కమిటీలో బోర్డు తరఫున ముగ్గురే ఉండాలని లోధా కమిటీ తేల్చిచెప్పినా పట్టించుకోలేదు. సిఫార్సులను అమలు చేయలేదు. కనీసం ఆ దిశగా అడుగులు కూడా వేయలేదు. ఒకవైపు కమిటీ, మరోవైపు సుప్రీం కోర్టు విధించిన డెడ్‌లైన్లను వీరిద్దరూ తమ పదవులను కాపాడుకోవడం కోసమే పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. సాధ్యమైనంత కాలం పదవిలో కొనసాగాలన్నదే వారి ధ్యేయంగా కనిపిస్తున్నది. విశ్రాంత న్యాయమూర్తి ఆర్‌ఎం లోధా చైర్మన్‌గా, రవీంద్రన్, అశోక్ భాన్ సభ్యులుగా ఉన్న కమిటీపై పూర్తి నమ్మకం ఉంచి, పలు కీలక అంశాలపై నిర్ణయాలను తీసుకునే అధికారాన్ని సుప్రీం కోర్టు దానికే అప్పచెప్పింది. కానీ, దేశంలో క్రికెట్ రంగాన్ని ప్రక్షాళన చేయడానికి కమిటీ చేసిన ప్రతిపాదనలను బిసిసిఐ అమలు చేయలేదు. కొన్ని అంశాలు అమలుకు సాధ్యంకానివిగా ఉన్నాయని వాదిస్తూ కాలం గడిపేస్తున్నది.
పాలక వర్గంపై వేటు!
లోధా కమిటీ సిఫార్సుల అమలుపై ఎస్‌జిఎంలో సరైన నిర్ణయం తీసుకోని కారణంగా, ప్రస్తుత పాలక వర్గంపై వేటుపడే అవకాశం ఉంది. సుప్రీం కోర్టుకు సమర్పించిన స్టేటస్ రిపోర్ట్‌లో కమిటీ ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్న ప్రస్తుత కమిటీని రద్దు చేయాలన్న ప్రతిపాదనపై గతంలో సుప్రీం కోర్టు కూడా తీవ్రంగానే స్పందించిన విషయం తెలిసిందే. బిసిసిఐకి ప్రత్యేక హోదాగానీ, తిరుగులేని అధికారాలుగానీ ఏవీ లేవని స్పష్టం చేసింది. చట్టానికి అతీతం కాదని తేల్చిచెప్పింది. టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం ఇంత ఘాటుగా వ్యాఖ్యలు చేయడానికి, లోధా కమిటీ సిఫార్సుల అమలుపై పట్టుబట్టడానికి బోర్డు అధికారుల ప్రదర్శించిన అతి ధోరణులే కారణమన్నది అందరికీ తెలిసిన నిజం. వారిని కట్టడి చేయడానికి సుప్రీం కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

చిత్రం..పదవులకు ఎసరు! బిసిసిఐ కార్యదర్శి అజయ్ షిర్కే, అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్