క్రీడాభూమి

ఆల్ ఈజ్ ‘మ్యాక్స్‌వెల్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 17: టీమిండియాతో జరుగుతున్న ఐదు వనే్డల అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా ‘హ్యాట్రిక్’ విజయాలతో సత్తా చాటుకుంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసిజి)లో ఆదివారం జరిగిన మూడో వనే్డలో ఆ జట్టు 3 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించి వరుసగా మూడో విజయాన్ని నమోదు చేయడంతో పాటు మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ అద్భుత శతకంతో విజృంభించినప్పటికీ బౌలర్లు మరోసారి పేలవమైన ప్రదర్శనతో విఫలమవడంతో ఈ సిరీస్‌ను చేజార్చుకోవాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో కోహ్లీ 117 బంతుల్లో 117 పరుగులు సాధించి అంతర్జాతీయ వనే్డల్లో 24వ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 295 పరుగుల చక్కటి స్కోరు సాధించింది. అయితే దీనికి దీటైన జవాబిచ్చిన కంగారూలు ఏ దశలోనూ తడబడలేదు. ఫలితంగా 48.5 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 296 పరుగులు సాధించిన ఆతిథ్య జట్టు మరో 7 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అధిగమించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఒకానొక దశలో ధోనీ సేనను విజయం ఊరించినప్పటికీ బౌలర్లు మరోసారి కలసికట్టుగా విఫలమవడంతో కీలక సమయంలో విజృంభించి ఆడిన ఆస్ట్రేలియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ 83 బంతుల్లో మూడు సిక్సర్లు, మరో ఎనిమిది ఫోర్ల సహాయంతో 96 పరుగులు రాబట్టి టీమిండియా ఆశలపై నీళ్లు చల్లాడు. అలాగే ఫీల్డింగ్‌లో కూడా భారత జట్టు సరిగా రాణించకపోవడం కంగారూల విజయానికి ‘రాచబాట’ వేసింది.
ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో భారత బౌలర్లు ఉమేష్ యాదవ్ (9.5 ఓవర్లలో 2 వికెట్లకు 68 పరుగులు), ఇశాంత్ శర్మ (10 ఓవర్లలో 2 వికెట్లకు 53 పరుగులు), బీరేందర్ సరన్ (8 ఓవర్లలో వికెట్లేమీ సాధించకుండా 63 పరుగులు) మరోసారి ఘోరంగా విఫలమయ్యారు. ఈ వైఫల్యాలను ఆసరాగా చేసుకుని ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఆస్ట్రేలియా ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (23 బంతుల్లో 3 ఫోర్లు సహా 21 పరుగులు), షాన్ మార్ష్ (76 బంతుల్లో 6 ఫోర్లు సహా 62 పరుగులు) ప్రతి ఓవర్‌కు దాదాపు 6 పరుగులు సాధిస్తూ ఇన్నింగ్స్‌ను సమర్ధవంతంగా ముందుకు నడిపారు. ఆరంభంలోనే టీమిండియా బౌలింగ్‌లో మార్పులు చేసినప్పటికీ కంగారూల రన్‌రేట్ ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం.
అలాగే ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ వనే్డల్లో అరంగేట్రం చేసిన యువ ఆటగాడు గుర్‌కీరత్ సింగ్ మాన్ 6వ ఓవర్‌లో ఫించ్ అందించిన క్యాచ్‌ను జారవిడిచాడు. అయితే అప్పటికి 20 పరుగులు సాధించిన ఫించ్ మరో పరుగు రాబట్టిన తర్వాత 8వ ఓవర్‌లో ఇశాంత్‌కు దొరికిపోయాడు. ఫించ్ స్థానంలో వచ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ (45 బంతుల్లో 5 ఫోర్లు సహా 41 పరుగులు) ఏమాత్రం వత్తిడికి గురవకుండా బ్యాటింగ్ ప్రారంభించాడు. వరుసగా రెండో అర్థ శతకాన్ని నమోదు చేసుకున్న మార్ష్‌తో కలసి స్మిత్ 64 పరుగులు జోడించడంతో ఆస్ట్రేలియా జట్టు 16వ ఓవర్‌లోనే 100 పరుగుల మార్కు దాటింది. ఆ తర్వాత స్మిత్ 19వ ఓవర్‌లో రవీంద్ర జడేజా వేసిన బంతిని ఎదుర్కోబోయి అజింక్యా రహానే చేతికి చిక్కగా, అతని స్థానంలో దిగిన జార్జి బెయిలీ (23) 27వ ఓవర్‌లో స్టంప్ అవుట్‌గా నిష్క్రమించాడు. దీంతో భారత శిబిరంలో ఆశలు చిగురించాయి. ఆ తర్వాత షాన్ మార్ష్ 30వ ఓవర్‌లో ఇశాంత్ శర్మ వేసిన బంతిని ఎదుర్కోబోయి వికెట్ల వెనుక ధోనీ చేతికి చిక్కడం, మిఛెల్ మార్ష్ (17)ను 36వ ఓర్‌లో ధోనీ రనౌట్ చేయడం, 39వ ఓవర్‌లో మాథ్యూ వేడ్ (6) ఇశాంత్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌కు దొరికిపోవడంతో ఆస్ట్రేలియా జట్టు 215 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి స్వల్ప ఇబ్బందుల్లో పడింది.
ఈ తరుణంలో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అద్భుతమైన ఆటతీరు కనబర్చి అంతర్జాతీయ వనే్డల్లో 13వ అర్థ శతకాన్ని నమోదు చేసుకోవడంతో పాటు జేమ్స్ ఫాల్క్‌నర్‌తో కలసి 7వ వికెట్‌కు 63 బంతుల్లోనే 80 పరుగులు జోడించి కంగారూలను విజయం ముంగిట నిలబెట్టగా, ఫాల్క్‌నర్ (21), జాన్ హేస్టింగ్స్ (0) అజేయంగా నిలిచి మిగిలిన పని పూర్తి చేశారు. దీంతో 48.5 ఓవర్లలో 296 పరుగులు సాధించిన ఆస్ట్రేలియా జట్టు మరో 7 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది.
అంతకుముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టులో ఓపెనర్ రోహిత్ శర్మ (6) స్వల్ప స్కోరుకే నిష్క్రమించినప్పటికీ విరాట్ కోహ్లీ వీరోచిత శతకంతో విజృంభించి ఆడాడు. నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ శిఖర్ ధావన్ (91 బంతుల్లో 9 ఫోర్లు సహా 68 పరుగులు)తో కలసి 119 పరుగులు జోడించిన కోహ్లీ మూడో వికెట్‌కు అజింక్యా రహానే (55 బంతుల్లో 4 ఫోర్లు సహా 50 పరుగులు)తో కలసి మరో 109 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. వీరి నిష్క్రమణ తర్వాత గుర్‌కీరత్ సింగ్ (8), కెప్టెన్ ధోనీ (23) త్వరత్వరగా వెనుదిరగ్గా రవీంద్ర జడేజా (6), రిషీ ధావన్ (3) అజేయంగా నిలిచారు. దీంతో భారత జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 295 పరుగులు రాబట్టింది. అద్భుత ఇన్నింగ్స్‌తో కంగారూల విజయంలో కీలకపాత్ర పోషించిన మ్యాక్స్‌వెల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కైవసం చేసుకున్నాడు.
కోహ్లీ ఖాతాలో రెండు రికార్డులు

వేగవంతంగా 24 శతకాలు, 7000 పరుగులు పూర్తి

మెల్బోర్న్, జనవరి 17: మెల్బోర్న్‌లో ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వనే్డలో భారత జట్టు ఓటమిపాలైనప్పటికీ ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఒకేసారి రెండు మైలురాళ్లను అధిగమించాడు. మొత్తం 117 బంతుల్లో రెండు సిక్సర్లు, మరో ఏడు ఫోర్ల సహాయంతో 117 పరుగులు సాధించిన కోహ్లీ అంతర్జాతీయ వనే్డ క్రికెట్‌లో అత్యంత వేగవంతంగా 24 శతకాలు, 7 వేల పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డులు నెలకొల్పాడు. కేవలం 161వ ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాళ్లను అధిగమించిన కోహ్లీ ఈ విషయంలో తన స్ఫూర్తిప్రదాత, ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్‌తో పాటు మరెంతో మంది దిగ్గజ క్రికెటర్ల కంటే ముందున్నాడు. 189వ ఇన్నింగ్స్‌లో 7000 పరుగుల మైలురాయిని అధిగమించిన సచిన్ 219వ ఇన్నింగ్స్‌లో 24వ సెంచరీని రాబట్టాడు. అంతర్జాతీయ వనే్డ క్రికెట్‌లో వేగవంతంగా 24 సెంచరీలు పూర్తిచేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్‌తో పాటు ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (278 ఇన్నింగ్స్‌లో), శ్రీలంక దిగ్గజ ఆటగాళ్లు సనత్ జయసూర్య (370), కుమార సంగక్కర (378) తదితరులంతా కోహ్లీకి కనీసం దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. మెల్బోర్న్‌లో ఆదివారం 10వ ఓవర్‌లో జేమ్స్ ఫాల్క్‌నర్ వేసిన బంతిని బౌండరీ దాటించి 7000 పరుగుల మైలురాయిని అధిగమించిన కోహ్లీ ఈ విషయంలో దక్షిణాఫ్రికా ‘రన్ మెషీన్’ ఎబి.డివిలియర్స్ (166 ఇన్నింగ్స్‌లో) కిందికి నెట్టి అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. అంతర్జాతీయ వనే్డ క్రికెట్‌లో వేగవంతంగా 7000 పరుగుల మైలురాయిని అధిగమించిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (174 ఇన్నింగ్స్‌లో), వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా (183), విండీస్ మాజీ బ్యాట్స్‌మన్ డెస్మండ్ హేన్స్ (187), దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్ కాలిస్ (188)లతో పాటు సచిన్ (189) కూడా ఉన్నప్పటికీ వీరంతా కోహ్లీ కంటే ఎంతో వెనుకబడి ఉన్నారు. అలాగే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసిజి)లో ఆదివారం శిఖర్ ధావన్‌తో కలసి రెండో వికెట్‌కు 119 పరుగులు జోడించిన కోహ్లీ ఈ గ్రౌండ్‌లో ఇంతకుముందు (1981లో) భారత బ్యాట్స్‌మన్లు సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్ నెలకొల్పిన 101 పరుగుల ఉత్తమ భాగస్వామ్య రికార్డును కూడా అధిగమించాడు.

బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయిన అశ్విన్
దుబాయ్, జనవరి 17: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) అత్యుత్తమ టెస్టు బౌలర్ల జాబితాలో భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానాన్ని కోల్పోయాడు. ఉత్తమ బ్యాట్స్‌మన్ల జాబితాలో భారత యువ ఆటగాడు అజింక్యా రహానే సంయుక్తంగా 10వ ర్యాంకులో కొనసాగుతున్నప్పటికీ ఆదివారం ఐసిసి తాజాగా విడుదల చేసిన టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అశ్విన్‌ను రెండో స్థానానికి నెట్టి ఇంగ్లాండ్ పేసర్ స్టూవర్ట్ బ్రాడ్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. శనివారం జొహానె్నస్‌బర్గ్‌లో కేవలం మూడు రోజులకే ముగిసిన టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో బ్రాడ్ అద్భుత ప్రదర్శనతో 17 పరుగులకే 6 వికెట్లు కైవసం చేసుకుని ఆతిథ్య దక్షిణాఫ్రికా ఓటమిలో కీలకపాత్ర పోషించడంతో తాజా ర్యాంకింగ్స్‌లో అతనికి ఉన్నత స్థానం లభించింది. దీంతో రెండో స్థానానికి దిగజారిన అశ్విన్ ఉత్తమ ఆల్‌రౌండర్ల జాబితాలో మాత్రం అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు.

నేటి నుంచి ఆస్ట్రేలియా ఓపెన్

మెల్బోర్న్, జనవరి 17: మార్టినా హింగిస్‌తో కలిసి అప్రతిహత విజయాలతో దూసుకుపోతున్న సానియా మీర్జా సోమవారం ఇక్కడ ప్రారంభమయ్యే ఈ ఏడాది తొలి గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో సైతం అదే ఫామ్‌ను కొనసాగించి మరో గ్రాండ్‌శ్లాప్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నారు. మరో వైపు మన దేశానికే చెంది రోహన్ బొపన్న ఫ్లోరియా మెర్గియాతో కలిసి పురుషుల డబుల్స్ విభాగంలో తొలి గ్రాండ్‌శ్లామ్ టైటిల్‌కోసం పోటీ పడబోతున్నాడు. సానియా-హింగిస్ జోడీ 30 వరస విజయాలతో మహిళా టెన్నిస్‌లో సంచలనం సృష్టిస్తోంది. గత ఏడాది కొన్ని మ్యాచ్‌లలో ప్రత్యర్థులనుంచి గట్టి పోటీ ఎదురయినప్పటికీ ఈ జోడీ వారి సవాలును సునాయాసంగా తిప్పికొట్టి వరసగా టైటిళ్లను దక్కించుకొంటూ, మహిళా టెన్నిస్ డబుల్స్ విభాగంలో తమకు ఎదురు లేదని నిరూపించుకొంటోంది. గత ఏడాది యుఎస్ ఓపెన్, వింబుల్డన్ టైటిళ్లను దక్కించుకున్న ఈ జోడీ జంటగా ఆడడం మొదలుపెట్టిన ఏడాది కాలంలోనే 11 టైటిళ్లను దక్కించుకుంది. ఆస్ట్రేలియా ఓపెన్‌కు సన్నాహకాలయిన బ్రిస్బేన్, సిడ్నీ టోర్నమెంట్లలోను వారు అదే ఫామ్‌ను కొనసాగించారు. ఈ జోడీ ఆస్ట్రేలియా ఓపెన్ తొలి రవుండ్‌లో అన్‌సీడెడ్ జోడీ మారియానా డుక్యు-మారినో(కొలంబియా), టెలియానా పెరీరా(బ్రెజిల్)ను ఢీకొంటోంది. మొత్తంమీద ఆస్ట్రేలియా ఓపెన్‌లో మన దేశంనుంచి ఆరుగురు పోటీ పడుతున్నారు. సింగిల్స్ విభాగంలో యుకి భంబ్రీ తొలి రౌండ్‌లో ఆరో సీడ్ తామస్ బెర్డిచ్‌ను ఢీకొనబోతున్నాడు. ఇక డబుల్స్‌లో ప్రముఖులైన పేస్, భూపతి ఇద్దరు కూడా ఒకే హాఫ్‌లో ఆడబోతున్నారు. పేస్ ఫ్రెంచ్ భాగస్వామి జెరెమీ చార్డీతో కలిసి తొలి రవుండ్‌లో 12వ సీడ్ జోడీ జాన్ సెబాస్టియన్ కాబల్, రాబర్ట్ ఫారా జోడీని ఎదుర్కోనున్నాడు. మరో వైపు లక్సెంబర్గ్‌కు చెందిన గిల్లెస్ ముల్లర్‌తో జోడీగాబరిలోకి దిగుతున్న భూపతి తొలి రవుండ్‌లో ఆస్ట్రేలియా జోడీ అలెక్స్ బోల్ట్, ఆండ్రో విట్టన్‌లను ఢీకొనబోతున్నారు.వీరే కాకుండా మన దేశానికే చెందిన అపూర్వ రాజా అకొయేషియాకు చెందిన ఇవో కారోవిచ్‌తో కలిసి డబుల్స బరిలోకి దిగుతున్నాడు.
అందరి దృష్టీ జొకోవిచ్‌పైనే
కాగా, గత ఏడాది అంతా తిరుగులేని విజయాలతో సంచనాలను సృష్టించిన టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ కొత్త సంవత్సరం తొలి గ్రాండ్‌శ్లామ్ అయిన ఆస్ట్రేలియా ఓపెన్‌లోను అదే ఫామ్‌ను కొనసాగించి తన చిరకాల కోరిక అయిన ‘గోల్డెన్‌శ్లామ్’ను దక్కించుకుంటాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. గత ఏడాది అతనికి ఈ అవకాశం కొద్దిలో చేజారింది. ఈ ఏడాది జొవిచ్ ఇప్పటివరకు ఒక్క సెట్ కూడా కొల్పోలేదు. అంతేకాదు కతర్ ఓపెన్‌లో అతని ఆట తీరు చూసిన అందరు కూడా గత ఏడాదిలాగానే అతని ఫామ్ కొనసాగుతుందని అనుకుంటున్నారు. సోమవారం దక్షిణ కొరియాకు చెందిన చుంగ్ హ్యేవన్‌తో తొలి రౌండ్‌లో తలపడనున్నాడు. అతని చిరకాల ప్రత్యర్థి రోజర్ ఫెదరర్ కూడా తొలి రోజే బరిలోకి దిగనున్నాడు. జార్జియాకు చెందిన నికొలొజ్ బాసిలాష్విలి ఆయన ప్రత్యర్థి. కాగా, జొకోవిచ్‌కు ప్రధాన పోటీదారులుగా భావిస్తున్న ఆండీముర్రే, వావ్రింకాలు మంగళవారంనుంచి తమ పోటీలను ప్రారంభించనున్నారు.

ముంబయి మారథాన్ విజేత కిప్కెటర్

గోపి, ఖేతారామ్‌లకు ఒలింపిక్ బెర్తులు

ముంబయి, జనవరి 17: స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఆధ్వర్యాన ఆదివారం జరిగిన ముంబయి మారథాన్ 13వ ఎడిషన్ పురుషుల విభాగంలో కెన్యన్ పేస్‌మేకర్ గిడెయాన్ కిప్కెటర్ విజేతగా నిలవడమే కాకుండా సరికొత్త రికార్డు సృష్టించి సత్తా చాటుకున్నాడు. 2:08:35 గంటల వ్యవధిలో లక్ష్యాన్ని అధిగమించిన కిప్కెటర్ 2013లో ఉగాండా రన్నర్ జాక్సన్ కిప్రోప్ నెలకొల్పిన రికార్డును బద్ధలు కొట్టగా, ఇథియోపియాకు చెందిన సెబొకా దిబాబ (2:09:20), కెన్యా రన్నర్ మారియస్ కిముతై (2:09:39) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. అలాగే మహిళల విభాగంలో ఇథియోపియా రన్నర్ షుకో గెనెమో 2:27:50 గంటల్లో లక్ష్యాన్ని అధిగమించి ప్రథమ స్థానంలో నిలవడంతో పాటు 2013లో కెన్యా రేసర్ వాలెంటిన్ కిప్కెటర్ (పురుషుల రేస్ విజేత గిడెయాన్ కిప్కెటర్ సోదరి) నెలకొల్పిన రికార్డును బద్ధలు కొట్టగా, కెన్యాకు చెందిన బోర్నెస్ కితుర్ (2:37:00), వాలెంటిన్ కిప్కెటర్ (2:34:07) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. వాలెంటిన్ కిప్కెటర్ 29వ కిలోమీటర్‌కు చేరుకున్న తర్వాత ఆమె బూటు లేసు ఊడిపోవడంతో ఆమె ఈ రేసులో వెనుకబడి మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
నితేంద్ర సింగ్ రికార్డు
ఇదిలావుంటే, ఈ మారథాన్‌లో పాల్గొన్న భారతీయుల్లో టి.గోపీ, ఖేతా రామ్ ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచి ఈ ఏడాది రియో (బ్రెజిల్)లో జరిగే ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. అయితే రియో ఒలింపిక్స్‌కు ఇంతకుముందే అర్హత సాధించిన నితేంద్ర సింగ్ రావత్ 2:15:48 గంటల్లో లక్ష్యాన్ని అధిగమించి ప్రథమ స్థానంలో నిలువడంతో పాటు 2012లో రామ్ సింగ్ యాదవ్ (2:16:59) నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు 2 గంటల 19 నిమిషాల సమయాన్ని కటాఫ్‌గా నిర్ణయించడంతో ఈ పోటీల్లో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన గోపీ (2:16:15), ఖేతా రామ్ (2:17:23) కూడా ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.

రెచ్చిపోయన గుప్టిల్, విలియమ్‌సన్

రెండో టి-20లో రికార్డు భాగస్వామ్యం, 10 వికెట్ల తేడాతో పాకిస్తాన్ చిత్తు

హామిల్టన్, జనవరి 17: పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల అంతర్జాతీయ ట్వంటీ-20 క్రికెట్ సిరీస్‌లో భాగంగా ఆదివారం హామిల్టన్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్, కాన్ విలియమ్‌సన్ ప్రపంచ రికార్డు భాగస్వామ్యంతో కదం తొక్కారు. దీంతో న్యూజిలాండ్ 10 వికెట్ల తేడాతో విజయభేరి మోగించి సిరీస్‌ను సమం చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ జట్టు జట్టులో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఉమర్ అక్మల్ (56-నాటౌట్), సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్ (39) మినహా ఎవరూ సరిగా రాణించలేదు. ఓపెనర్ మొహమ్మద్ హఫీజ్ (19), షోయబ్ మక్సూద్ (18) మినహా మిగిలిన వారంతా రెండంకెల స్కోర్లు చేయకుండానే నిష్క్రమించడంతో నిర్ణీత 20 ఓవర్లలో పాక్ 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది.
న్యూజిలాండ్ బౌలర్లలో మెక్‌క్లెనగన్ 2 వికెట్లు సాధించగా, కొరీ జె ఆండర్సన్, సాంట్నర్, ఇలియట్, ఆడమ్ మిల్నే ఒక్కో వికెట్ అందుకున్నారు.
అనంతరం 169 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టులో ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్, కెప్టెన్ కాన్ విలియమ్‌సన్ ఆరంభం నుంచే ధాటిగా ఆడారు. క్రీజ్‌లో పాతుకుపోయి ప్రత్యర్థి బౌలర్లను సమర్థవంతంగా ప్రతిఘటించిన వీరు చూడముచ్చటైన షాట్లతో అలరించి చెరొక అర్థ శతకాన్ని నమోదు చేసుకోవడంతో పాటు అజేయంగా 171 పరుగుల ప్రపంచ రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో 17.4 ఓవర్లలో లక్ష్యాన్ని అధిగమించిన న్యూజిలాండ్ జట్టు మరో 14 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన మార్టిన్ గుప్టిల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కైవసం చేసుకున్నాడు.

స్కోరుబోర్డు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) వేడ్ (బి) రిచర్డ్‌సన్ 6, శిఖర్ ధావన్ (బి) హేస్టింగ్స్ 68, విరాట్ కోహ్లీ (సి) బెయిలీ (బి) హేస్టింగ్స్ 117, అజింక్యా రహానే (సి) మ్యాక్స్‌వెల్ (బి) హేస్టింగ్స్ 50, మహేంద్ర సింగ్ ధోనీ (సి) మ్యాక్స్‌వెల్ (బి) హేస్టింగ్స్ 23, గుర్‌కీరత్ సింగ్ (బి) ఫాల్క్‌నర్ 8, రవీంద్ర జడేజా నాటౌట్ 6, రిషీ ధావన్ నాటౌట్ 3, ఎక్స్‌ట్రాలు: (లెగ్‌బైస్ 5, వైడ్స్ 9) 14, మొత్తం: 50 ఓవర్లలో 295/6. వికెట్ల పతనం: 1-15, 2-134, 3-243, 4-265, 5-274, 6-288. బౌలింగ్: కాన్ రిచర్డ్‌సన్ 10-0-48-1, జాన్ హేస్టింగ్స్ 10-0-58-4, జేమ్స్ ఫాల్క్‌నర్ 10-0-63-1, స్కాట్ బోలాండ్ 9-0-63-0, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 9-0-46-0, మిచెల్ మార్ష్ 2-0-12-0.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: షాన్ మార్ష్ (సి) ధోనీ (బి) ఇశాంత్ 62, ఆరోన్ ఫించ్ (సి) ధోనీ (బి) ఉమేష్ 21, స్టీవెన్ స్మిత్ (సి) రహానే (బి) జడేజా 41, జార్జి బెయిలీ (స్టంప్డ్) ధోనీ (బి) జడేజా 23, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (సి) శిఖర్ ధావన్ (బి) ఉమేష్ 96, మిచెల్ మార్ష్ రనౌట్ (ఉమేష్/్ధనీ) 17, మాథ్యూ వేడ్ (సి) శిఖర్ ధావన్ (బి) ఇశాంత్ 6, జేమ్స్ ఫాల్క్‌నర్ నాటౌట్ 21, జాన్ హేస్టింగ్స్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు: (లెగ్‌బైస్ 3, వైడ్స్ 5, నోబాల్ 1) 9, మొత్తం: 48.5 ఓవర్లలో 296/7. వికెట్ల పతనం: 1-48, 2-112, 3-150, 4-167, 5-204, 6-215, 7-295. బౌలింగ్: ఉమేష్ యాదవ్ 9.5-0-68-2, బీరేందర్ సరన్ 8-0-63-0, ఇశాంత్ శర్మ 10-0-53-2, రిషీ ధావన్ 6-0-33-0, గుర్‌కీరత్ సింగ్ 5-0-27-0, రవీంద్ర జడేజా 10-0-49-2.