క్రీడాభూమి

నాదల్ నిష్క్రమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 19: కెరీర్‌లో 14 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకున్న ప్రపంచ మాజీ నంబర్ వన్ రాఫెల్ నాదల్ ఇక్కడ జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ మొదటి రౌండ్‌లోనే ఓటమిపాలై నిష్క్రమించాడు. మహిళల విభాగంలో ప్రపంచ మాజీ నంబర్ వన్ వీనస్ విలియమ్స్, రెండో ర్యాంక్ క్రీడాకారిణిగా బరిలోకి దిగిన సిమోనా హాలెప్ కూడా పరాజయాలను ఎదుర్కొని వెనుదిరిగారు. స్టార్ల పరాజయంతో ఆస్ట్రేలియా ఓపెన్‌లో మంగళవారం సంచలనాల దినంగా మారింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్న నాదల్ నాలుగు గంటల 41 నిమిషాలు పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. అతనిపై ఫెర్నాండో వెర్డాస్కో 7-6, 4-6, 3-6, 7-6, 6-2 తేడాతో విజయం సాధించాడు. 2014 ఫ్రెంచ్ ఓపెన్ తర్వాత ఇప్పటి వరకూ ఒక్క గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను కూడా అందుకోలేకపోయిన నాదల్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఫిట్నెస్ సమస్యతో అల్లాడుతున్న అతను చాలాకాలంగా ఫామ్‌లో లేడు. ఫలితంగా ఇక్కడ మొదటి రౌండ్‌లోనే అతను ఓటమిపాలయ్యాడు. గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లో అతను మొదటి రౌండ్‌లోనే వెనుదిరిగడం ఇది రెండోసారి. 2013 వింబుల్డన్‌లో అతను ఇదే విధంగా మొదటి రౌండ్‌లోనే ఓడాడు.
ఆస్ట్రేలియా వెటరన్ ఆటగాడు లేటన్ హెవిట్ 7-6, 6-2, 6-4 స్కోరుతో జేమ్స్ డక్‌వర్త్‌పై గెలుపొంది రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. బ్రిటిష్ స్టార్, రెండో ర్యాంకర్ ఆండీ ముర్రే 6-1, 6-2, 6-3 ఆధిక్యంతో అలెగ్జాండర్ జెరెవ్‌పై సునాయాసంగా గెలిచాడు. మొదటి రౌండ్‌లోనే జరిగిన మరో మ్యాచ్‌లో డిమిత్రీ తర్సునోవ్‌తో తలపడిన స్టానిస్లాస్ వావ్రిన్కా మొదటి సెట్ రెండు సెట్లను 7-6, 6-3 తేడాతో సొంతం చేసుకున్నాడు. ఈ దశలో మూడో సెట్ ఆడకుండా తర్సునోవ్ రిటైకావడంతో వావ్రిన్కా రెండో రౌండ్ చేరాడు. ఆడ్రియన్ మనారినోతో తలపడిన సామ్ గ్రాత్ 7-6, 6-4, 3-6, 6-3, డెనిస్ ఇస్టోమిన్‌ను ఎదుర్కొన్న బెనార్డ్ టోమిక్ 6-7, 6-4, 6-4, 6-4 తేడాతో విజయాలను నమోదు చేశారు.
కోన్టా దూకుడు
మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో జొహానా కొన్టా దూకుడుగా ఆడింది. ప్రస్తుతం ఎనిమిదో ర్యాంక్‌లో ఉన్న మాజీ ప్రపంచ నంబర్ వన్ వీనస్ విలియమ్స్‌ను ఆమె 6-4, 6-2 తేడాతో వరుస సెట్లలో చిత్తుచేసింది. వీనస్ సింగిల్స్‌లో 7, డబుల్స్‌లో 13, మిక్స్‌డ్ డబుల్స్‌లో 2 చొప్పున మొత్తం 22 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆమె అత్యుత్తమంగా 2003లో ఫైనల్ చేరి, రన్నర్ ట్రోఫీతో సరిపుచ్చుకుంది. ఆతర్వాత అదే స్థాయి ఆటను కొనసాగించలేకపోతున్నది. మరోసారి విఫలమై, మొదటి రౌండ్‌లోనే పోరాటాన్ని ముగించింది. కాగా, ప్రపంచ రెండో ర్యాంక్ క్రీడాకారిణి సిమోనా హాలెప్ కూడా అనూహ్యంగా వెనుదిరిగింది. ఆమెపై క్వాలిఫయర్ జాంగ్ షుయ్ 6-4, 6-3 తేడాతో విజయభేరి మోగించింది. 2014, 2015 సంవత్సరాల్లో క్వార్టర్ ఫైనల్స్ వరకూ చేరిన హాలెప్ ఈసారి మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించడం మంగళవారం నాటి మరో సంచలన ఫలితం.
కాగా, మూడో ర్యాంక్ క్రీడాకారిణి గాబ్రినే ముగురుజా 6-0, 6-4 తేడాతో అనెట్ కొన్టావెట్‌పై సులభంగా నెగ్గింది. తొమ్మిదోసీడ్ కరోలినా ప్లిస్కొవా 6-4, 6-4 స్కోరుతో కింబెర్లీ బిరెల్‌ను ఓడించింది. 14వ సీడ్ విక్టోరియా అజరెన్కా 6-0, 6-0 తేడాతో అలీసన్ వాన్ ఉత్సెవాన్క్‌పై విజయం సాధించింది. అజరెన్కా ధాటికి ఉత్సెవాన్క్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. 15వ సీడ్ మాడిసన్ కీస్ 7-6, 6-1 తేడాతో జరినా డియాస్‌ను, 20వ సీడ్ అనా ఇవానోవిచ్ 6-2, 6-3 స్కోరుతో టమీ పాటర్సన్‌ను ఓడించి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు. జర్మిలా ఊల్ఫ్‌తో తలపడిన క్వాలిఫయర్ అనస్టాజా సెవత్సొవా మొదటి సెట్‌ను 6-0 తేడాతో గెల్చుకుంది. రెండో సెట్‌లో 4-2 ఆధిక్యాన్ని అందుకుంది. ఓటమికి చేరువైన జర్మిలా గాయం కారణంగా ఆట నుంచి వైదొలగింది. సెవత్సొవా రెండో రౌండ్ చేరింది.

పాఠాలు నేర్చుకోవాలి
బౌలర్లకు రవి శాస్ర్తీ హితవు
కాన్‌బెరా, జనవరి 19: మూడు వరుస పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని బౌలర్లకు టీమిండియా డైరెక్టర్ రవి శాస్ర్తీ హితవు పలికాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను భారత్ ఇప్పటికే 0-3 తేడాతో చేజార్చుకున్న విషయం తెలిసిందే. మిగతా రెండు మ్యాచ్‌లను కోల్పోయి, వైట్‌వాష్ వేయించుకునే ప్రమాదం నుంచి బయటపడేందుకు ఏం చేస్తారని మంగళవారం విలేఖరుల సమావేశంలో పాల్గొన్న రవి శాస్ర్తీపై ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై అతను స్పందిస్తూ, బౌలర్లపైనే బాధ్యత ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించాడు. మూడు మ్యాచ్‌ల్లో వారు పాఠాలు నేర్చుకునే ఉంటారన్న ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇప్పుడు వారికి అనుభవం వచ్చిందని, మిగతా రెండు మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణిస్తారనే నమ్మకం తనకు ఉందని చెప్పాడు. ప్రపంచ నంబర్ వన్ జట్టును ఎదుర్కోవడం అనుకున్నంత సులభం కాదని అన్నాడు. ఒకరిద్దరు బౌలర్లు మెరుగ్గా ఆడినంత మాత్రాన లాభం ఉండదని స్పష్టం చేశాడు. బౌలర్లంతా ఒక జట్టుగా నిలిచి, పకడ్బందిగా బౌలింగ్ చేస్తేనే అనుకున్న లక్ష్యాలను రాబడతామని అన్నాడు.

ధోనీపై అరెస్టు వారెంట్
ఉపసంహరణ
ఆంధ్రభూమి బ్యూరో
అనంతరపురం, జనవరి 19: భారత పరిమిత ఓవర్ల జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై జారీ చేసిన అరెస్టు వారెంట్‌ను జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ గీతావాణి మంగళవారం ఉపసంహ రించారు. కేసును వచ్చేనెల 25వ తేదీకి వాయదా వేశారు. హిందూ దేవతలను కించ పరిచే విధం గా ధోనీ ఫొటోను ప్రచురించినందుకు అతనితో పాటు బిజినెస్ టుడే మాస పత్రిక ఎడిటర్ చైత న్య కాల్‌బాగ్‌పై అనంతపురం విశ్వహిందూ పరి షత్ నాయకుడు యర్రగుంట్ల శ్యాంసుందర్ కే సు వేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో ధోనీ కి సమన్లు ఆతర్వాత అరెస్టు వారెంట్ జారీకాగా, అతని తరఫు న్యాయవాదులుమంగళవారం కో ర్టుకు హాజరయ్యారు. ధోనీకి సమన్లు అందలేద ని, అంతేగాక అతను ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్య టనలో ఉన్నందున అరెస్టు వారెంట్‌ను ఉపసం హరించాలని కోరారు. తమ క్లయంట్‌కు న్యాయ స్థానంపట్ల గౌరవం ఉందని పేర్కొన్నారు. న్యా య వాదుల వాదన విన్న తర్వాత అరెస్టు వారెం ట్‌ను రద్దు చేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించా రు. ఒక ప్రకటనలో విష్ణుమూర్తి రూపంలో ధోనీ కనిపించడం, అతని చేతిలో బూటు ఉండడం వివాదానికి కారణమైన విషయం విదితమే.

లండన్, జనవరి 19: టెన్నిస్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంలో ఆశ్చర్యపడాల్సిన విషయమేమీ లేదని బ్రిటిష్ డేవిడ్ కమ్ మాజీ ఆటగాడు అరవింద్ పర్మార్ వ్యాఖ్యానించాడు. బిబిసి, బజ్‌ఫీడ్ సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక ప్రకారం ఫిక్సింగ్‌కు పాల్పడిన ఆటగాళ్లలో 16 మంది ‘టాప్-10’ స్థాయికి చేరారు. వారిలో కొంత మంది గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కూడా కైవసం చేసుకున్నారు. ఈ నివేదిక టెన్నిస్ ప్రపంచంలో సంచలనం సృష్టించగా, నివేదికలోని అంశాలు తనకు ఏమాత్రం ఆశ్చర్యాన్ని కలిగించలేకపోయాయని 2006లో టెన్నిస్ నుంచి రిటైరైన 37 పర్మార్ ఒక వార్తాపత్రికకు రాసిన లేఖలో స్పష్టం చేశాడు. ఒక బుకీ తనను కూడా కలిసినట్టు చెప్పాడు. 2004లో తాను నెదర్లాండ్స్‌లో సెకండ్ టైర్ చాలెంజర్ టూర్ ఆడుతున్నప్పుడు గుర్తుతెలియని బుకీ మ్యాచ్ ఫిక్సింగ్ కోసం తనను సంప్రదించి, మ్యాచ్‌ని చేజార్చుకుంటే భారీ మొత్తాన్ని ఇస్తానని ఆశచూపినట్టు తెలిపాడు. అయితే, అతని మాటలు వినడానికి కూడా తాను ఆసక్తిని చూపలేదని అన్నాడు. రెండు సెట్లు ఓడిపోవాలని, అందుకు ప్రతిఫలంగా యూరోలతో నిండిన కవరును తనకు ఇస్తానని సదరు బుకీ బేరం పెట్టినట్టు చెప్పాడు. చాలా మందికి ఇలాంటి ఆఫర్లే ఇచ్చివుంటారని అన్నాడు. బుక్‌మేకర్లు అందచూపుతున్న భారీ మొత్తాలే ఆటగాళ్లను ఫిక్సింగ్ వైపు మొగ్గుచూపేలా చేస్తున్నాయని పేర్కొన్నాడు. అందరూ తన మాదిరి బుకీల ప్రలోభాలకు లొంగకుండా ఉంటారని అనుకోవడానికి వీల్లేదని అన్నాడు. ఫిక్సింగ్ కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని చెప్పాడు.
నన్నూ సంప్రదించారు: కొకినకిస్ వెల్లడి
మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడాల్సిందిగా సోషల్ మీడియా ద్వారా కొంత మంది తనను కూడా లక్ష్యంగా ఎంచుకున్నారని ఆస్ట్రేలియా యువ ఆటగాడు తనాసీ కొకినకిస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపాడు. తనను నేరుగా ఎవరూ సంప్రదించలేదని పేర్కొన్నాడు. అయితే, ఫేస్‌బుక్ ద్వారా తనకు ఆఫర్లు వచ్చాయని, వాటిని తాను పట్టించుకోలేదని తెలిపాడు.
పారదర్శకత అవసరం: ముర్రే
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై జరుగుతున్న విచారణలో పారదర్శకత అవసరమని బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే అన్నాడు. ఈ నేరానికి పాల్పడింది ఎవరైనా, ఎంత పెద్దవాళ్లయినా కఠినంగా వ్యవహరించాల్సిందేనని డిమాండ్ చేశాడు. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఎటిపి) యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకోవాలని కోరాడు.
పేర్లు వెల్లడించండి: ఫెదరర్
మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన వారిలో ఎనిమిది మంది ఆటగాళ్లు ప్రస్తుతం ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొంటున్నారని బిబిసి, బజ్‌ఫీడ్ నివేదిక స్పష్టం చేయడంపై మాజీ నంబర్ వన్ రోజర్ ఫెదరర్ తీవ్రంగా స్పందించాడు. క్రీడాస్ఫూర్తికి విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనైనా ఖండించి తీరాల్సిందేనని అన్నాడు. ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొంటున్న మ్యాచ్ ఫిక్సింగ్ దోషులు ఎవరో వెల్లడించాలని డిమాండ్ చేశాడు.

గేల్ నిరాశ పరిచాడు
పది బంతుల్లో హాఫ్ సెంచరీ చేస్తే ఇంకా బాగుండేది: యువీ
న్యూఢిల్లీ, జనవరి 19: టి-20 మ్యాచ్‌లో 12 బంతుల్లోనే అర్ధ శతకాన్ని సాధించిన తన రికార్డును సమం చేసిన వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ తనను నిరాశ పరిచాడని భారత బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ వ్యాఖ్యానించాడు. అతను పది బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి ఉంటే మరింత బాగుండేదని, అప్పుడే తాను సంతోషించి ఉండేవాడినని యువీ ట్వీట్ చేశాడు. ఈసారి పది బంతుల్లోనే అర్ధ శతకాన్ని సాధించాలని గేల్‌ను కోరాడు. అతను కాకపోతే ఆ ఫీట్‌ను సాధించే సత్తా ఎబి డివిలియర్స్‌కు ఉందని పేర్కొన్నాడు. బిగ్ బాష్‌లీగ్‌లో మెల్బోర్న్ రనెగెడ్స్ తరఫున ఆడుతున్న గేల్ సోమవారం అడెలైడ్ స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 12 బంతుల్లో 50 పరుగులు చేసి,యువీ రికార్డును సమం చేసిన విషయం తెలిసిందే. 2007 టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా డర్బర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై యువీ రికార్డు హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. తన రికార్డును గేల్ సమం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూనే, ఇంకా తక్కువ బంతుల్లో అతను ఈ ఫీట్‌ను సాధించివుంటే మరింత ఆనందించేవాడినని యువీ వ్యాఖ్యానించాడు.

ఆస్ట్రేలియా లక్ష్యం ‘క్లీన్‌స్వీప్’

కాన్‌బెరా, జనవరి 19: భారత్‌తో బుధవారం జరిగే నాలుగో వనే్డలోనూ విజయమే లక్ష్యంగా ఆస్ట్రేలియా బరిలోకి దిగనుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా ఇప్పటికే 3-0 తేడాతో కైవసం చేసుకొని, ఇప్పుడు ‘క్లీన్‌స్వీప్’పై కనే్నసింది. మంగళవారం నాటి ప్రాక్టీస్ సెషన్‌లో ఆ జట్టు ఆటగాళ్లలో ఎలాంటి ఒత్తిడిగానీ, ఉత్కంఠగానీ కనిపించలేదు. భారత శిబిరం అందుకు పూర్తి భిన్నంగా కనిపించింది. వరుసగా మూడు మ్యాచ్‌లను కోల్పోయి, సిరీస్‌ను చేజార్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని టీమిండియా మిగతా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి పరువును కొంతవరకైనా కాపాడుకోవాలని అనుకుంటున్నది. అయితే, బౌలర్లు ఎంత వరకు రాణిస్తారనే అంశంపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. మ్యాచ్ జరిగేమనూకా ఓవల్ మైదానంలో భారత్ గతంలో ఒకే ఒక మ్యాచ్ ఆడింది. 2007-08 సీజన్‌లో సిబి సిరీస్‌లో భాగంగా శ్రీలంకను ఢీకొని ఓటమిపాలైంది. అప్పట్లో ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత జట్టులో సచిన్ తెండూల్కర్, వీరేందర్ సెవాగ్, గౌతం గంభీర్ వంటి మేటి ఆటగాళ్లు ఉన్నారు. ఆ టూర్‌లో ఆడి, ఇంకా జట్టులో కొనసాగుతున్నది ధోనీ, రోహిత్ శర్మ, ఇశాంత్ శర్మ మాత్రమే. రోహిత్, ఇశాంత్‌లకు అది తమతమ కెరీర్‌లో మొట్టమొదటి ఆస్ట్రేలియా టూర్. ఆ ఇద్దరూ టీమిండియాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా, ప్రస్తుత జట్టులో మనీష్ పాండే, గుర్‌కీరత్ సింగ్ మాన్, రిషీ ధావన్ ఆస్ట్రేలియా పర్యటించడం ఇదే మొదటిసారి. భవిష్యత్తులో వీరు టీమిండియాలో సుస్థిర స్థానాన్ని సంపాదించే అవకాశాలున్నాయి.
ఎవరికి విశ్రాంతి?
మూడో వనే్డలో ఆడిన తుది 11 మంది ఆటగాళ్ల నుంచి నాలుగో మ్యాచ్‌లో ఎవరికి విశ్రాంతినిస్తారన్నది ఆసక్తిని రేపుతున్నది. జట్టులో మార్పులను కెప్టెన్ ధోనీ ఇష్టపడడు. ఫామ్‌లోలేని శిఖర్ ధావన్ మెల్బోర్న్ మ్యాచ్‌లో అర్ధ శతకం సాధించాడు. గత ఎనిమిది వనే్డల్లో ఇది అతనికి రెండో హాఫ్ సెంచరీ. మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడని ధావన్‌పై ముద్రవేసి, చివరి రెండు వనే్డల్లోనూ ధోనీ అతనిని ఆడించడం ఖాయంగా కనిపిస్తున్నది. కీలక ఆటగాళ్లను తొలగించి ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ సుముఖత వ్యక్తం చేయని ధోనీ మరోసారి అదే సిద్ధాంతాన్ని అనుసరించే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో గుర్‌కీరత్ సింగ్ మాన్, మనీష్ పాండే మధ్య తుది జట్టులో స్థానం కోసం పోటీ ఉండవచ్చని అంటున్నారు.
అశ్విన్ ఖాయం!
రాబోయే మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌ను దృష్టిలో ఉంచుకొని అశ్విన్‌తో చివరి రెండు వనే్డలు ఆడించడం ఖాయంగా కనిపిస్తున్నది. జట్టు డైరెక్టర్, భారత మాజీ కెప్టెన్ రవి శాస్ర్తీ ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. రవీంద్ర జడేజాను కూడా కొనసాగించి, గత మూడు మ్యాచ్‌ల్లో మాదిరిగానే ఈసారి కూడా ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్ల వ్యూహాన్ని ధోనీ అమలు చేస్తాడని అంటున్నారు. యువ పేసర్ బరీందర్ శరణ్ మెల్బోర్న్ వనే్డలో బాగా అలసిపోయినట్టు కనిపించాడు. శ్రీలంక టూర్‌కు వెళ్లిన నాటి నుంచి ఉమేష్ యాదవ్ అవిశ్రాంతంగా మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో భువనేశ్వర్ కుమార్‌కు మరో అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. అయితే, బౌలింగ్ విభాగంపై వెల్లువెత్తుతున్న విమర్శల నుంచి తప్పించుకోవడానికి ధోనీ ఏం చేస్తాడన్నది ఆసక్తిని రేపుతున్నది. తుది జట్టులోకి ఎవరిని తీసుకుంటారన్నది తేలకపోయినా, ధోనీ అనుసరించే విధానాలను తెలిసిన వారు మాత్రం భారీగా మార్పులు ఉండవని అంటున్నారు. ఒకటిరెండు మార్పులు చేస్తే చాలా గొప్పేనని వ్యాఖ్యానిస్తున్నారు. మార్పులు చేయకూడదన్న సెంటిమెంట్‌కు వరుసగా మూడు మ్యాచ్‌లను కోల్పోవడంతోనే తెరపడింది. ధోనీ ఇంకా అదే విధానాన్ని అనుసరిస్తాడా లేక కొత్త పుంతలు తొక్కుతాడా అన్నది చూడాలి.

(్భరత కాలమానం ప్రకారం
మ్యాచ్ బుధవారం ఉదయం 8.50 గంటలకు మొదలవుతుంది).

ఫాల్క్‌నెర్ నోరు మూయించా!

మెల్బోర్న్, జనవరి 19: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఫాల్క్‌నెర్‌కు సరైన సమాధానం చెప్పి నోరు మూయించానని భారత టెస్టు జట్టు కెప్టెన్, యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ అన్నాడు. మంగళవారం అతను విలేఖరులతో మాట్లాడుతూ, ఆస్ట్రేలియా స్లెడ్జింగ్‌కు గట్టి సమాధానం చెప్పే సత్తా తమకు ఉందని వ్యాఖ్యానించాడు. మైదానంలో దూకుడుగా వ్యవహరించే క్రికెటర్లలో కోహ్లీ ఒకడు. సహజంగా ప్రత్యర్థి ఆటగాళ్లను హేళన చేసి, వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నానికి భారత క్రికెటర్లు పూనుకోరు. అయితే, నిన్నమొన్నటి వరకూ ప్రత్యర్థులు స్లెడ్జింగ్‌కు పాల్పడినా భారత క్రికెటర్లు నోరుమెదిపేవారు కారు. కానీ, టీమిండియాలోకి కోహ్లీ అడుగుపెట్టిన తర్వాత పరిస్థితి మారింది. మాటకుమాట బదులు ఇవ్వడాన్ని భారత క్రికెటర్లు కూడా మొదలుపెట్టారు. ఈ విషయంలో కోహ్లీనే భారత ఆటగాళ్లందరికీ మార్గదర్శకుడు. ఆదివారం జరిగిన మూడో వనే్డ, 35వ ఓవర్‌లో కోహ్లీ, ఆసీస్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఫాల్క్‌నెర్ మధ్య జరిగిన సంభాషణ స్టంప్స్‌లోని మైక్రోఫోన్ ద్వారా బట్టబయలైంది. ఒక సింగిల్ తీసుకున్న కోహ్లీని బౌలింగ్ రన్నప్ కోసం వెళుతున్న ఫాల్క్‌నెర్ వెక్కించాడు. ‘నువ్వు మా బౌలింగ్‌ను ఎదుర్కోలేవు. మ్యాచ్‌లో ఓటమి ఖాయం’ అన్నాడు. కోహ్లీ వెంటనే స్పందిస్తూ ‘నిన్ను చాలా సందర్భాల్లో చావుదెబ్బ కొట్టాను. నీ బౌలింగ్‌ను ఉతికి ఆరేశాను గుర్తులేదా’ అంటూ సమాధానమిచ్చాడు. మెరుపు వేగంతో దూసుకొచ్చిన ఆ సమాధానంతో ఫాల్క్‌నెర్ మరో మాట మాట్లాడడానికి సాహసించలేదు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, ఫాల్క్‌నెర్‌సహా ఎవరు సెడ్జింగ్‌కు పాల్పడినా ఇదే విధంగా సమాధానం చెప్తామని అన్నాడు.
నన్ను చూసి నవ్వుకుంటారు!
తాను బౌలింగ్ చేయడానికి వచ్చినప్పుడల్లా ప్రేక్షకులు తనను చూసి నవ్వుకుంటారని కోహ్లీ అన్నాడు. ఈ విషయం తనకు తెలుసని చెప్పాడు. తన బౌలింగ్ యాక్షన్ ఏమాత్రం బాగుండదని, అందుకే, తాను బంతులు వేస్తున్నప్పుడు ప్రేక్షకులు నవ్వుతూ కేరింతలు కొడుతుంటారని అన్నాడు. కానీ, తాను మాత్రం తనకు అప్పచెప్పిన బాధ్యతను ఎంతో శ్రద్ధగా నిర్వర్తిస్తానని చెప్పాడు. ఒక ప్రశ్నపై స్పందిస్తూ తాను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని అన్నాడు. ఆటను గాడిలో పెట్టుకునేందుకు ఇప్పటికీ ప్రయత్నిస్తున్నానని తెలిపాడు.

టోర్నీపై డేగ కన్ను!
మెల్బోర్న్, జనవరి 19: ఆస్ట్రేలియన్ ఓపెన్‌పై పోలీసు శాఖ, భద్రతా విభాగం, ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహణ కమిటీ, మీడియా డేగ కన్ను వేశాయి. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా విడిచిపెట్టడం లేదు. ఆటగాళ్ల ప్రతి కదలికనూ పరిశీలిస్తున్నాయి. తాము స్వేచ్ఛగా ఉండలేకపోతున్నామని ఆటగాళ్లు వాపోతున్నా తమ బాధను బహిర్గతం చేయలేకపోతున్నారు. టెన్నిస్‌లో దశాబ్దకాలంగా మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతున్నదని, 16 మంది అనుమానితులు ఉండగా, వారిలో ఎనిమిది మంది ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడుతున్నారని బిబిసి, బజ్‌ఫీడ్ నివేదిక స్పష్టం చేయడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మీడియాతోపాటు అధికారులు కూడా ఆ ఎనిమిది మంది ఎవరో తెలుసునే ప్రయత్నంలో పడ్డారు. క్రీడాకారులు బస చేస్తున్న హోటళ్ల నుంచి వారు ప్రాక్టీస్ చేసుకునే కోర్టుల వరకూ ప్రతి అణువునూ మీడియా జల్లెడపడుతున్నది. ఎవరినీ వదలకుండా, అందరి కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నది. ఈ వ్యవహారం ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.