క్రీడాభూమి

జడేజా బౌలింగ్‌కు చివరి టెస్టులోనూ విరాట్ సేన సంచలన విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 20: ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు క్రికెట్ సిరీస్‌ను భారత జట్టు అత్యద్భుతమైన రీతిలో ఎంతో ఘనంగా ముగించింది. చెన్నైలో జరిగిన చివరి టెస్టులో ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించి మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్న భారత జట్టు 4-0 తేడాతో ఈ సిరీస్‌ను కైవసం చేసుకుంది. గత కొంత కాలం నుంచి అప్రతిహతంగా ముందుకు సాగుతున్న భారత జట్టుకు ఈ ఏడాది ఇది తొమ్మిదో విజయం. దీంతో వరుస విజయాల సంఖ్యను 18కి పెంచుకుని పాత రికార్డులను తిరగ రాసిన భారత జట్టుకు ఇంగ్లాండ్‌పై ఇదే అతిపెద్ద సిరీస్ విజయం. అంతకుముందు 1992-93 సీజన్‌లో మహమ్మద్ అజారుద్దీన్ నేతృత్వంలోని జట్టు 3-0 తేడాతో సాధించిన విజయమే ఇంగ్లాండ్‌పై భారత్‌కు అతిపెద్ద విజయంగా ఉండేది. అయితే చెన్నైలో మంగళవారం 48 పరుగులకే 7 వికెట్లు కైవసం చేసుకుని కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసుకోవడంతో పాటు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించిన స్పిన్నర్ రవీంద్ర జడేజా చివరి రోజు హీరోగా నిలిచాడు. అయితే అంతకుముందు టీమిండియా ఆడిన ఒకే ఒక్క ఇన్నింగ్స్‌లో ట్రిపుల్ సెంచరీతో సత్తా చాటుకుని జట్టు విజయానికి గట్టి పునాది వేసిన యువ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కైవసం చేసుకోగా, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు కోహ్లీని వరించింది.
అంతకుముందు 12 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టు మధ్యాహ్నం వరకు భారత బౌలర్లను బాగానే ప్రతిఘటించి భోజన విరామ సమయం వరకు ఒక్క వికెట్‌ను కూడా కోల్పోలేదు. అయితే ఆ తర్వాత ఎంతో పదునైన బౌలింగ్‌తో సత్తా చాటుకున్న రవీంద్ర జడేజా ఇంగ్లాండ్ కెప్టెన్ ఆలిస్టర్ కుక్ (49)తో పాటు నాన్‌స్ట్రైకింగ్ బ్యాట్స్‌మన్ కీటన్ జెన్నింగ్స్ (54), ఫస్ట్ డౌన్ బ్యాట్స్‌మన్ జో రూట్ (6) వికెట్లను కైవసం చేసుకోగా, వికెట్‌కీపర్ జానీ బెయిర్‌స్టో (1) ఇశాంత్ శర్మ బౌలింగ్‌లో జడేజాకు దొరికిపోయాడు. దీంతో తేనీటి విరామ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 167 పరుగులు సాధించిన ఇంగ్లాండ్ జట్టు ఆ తర్వాత కూడా కొద్దిసేపు బాగానే ప్రతిఘటించినప్పటికీ కేవలం 15 పరుగుల వ్యవధిలోనే చివరి ఆరు వికెట్లను చేజార్చుకుంది. తేనీటి విరామం తర్వాత రవీంద్ర జడేజా మరోసారి విజృంభించిన రవీంద్ర జడేజా ప్రత్యర్థుల భరతం పట్టాడు. అతని జోరును ప్రతిఘటించలేక సెకెండ్ డౌన్ బ్యాట్స్‌మన్ మొయిన్ అలీ (44)తో పాటు బెన్ స్టోక్స్ (23) నిష్క్రమించగా, లియామ్ డాసన్ (0)ను అమిత్ మిశ్రా, ఆదిల్ రషీద్ (2)ను ఉమేష్ యాదవ్ పెవిలియన్‌కు చేర్చారు. దీంతో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు సాధించిన ఇంగ్లాండ్ జట్టు కేవలం 7 పరుగులకే చివరి రెండు వికెట్లు కూడా కోల్పోయింది. టెయిలెండర్లు స్టూవర్ట్ బ్రాడ్ (1), జాక్ బాల్ (0)లను రవీంద్ర జడేజా పెవిలియన్‌కు పంపి మిగిలిన పని పూర్తి చేయగా, అప్పటికి మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ 6 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లు ఆడి 207 పరుగులకు ఆలౌటైన ఇంగ్లాండ్ జట్టు ఈసారి ఏకంగా ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.
స్కోరుబోర్డు
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 477 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్: 759/7 డిక్లేర్డ్
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: ఆలిస్టర్ కుక్ సి లోకేష్ రాహుల్ బి రవీంద్ర జడేజా 49, కీటన్ జెన్నింగ్స్ సిఅండ్‌బి రవీంద్ర జడేజా 54, జో రూట్ ఎల్‌బిడబ్ల్యు బి రవీంద్ర జడేజా 6, మొయిన్ అలీ సి రవిచంద్రన్ అశ్విన్ బి రవీంద్ర జడేజా 44, జానీ బెయిర్‌స్టో సి రవీంద్ర జడేజా బి ఇశాంత్ శర్మ 1, బెన్ స్టోక్స్ సి కరుణ్ నాయర్ బి రవీంద్ర జడేజా 23, జోస్ బట్లర్ నాటౌట్ 6, లియామ్ డాసన్ బి అమిత్ మిశ్రా 0, ఆదిల్ రషీద్ సి రవీంద్ర జడేజా బి ఉమేష్ యాదవ్ 2, స్టూవర్ట్ బ్రాడ్ సి చటేశ్వర్ పుజారా బి రవీంద్ర జడేజా 1, జాక్ బాల్ సి కరుణ్ నాయర్ బి రవీంద్ర జడేజా 0, ఎక్స్‌ట్రాలు: (బైస్ 12, లెగ్‌బైస్ 8, వైడ్ 1) 19, మొత్తం: 88 ఓవర్లలో 207 ఆలౌట్.
వికెట్ల పతనం: 1-103, 2-110, 3-126, 4-129, 5-192, 6-193, 7-196, 8-200, 9-207, 10-207.
బౌలింగ్: ఇశాంత్ శర్మ 10-2-17-1, రవిచంద్రన్ అశ్విన్ 25-6-56-0, రవీంద్ర జడేజా 25-5-48-7, ఉమేష్ యాదవ్ 14-1-36-1, అమిత్ మిశ్రా 14-4-30-1.

చిత్రాలు..చెన్నైలోని చెపాక్ స్టేడియంలో టీమిండియా విజయోత్సాహం

ఇంగ్లాండ్ వెన్ను విరిచిన రవీంద్ర జడేజా (7/48)