క్రీడాభూమి

రాహుల్ చేజారిన డబుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 18: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి, ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ ఎదురుదాడికి దిగింది. లోకేష్ రాహుల్ దురదృష్టవశాత్తు కేవలం ఒక పరుగు తేడాతో డబుల్ సెంచరీని చేజార్చుకున్నప్పటికీ, భారత్‌ను పటిష్టమైన స్థితిలో నిలబెట్టాడు. పార్థీవ్ పటేల్, కరుణ్ నాయర్ కూడా అర్ధ శతకాలతో రాణించడంతో, మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా నాలుగు వికెట్లకు 391 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 477 పరుగుల భారీ స్కోరు సాధించగా, అందుకు సమాధానంగా మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టం లేకుండా 60 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం ఉదయం ఆటను కొనసాగించిన ఓపెనర్లు రాహుల్, పార్థీవ్ జట్టు స్కోరును 150 పరుగుల మైలురాయిని దాంటించారు. 112 బంతులు ఎదుర్కొని, ఏడు ఫోర్ల సాయంతో 71 పరుగులు చేసిన పార్థీవ్‌ను జొస్ బట్లర్ క్యాచ్ అందుకోగా మోయిన్ అలీ అవుట్ చేయడంతో, 152 పరుగుల వద్ద భారత్ మొదటి వికెట్‌ను కోల్పోయింది. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన చటేశ్వర్ పుజారా 16 పరుగులు చేసి, బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో అలస్టర్ కుక్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. అతను 29 బంతులు ఎదుర్కొని, ఒక ఫోర్ సాయంతో 15 పరుగులు చేసి స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో కీటన్ జెన్నింగ్స్‌కు చిక్కాడు. అనంతరం కరుణ్ నాయర్‌తో కలిసి భారత్ భారీ స్కోరుకు బలమైన పునాది వేసిన రాహుల్ డబుల్ సెంచరీకి ఒక పరుగు దూరంలో ఉండగా, అదిల్ రషీద్ బౌలింగ్‌లో జొస్ బట్లర్ చక్కటి క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. అతను 311 బంతుల్లో 199 పరుగులు చేశాడు. ఇందులో 16 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. గాయం కారణంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించలేకపోయిన మురళీ విజయ్ ఫోర్త్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగి, 31 బంతుల్లో 17 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. మరోవైపు కరుణ్ నాయర్ 71 పరుగులతో (136 బంతులు, ఆరు ఫోర్లు) క్రీజ్‌లో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్, మోయిన్ అలీ, అదిల్ రషీద్ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు కంటే భారత్ ఇంకా 86 పరుగులు వెనుకంజలో ఉంది. చేతిలో ఆరు వికెట్లు పదిలంగా ఉన్నాయి.
స్కోరుబోర్డు
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్: 157.2 ఓవర్లలో 477 ఆలౌట్ (జో రూట్ 88, మోయిన్ అలీ 146, జానీ బెయిర్‌స్టో 49, లియామ్ డాసన్ 66 నాటౌట్, అదిల్ రషీద్ 60, ఉమేష్ యాదవ్ 2/73, ఇశాంత్ శర్మ 2/42, రవీంద్ర జడేజా 3/106).
భారత్ మొదటి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు వికెట్ నష్టం లేకుండా 60): లోకేష్ రాహుల్ సి జొస్ బట్లర్ బి అదిల్ రషీద్ 199, పార్థీవ్ పటేల్ సి జొస్ బట్లర్ బి మోయిన్ అలీ 71, చటేశ్వర్ పుజారా సి అలస్టర్ కుక్ బి బెన్ స్టోక్స్ 16, విరాట్ కోహ్లీ సి కీటన్ జెన్నింగ్స్ బి స్టువర్ట్ బ్రాడ్ 15, కరుణ్ నాయర్ 71 బ్యాటింగ్, మురళీ విజయ్ 17 బ్యాటింగ్, ఎక్‌స్ట్రాలు 2, మొత్తం (108 ఓవర్లలో 4 వికెట్లకు) 391.
వికెట్ల పతనం: 1-152, 2-181, 3-211, 4-372.
బౌలింగ్: స్టువర్ట్ బ్రాడ్ 18-4-46-1, జాక్ బాల్ 15-1-50-0, మోయిన్ అలీ 24-1-96-1, బెన్ స్టోక్స్ 9-1-37-1, అదిల్ రషీద్ 17-0-76-0, లియామ్ డాసన్ 23-3-72-0, జో రూట్ 2-0-12-0.

చిత్రం..డబుల్ సెంచరీని ఒక పరుగు తేడాతో చేజార్చుకున్న లోకేష్ రాహుల్ ఆవేదన