క్రీడాభూమి

గుడ్‌బై ఫ్రెండ్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 21: అంతర్జాతీయ కెరీర్ నుంచి రిటైరవుతున్న ఆస్ట్రేలియా సీనియర్ టెన్నిస్ ఆటగాడు లేటన్ హెవిట్ గురువారం ఎంతో ఉద్వేగానికి గురయ్యాడు. కన్నీళ్ల పర్యంతమవుతూ అభిమానులకు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో డేవిడ్ ఫెరర్‌తో చివరి వరకూ పోరాటం సాగించి, 6-2, 6-4, 6-4 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. మ్యాచ్ మధ్యలో చైర్ అంపైర్‌పై అతను తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నవంటూ అసభ్య పదజాలంతో దూషించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత అతను తన పిల్లలు మియా రెబెకా, అవా సిడ్నీ, క్రజ్‌లతో కలిసి మెల్బోర్స్‌లోని ప్రతిష్ఠాత్మక రాడ్ లెవర్ కోర్టులో నలువైపులా తిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేశాడు. తాను అంతర్జాతీయ టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించాడు. ఇక ఈ టోర్నీలో ఆడబోనని చెప్తున్నప్పుడు అతను కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆస్ట్రేలియా జాతీయ పతాకాన్ని పోలిన రంగులతో కూడిన జెర్సీని వేసుకొని, అందరికీ అభివాదం చేస్తూ కోర్టు నుంచి నిష్క్రమిస్తున్నప్పుడు, స్టాండ్స్ నుంచి అతని భార్య రెబెకా హెవిట్ అతనినే తిలకిస్తూ రోదించింది. ఎంతో దూడుడుగా ఆడే అలవాటున్న హెవిట్ 2001లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను అందుకున్నప్పుడు అతని వయసు కేవలం 20 సంవత్సరాలు. ఈ స్థాయికి చేరిన అత్యంత పిన్న వయస్కుడిగా ఇప్పటికీ రికార్డు అతని పేరిటే ఉంది. పురుషుల సింగిల్స్‌లో అతను రెండు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను (2001 యుఎస్ ఓపెన్, 2002 వింబుల్డన్) కైవసం చేసుకున్నాడు. డబుల్స్ విభాగంలో మరో టైటిల్ అతని ఖాతాలో ఉంది. ఇప్పుడు ఎటిపి టూర్ ఫైనల్స్‌గా పేర్కొనే ఒకప్పటి టెన్నిస్ మాస్టర్స్ కప్‌ను వరుసగా రెండుసార్లు గెల్చుకున్నాడు. 1999, 2003 సంవత్సరాల్లో ఆస్ట్రేలియా డేవిస్ కప్‌ను సాధించినప్పుడు హెవిట్ ఆ జట్టులో సభ్యుడు. దేశంలో టెన్నిస్‌కు కేంద్ర బిందువుగా మారిన హెవిట్ రిటైర్మెంట్ ప్రకటించడంతో, అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం ఆస్ట్రేలియాకు వెతుకులాట తప్పదు. అది సులభ సాద్యం కూడా కాదు.

‘సాన్‌టినా’ బోణీ
మెల్బోర్న్, జనవరి 21: ఆస్ట్రేలియా ఓపెన్‌లో సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడీ శుభారంభం చేసింది. మహిళల డబుల్స్‌లో గురువారం జరిగిన మొదటి రౌండ్ మ్యాచ్‌లో వీరు మరియానా డక్ మారినో, తెలియానా పెరెరా జోడీపై 6-2, 6-3 తేడాతో సునాయాసంగా విజయం సాధించారు. ‘సాన్‌టినా’గా పేరుపొందిన ఈజోడీకి ఇది వరుసగా 31వ విజయం. మ్యాచ్ ఆరంభం నుంచే ఆధిపత్యాన్ని కనబరచిన సాన్‌టినా చివరి వరకూ అదే ఒరవడిని కొనసాగించడం విశేషం. రెండో రౌండ్‌లో వీరు నదియా కిచెనొక్, లుడ్మిలా కిచెనొక్ జోడీని ఢీ కొంటుంది.
పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌లో ఒమర్ జసికా, నిక్ కిర్గియోస్ జోడీతో తలపడిన రోహన్ బొపన్న (్భరత్), ఫ్లోరియన్ మెర్గియా (రుమేనియా) 7-5, 6-3 ఆధిక్యంతో విజయాన్ని నమోదు చేశారు. గిలేస్ ముల్లర్ భాగస్వామిగా ఆడిన వెటరన్ క్రీడాకారుడు లియాండర్ పేస్ మొదటి రౌండ్‌లోనే ఓటమిపాలై నిష్క్రమించిన విషయం తెలిసిందే.

హాకీ ఇండియా లీగ్
కళింగకు తొలి విజయం
భువనేశ్వర్, జనవరి 21: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో భాగంగా గురువారం దబాంగ్ ముంబయిని ఎదుర్కొన్న కళింగ లాన్సర్స్ జట్టు 4-2 తేడాతో గెలిచింది. మొదటి మ్యాచ్‌లో ఉత్తర ప్రదేశ్‌తో తలపడి పరాజయాన్ని ఎదుర్కొన్న కళింగ తొలి విజయాన్ని నమోదు చేయడంతో ఆడం డిక్సన్, గ్లేన్ టర్నర్ కీలక పాత్ర పోషించారు. ముంబయి ఆటగాడు ఫ్లోరియన్ ఫచ్ 35వ నిమిషంలో తొలి గోల్ చేసి తన జట్టును ఆధిక్యంలో నిలబెట్టినా ఫలితం లేకపోయింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు రక్షణాత్మక విధానాన్ని అనుసరించడంతో తొలి క్వార్టర్‌లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. రెండో క్వార్టర్‌లో ఫచ్ చేసిన గోల్‌తో అసలైన పోరు మొదలైంది. డిక్సన్ ఈక్వెలైజర్‌తో ఉత్కంఠ తీవ్రమైంది. ఆతర్వాత కళింగ ఆటగాళ్లు గోల్స్ కోసం చేసిన ప్రయత్నాలను ముంబయి గోల్‌కీపర్ డేవిడ్ హార్టే అడ్డుకున్నాడు. అదే విధంగా ముంబయి క్రీడాకారులు పలు మార్లు గోల్‌పోస్టుపై దాడులు చేసినప్పటికీ కళింగ గోల్‌కీపర్ ఆండ్రూ చార్టర్ వాటిని వమ్ము చేశాడు. ఈ సంకుల సమరంలో కొంత వరకు మెరుగ్గా ఆడిన కళింగ చివరికి విజేతగా నిలిచింది.

చివరి వనే్డకి మాక్స్‌వెల్ డౌటే!
కాన్‌బెరా, జనవరి 21: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లేన్ మాక్స్‌వెల్ భారత్‌తో శనివారం సిడ్నీలో జరిగే చివరి వనే్డ మ్యాచ్‌లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. మనుకా ఓవల్ మైదానంలో జరిగిన నాలుగో వనే్డలో ఆడుతున్నప్పుడు మాక్స్‌వెల్ కుడి మోకాలికి దెబ్బతగిలింది. ఇశాంత్ శర్మ వేసిన బంతి ప్యాడ్స్ పైభాగం నుంచి వేగంగా దూసుకొచ్చి మోకాలికి తగిలింది. అప్పుడు 13 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద బ్యాటింగ్ చేస్తున్న అతను ఆతర్వాత స్థిరంగా ఆడలేకపోయాడు. 20 బంతుల్లో 41 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆస్ట్రేలియా ఫీల్డింగ్‌కు వచ్చినప్పుడు అతను అవుట్‌ఫీల్డ్‌లో కాకుండా, పరిగెత్తాల్సిన అవసరం లేని విధంగా స్లిప్స్‌లో నిల్చున్నాడు. ఒక ఓవర్ బౌల్ చేసిన తర్వాత మోకాలి నొప్పి పెరగడంతో మైదానాన్ని విడిచివెళ్లిపోగా, సబ్‌స్టిట్యూట్ ఆటగాడిగా షాన్ మార్ష్ అతని స్థానాన్ని భర్తీ చేశాడు.

భారత కెప్టెన్‌గా ధోనీయే బెస్ట్
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీ కితాబు
సిడ్నీ, జనవరి 21: ఆస్ట్రేలియా చేతిలో నాలుగు వరుస పరాజయాలను ఎదుర్కొన్న తర్వాత సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న భారత వనే్డ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైక్ హస్సీ అండగా నిలిచాడు. తన దృష్టిలో ఇప్పటికీ ధోనీనే ఉత్తమ కెప్టెన్ అని అతను విలేఖరులతో మాట్లాడుతూ స్పష్టం చేశాడు. నాలుగో వనే్డలో టీమిండియా ఒకానొక దశలో ఒక వికెట్ నష్టానికే 277 పరుగులు చేసి పటిష్టమైన స్థితిలో ఉన్నప్పటికీ, 46 పరుగుల తేడాలోనే తొమ్మిది వికెట్లు కోల్పోవడం పలు విమర్శలకు తావిస్తున్నది. మూడు బంతులు ఎదుర్కొని డకౌటైన ధోనీ ఆతర్వాత విలేఖరులతో మాట్లాడుతూ తన వికెట్ అత్యంత కీలకంగా మారిందని వ్యాఖ్యానించాడు. భారత్ పరాజయానికి పూర్తి బాధ్యత తానే స్వీకరిస్తున్నట్టు చెప్పాడు. మీడియా కూడా ధోనీ వైఫల్యాలపై మండిపడింది. అయితే, హస్సీ మాత్రం అతని నాయకత్వ ప్రతిభను కొనియాడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోనీ కెప్టెన్సీలోనే హస్సీ ఆడాడు. అప్పటి అనుభవాలను అతను గుర్తుచేసుకుంటూ, భారత జట్టును నడిపించే సత్తా ధోనీకే ఉందన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంయమనం కోల్పోకుండా ఆడడం ధోనీ ప్రతిభకు నిదర్శనమని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా చేతిలో వరుసగా నాలుగు మ్యాచ్‌లు కోల్పోయినంత మాత్రాన అతని ప్రతిభను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని హస్సీ అన్నాడు. భారత జట్టు పూర్తిగా విఫలం కాలేదని, మూడు వందలకుపైగా పరుగులు సాధించడమే జట్టు బలానికి ప్రతీకని చెప్పాడు. బౌలింగ్ విభాగం గురించి ప్రస్తావిస్తూ, వ్యక్తిగతంగా తనకు భారత బౌలర్లపై ఎంతో గౌరవం ఉందని చెప్పాడు. ఇశాంత్ శర్మను సమర్థుడైన పేసర్‌గా అభివర్ణించాడు. ఉమేష్ యాదవ్ కూడా ప్రతిభావంతుడేనని అన్నాడు. కొన్ని లోటుపాట్లను సరిదిద్దుకుంటే భారత్‌ను ఓడించడం కష్టమని వ్యాఖ్యానించాడు.

500 మిలియన్ క్లబ్‌లో
బార్సిలోనాకు స్థానం
లండన్, జనవరి 21: స్పెయిన్ సాకర్ క్లబ్ బార్సిలోనా 500 మిలియన్ యూరోలను అధిగమించిన మూడో జట్టుగా అవతరించింది. మొత్తం 560 మిలియన్ యూరోలు (సుమారు 41.44 వేల కోట్ల రూపాయలు) టర్నోవర్‌తో ఈ జట్టు రెండో స్థానాన్ని ఆక్రమించింది. గతంలో రియల్ మాడ్రిడ్, మాంచెస్టర్ యనైటెడ్ మాత్రమే 500 మిలియన్ క్లబ్‌లో స్థానం సంపాదించుకోగా, బార్సిలోనా ఆ జాబితాలో చేరింది. రియల్ మాడ్రిడ్ 577 మిలియన్ యూరోలతో మొదటి స్థానంలో ఉండగా, మాంచెస్టర్ యునైటెడ్ 519.5 మిలియన్ యూరోలతో మూడో స్థానంలో ఉంది. లా లిగా, స్పానిష్ కప్, చాంపియ్స్ లీగ్ టైటిళ్లను కైవసం చేసుకున్న బార్సిలోనా జట్టులో లియోనెల్ మెస్సీ, నేమార్, లూయిస్ సౌరెజ్ వంటి ప్రపంచ మేటి ఆటగాళ్లు ఉన్నారు. బార్సిలోనా ఆడే మ్యాచ్‌లకు ప్రేక్షకులు వెల్లువెత్తుతుండడంతో స్పాన్సర్‌షిప్స్ నుంచి అండార్స్‌మెంట్స్ వరకూ వివిధ రూపాల్లో ఆ జట్టుకు ధన ప్రవాహం కొనసాగుతున్నది. గత ఏడాది 500 మిలియన్ యూరోలకు చేరువలో ఉన్న ఈ ఫ్రాంచైజీ ఇప్పుడు ఆ మైలురాయిని చేరింది.

మరో రెండు అకాడెమీలకు
హెచ్‌ఐ సభ్యత్వం
న్యూఢిల్లీ, జనవరి 21: చండీగఢ్ హాకీ అకాడెమీ, ఎస్‌జిపిసి హాకీ అకాడెమీలకు హాకీ ఇండియా (హెచ్‌ఐ) సభ్యత్వం లభించింది. ఈరెండు అకామీల చేరికలో హెచ్‌ఐలో సభత్వంగల యూనిట్ల సంఖ్య 22కు పెరిగింది. చండీగఢ్ అధికారిణి డాక్టర్ సరితా మాలిక్ పర్యవేక్షణలో చండీగఢ్ హాకీ అకాడెమీ ఏర్పడింది. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం కావడంతో ఈ అకాడెమీ పర్యవేక్షణ బాధ్యత అక్కడి ప్రభుత్వమే చూసుకుంటుంది. కాగా, ఐదుగురు ఒలింపియన్లు హర్‌చరణ్ సింగ్, సురీందర్ సింగ్ సోధీ, అజిత్‌పాల్ సింగ్, పర్గాత్ సింగ్, రాజ్‌పాల్ సింగ్ కలిసి ఎస్‌జిపిసి హాకీ అకాడెమీని నెలకొల్పారు. 2013లో ఏర్పాటైన ఈ అకాడెమీకి బల్వీందర్ సింగ్ చీఫ్‌గా వ్యవహరిస్తున్నాడు. స్థాపించిన నాటి నుంచి జూనియర్ విభాగంలో పలు టోర్నీలను నిర్వహించిన ఎస్‌జిపిసికి హెచ్‌ఐలో సభ్యత్వాన్ని పొందడంతో సీనియర్స్ విభాగంలోనూ పోటీలను నిర్వహించే అవకాశం లభిస్తుంది. గతంలో ఉన్న భారత హాకీ సమాఖ్యను రద్దు చేసిన ప్రభుత్వం దానికి బదులుగా హాకీ ఇండియా (హెచ్‌ఐ)ని ఏర్పాటు చేసింది. అయతే, హాకీ సమాఖ్య కోర్టుకు వెళ్లి అనుమతి పొందడంతో, ఇప్పుడు రెండు హాకీ సమాఖ్యలు మన దేశంలో కొనసాగుతున్నాయ.

మలేసియా మాస్టర్స్ బాడ్మింటన్

సెమీస్‌కు సింధు, శ్రీకాంత్
పెనాంగ్ (మలేసియా), జనవరి 21: భారత టాప్ షట్లర్లు పివి సింధు, కిడాంబి శ్రీకాంత్ ఇక్కడ జరుగుతున్న మలేసియా మాస్టర్స్ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో తమతమ విభాగాల నుంచి సెమీ ఫైనల్స్ చేరారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో జపాన్‌కు చెందిన కవోరీ ఇమాబెపును ఢీకొన్న సింధు 21-13, 13-21, 21-14 స్కోరుతో విజయం సాధించింది. కవోరీపై ఆమెకు ఇది వరుసగా మూడో విజయం. ఫైనల్‌లో స్థానం కోసం ఆమె చైనాకు చెందిన హువాంగ్ యూజియాంగ్‌తో తలపడుతుంది. కాగా, పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ శ్రీకాంత్ 21-17, 21-10 తేడాతో వరుస సెట్లలో 16వ సీడ్ బూన్సాక్ పొన్సానాను ఓడించాడు. మరో మ్యాచ్‌లో అజయ్ జయరామ్ 11-21, 21-8, 22-20 స్కోరుతో స్థానిక ఆటగాడు జుల్ఫద్లి జుల్ఫికీపై అతి కష్టం మీద గెలుపొందాడు.
మహిళల డబుల్స్‌లో జ్వాల గుత్తా, అశ్వినీ పొన్నప్ప జోడీ నిష్క్రమించింది. రెండో రౌండ్ మ్యాచ్‌లో వీరు షిజుకా మత్సువో, మమీ నైతో జోడీ చేతిలో 14-21, 17-21 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నారు.

ముగురుజా ముందంజ

ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్

మెల్బోర్న్, జనవరి 21: ప్రపంచ మూడో ర్యాంక్ క్రీడాకారిణి గార్బినే ముగురుజా ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మూడో రౌండ్ చేరింది. కిర్‌స్టెన్ ఫ్లిప్కెన్స్‌ను ఢీకొన్న ముగురుజా 6-4, 6-2 తేడాతో సునాయాసంగా గెలిచింది. ఏడో సీడ్ ఏంజెలిక్ కెర్బర్, 14వ సీడ్ విక్టోరియా అజరెన్కా, 15వ సీడ్ మాడిసన్ కీస్, 20వ సీడ్ అనా ఇవానోవిచ్ కూడా తమతమ రెండో రౌండ్ మ్యాచ్‌లను పూర్తి చేసుకొని మూడో రౌండ్‌కు దూసుకెళ్లారు. కెర్బర్ 6-2, 6-4 స్కోరుతో అలెక్సాండ్రా డల్గెరూను ఓడించింది. డన్టా కొవినిక్‌ను అజరెన్కా 6-1, 6-2 తేడాతో చిత్తుచేసింది. కీస్ 6-7, 6-3, 6-3 తేడాతో యారొస్లావా ష్వెడోవాపై విజయం సాధించింది. ఇవానోవిచ్ 6-3, 6-3 ఆధిక్యంతో క్వాలిఫయర్ అనస్తాసియా సెవత్సొవాను ఓడించింది. మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో జెలెనా జన్కొవిచ్‌పై లారా సిగమండ్ 3-6, 7-6, 6-4 స్కోరుతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఎకతరీన మకోవా 6-4, 6-2 తేడాతో టాట్జానా మరియాపై, తొమ్మిదో సీడ్ కరొలినా ప్లిస్కోవా 7-6, 6-1 ఆధిక్యంతో జూలియా జార్జెస్‌పై విజయాలను సాధించి మూడో రౌండ్ చేరారు.
గ్రాత్‌కు ముర్రే బ్రేక్
బ్రిటిష్ టెన్నిస్ స్టార్, రెండో ర్యాంక్ ఆటగాడు ఆండీ ముర్రే ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో సామ్ గ్రాత్ దూకుడుకు కళ్లెం వేశాడు. అత్యంత వేగంగా సర్వీస్ చేయడంలో గ్రాత్‌ది అగ్రస్థానం. అతను 2012లో గంటకు 263 కిలోమీటర్లు (163 మైళ్లు) వేగంతో సర్వీస్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. చాలా టోర్నీల్లో అతను ఒకరిద్దరు టాప్‌సీడ్స్‌ను ఇంటిదారి పట్టించడం ఆనవాయితీగా మారింది. అయితే, రెండో రౌండ్‌లో ముర్రే అతనికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా, 6-0, 6-4, 6-1 తేడాతో వరుస సెట్లలో చిత్తుచేశాడు. విపరీతంగా పెరిగిన ఉష్ణోగ్రత నుంచి ఉపశమనం పొందడానికి ఐస్ ప్యాక్‌లను ఆశ్రయించిన ముర్రే కోర్టులోకి దిగినప్పుడు ఆ సమస్య తనకు లేదన్న చందంగా ఆడాడు. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యాన్ని కనబరచాడు. నాలుగో సీడ్ ఆటగాడు స్టానిస్లాస్ వావ్రిన్కా 6-2, 6-3, 6-4 తేడాతో రాడెక్ స్టెపానెక్‌పై విజయాన్ని నమోదు చేశాడు. 16వ సీడ్ బెర్నార్డ్ టామిక్ 6-4, 6-2, 6-7, 7-5 స్కోరుతో సిమోన్ బొలెలీపై గెలిచాడు. గేమ్ మోన్ఫిల్ 7-5, 6-4, 6-1 తేడాతో నికొలాస్ మాహుత్‌ను ఓడించాడు. జాన్ ఇస్నర్ 6-3, 7-6, 7-6 తేడాతో మార్కెల్ గ్రానొలెర్స్‌పై విజయం సాధించాడు.