క్రీడాభూమి

ధావన్, కోహ్లీ శతకాలు వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్‌బెరా, జనవరి 20: విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ శతకాలు వృథా అయ్యాయి. ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన నాలుగో వనే్డలో టాప్ ఆర్డర్ రాణించినప్పటికీ మిడిల్ ఆర్డర్ వైఫల్యం కారణంగా టీమిండియా 25 పరుగుల తేడాతో ఓటమిని కొనితెచ్చుకుంది. అంతకు ముందు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. ఫలితంగా ఆ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 348 పరుగులు సాధించింది. లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన భారత్ 49.2 ఓవర్లలో 323 పరుగులకు ఆలౌటైంది. ఐదు వికెట్లు పడగొట్టి, టీమిండియాను దెబ్బతీసిన ఆసీస్ బౌలర్ కేన్ విలియమ్‌సన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఐదు మ్యాచ్‌ల ఈ వనే్డ సిరీస్‌లో ఆస్ట్రేలియా 4-0 ఆధిక్యాన్ని సంపాదించి, క్లీన్‌స్వీప్ దిశగా మరో అడుగు ముందుకేసింది. 23న సిడ్నీలో జరిగే చివరి, ఐదో వనే్డను గెల్చుకోకపోతే భారత్‌కు 0-5 తేడాతో వైట్‌వాష్ తప్పదు. మొదటి మూడు వనే్డల్లో తొలుత బ్యాటింగ్ చేసిన కారణంగానే భారత్ విజయాలను సాధించలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే, నాలుగో వనే్డలో లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలబడింది. లక్ష్యాన్ని నిర్దేశించడంలోనేకాదు, ఛేదించడంలోనూ ధోనీ నాయకత్వంలోని భారత్ సఫలం కాలేదు.
శుభారంభం: టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ శుభారంభాన్నిచ్చారు. భారత బౌలర్లను ఏ మాత్రం లక్ష్యపెట్టకుండా పరుగుల వరద పారించారు. కెరీర్‌లో ఐదో శతకాన్ని సాధించే అవకాశాన్ని కేవలం ఏడు పరుగుల తేడాతో చేజార్చుకున్న వార్నర్ 92 బంతుల్లో 93 పరుగులు చేసి, ఇశాంత్ శర్మ బంతిని అర్థం చేసుకోలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన మిచెల్ మార్ష్‌తో కలిసి ఆరోన్ ఫించ్ స్కోరును 200 పరుగుల మైలురాయిని దాటించాడు. ఈ క్రమంలోనే ఏడో వనే్డ శతకాన్ని నమోదు చేసిన అతను 107 బంతులు ఎదుర్కొని, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లతో 107 పరుగులు చేసి, ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో ఇశాంత్ శర్మ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. మిచెల్ మార్ష్ 42 బంతుల్లో 33 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి చిక్కగా, కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 29 బంతుల్లోనే 51 పరుగులు సాధించి ఇశాంత్ శర్మ బౌలింగ్‌లో గుర్‌కీరత్ సింగ్ మాన్ క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. అతని స్కోరులో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. జార్జి బెయిలీ 10 పరుగులకే అవుట్‌కాగా, ఓవర్లు ముగింపు దశకు చేరడంతో, పరుగులు రాబట్టేందుకు వేగాన్ని పెంచే ప్రయత్నంలో విఫలమైన జేమ్స్ ఫాల్క్‌నెర్, మాథ్యూ వేడ్ డకౌటయ్యారు. ఇన్నింగ్స్ చివరి బంతికి అవుటైన గ్లేన్ మాక్స్‌వెల్ 20 బంతుల్లోనే ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 41 పరుగులు సాధించాడు. జాన్ హాస్టింగ్స్‌కు ఒక్క బంతిని ఎదుర్కొనే అవకాశం కూడా రాలేదు. భారత బౌలర్లలో ఇశాంత్ శర్మ 77 పరుగులకు నాలుగు, ఉమేష్ యాదవ్ 67 పరుగులకు మూడు చొప్పున వికెట్లు పడగొట్టారు.
టాప్ ఆర్డర్ భేష్: ఆస్ట్రేలియాను ఓడించి, క్లీన్‌స్వీప్ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి 349 పరుగులు సాధించాల్సిన స్థితిలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ప్రాణం పోశారు. 25 బంతుల్లోనే 41 పరుగులు చేసి, భారీ స్కోరు దిశగా దూసుకెళుతున్న రోహిత్ శర్మను కేన్ రిచర్డ్‌సన్ అవుట్ చేశాడు. వికెట్‌కీపర్ మాథ్యూ వేడ్ క్యాచ్ పట్టగా అవుటయైన రోహిత్ స్కోరులో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. తొలి వికెట్ 65 పరుగుల వద్ద కూలగా, ఊపుమీద ఉన్న శిఖర్ ధావన్‌కు స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ జత కలిశాడు. వీరిద్దరూ ఆస్ట్రేలియా బౌలింగ్‌పై విరుచుకుపడి పరుగులు రాబట్టడంతో టీమిండియా స్కోరు వేగంగా ముందుకు దూసుకెళ్లింది. ఒకానొక దశలో కేవలం ఒక వికెట్ నష్టానికి 277 పరుగులు చేసిన భారత్ విజయం సాధించడం ఖాయంగా కనిపించింది. కానీ, 113 బంతులు ఎదుర్కొని, 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 126 పరుగులు చేసిన శిఖర్ ధావన్‌ను జార్జి బెయిలీ క్యాచ్ అందుకోగా జాన్ హాస్టింగ్స్ అవుట్ చేయడంతో భారత్ పతనం ఆరంభమైంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మూడు బంతులు ఎదుర్కొని, ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగాడు. కోహ్లీ 92 బంతుల్లో 106 పరుగులు (11 ఫోర్లు, ఒక సిక్సర్) చేసి కేన్ రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో స్టీవెన్ స్మిత్ క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. రవీంద్ర జడేజా (24 నాటౌట్) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ కనీసం రెండంకెల స్కోరుకు కూడా చేరులేకపోవడంతో భారత్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగా, 323 పరుగుల వద్ద ఆలౌటైంది. 68 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టిన కేన్ రిచర్డ్‌సన్ భారత ఇన్నింగ్స్‌ను దారుణంగా దెబ్బతీశాడు. జాన్ హాస్టింగ్స్, మిచెల్ మార్ష్ చెరి రెండు వికెట్లు సాధించారు.

స్కోరుబోర్డు

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ బి ఇశాంత్ శర్మ 93, ఆరోన్ ఫించ్ సి ఇశాంత్ శర్మ బి ఉమేష్ యాదవ్ 107, మిచెల్ మార్ష్ సి విరాట్ కోహ్లీ బి ఉమేష్ యాదవ్ 33, స్టీవెన్ స్మిత్ సి గుర్‌కీరత్ సింగ్ మాన్ బి ఇశాంత్ శర్మ 51, గ్లేన్ మాక్స్‌వెల్ సి సబ్‌స్టిట్యూట్ (మనీష్ పాండే) బి ఇశాంత్ శర్మ 41, జార్జి బెయిలీ సి రోహిత్ శర్మ బి ఇశాంత్ శర్మ 10, జేమ్స్ ఫాల్క్‌నెర్ బి ఉమేష్ యాదవ్ 0, మాథ్యూ వేడ్ రనౌట్ 0, జాన్ హాస్టింగ్స్ నాటౌట్ 0, ఎక్‌స్ట్రాలు 13, మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 348.
వికెట్ల పతనం: 1-187, 2-221, 3-288, 4-298, 5-319, 6-319, 7-321, 8-348.
బౌలింగ్: ఉమేష్ యాదవ్ 10-1-67-3, భువనేశ్వర్ కుమార్ 8-0-69-0, ఇశాంత్ శర్మ 10-0-77-4, గుర్‌కీరత్ సింగ్ మాన్ 3-0-24-0, రిషీ ధావన్ 9-0-53-0, రవీంద్ర జడేజా 10-0-51-0.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ సి వేడ్ బి కేన్ రిచర్డ్‌సన్ 41, శిఖర్ ధావన్ సి జార్చి బెయిలీ బి జాన్ హాస్టింగ్స్ 126, విరాట్ కోహ్లీ సి స్టీవెన్ స్మిత్ బి కేన్ రిచర్డ్‌సన్ 106, మహేంద్ర సింగ్ ధోనీ సి మాథ్యూ వేడ్ బి జాన్ హాస్టింగ్స్ 0, గుర్‌కీతర్ సింగ్ మాన్ సి సబ్‌స్టిట్యూట్ (షాన్ మార్ష్) బి నాథన్ లియాన్ 5, రవీంద్ర జడేజా నాటౌట్ 34, ఆజింక్య రహానే సి స్టీవెన్ స్మిత్ బి కేన్ రిచర్డ్‌సన్ 2, రిషీ ధావన్ సి డేవిడ్ వార్నర్ బి కేన్ రిచర్డ్‌సన్ 9, భువనేశ్వర్ కుమార్ సి స్టీవెన్ స్మిత్ బి కేన్ రిచర్డ్‌సన్ 2, ఉమేష్ యాదవ్ సి జార్జి బెయిలీ బి మిచెల్ మార్ష్ 2, ఇశాంత్ శర్మ సి మాథ్యూ వేడ్ బి మిచెల్ మార్ష్ 0, ఎక్‌స్ట్రాలు 6, మొత్తం (49.2 ఓవర్లలో ఆలౌట్) 323.
వికెట్ల పతనం: 1-65, 2-277, 3-277, 4-278, 5-286, 6-294, 7-308, 8-311, 9-315, 10-323.
బౌలింగ్: నాథన్ లియాన్ 10-0-76-1, కేన్ రిచర్డ్‌సన్ 10-1-68-5, జేమ్స్ హాస్టింగ్స్ 10-0-50-2, జేమ్స్ ఫాల్క్‌నెర్ 7-0-48-0, మిచెల్ మార్ష్ 9.2-0-55-2, గ్లేన్ మాక్స్‌వెల్ 1-0-10-0, స్టీవెన్ స్మిత్ 2-0-16-0.