క్రీడాభూమి

ఫామ్‌పై స్టార్ల దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 24: వివిధ అంతర్జాతీయ ఈవెంట్స్‌లో మెరిసిన బాడ్మింటన్ స్టార్లతోపాటు, ఎవరూ ఊహించని విధంగా విఫలమైన వారు కూడా ఫామ్‌పై దృష్టి కేంద్రీకరించారు. ఒకటో తేదీ నుంచి మొదలుకానున్న ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ (పిబిఎల్)లో పోటీ పడేందుకు ఆరు ఫ్రాంచైజీ జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఢిల్లీ ఏసర్స్, ముంబయి రాకెట్స్, అవాధే వారియర్స్, హైదరాబాద్ హంటర్స్, బెంగళూరు బ్లాస్టర్స్, చెన్నై స్మాషర్స్ జట్ల నుంచి ఎంతో మంది ప్రపంచ మేటి స్టార్లంతా ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో మొదటి రోజు జరిగే తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్, చెన్నై స్మాషర్స్ జట్లు ఢీ కొంటాయి. అదే రోజు మరో మ్యాచ్‌లో బెంగళూరు బ్లాస్టర్స్, ఢిల్లీ ఏసర్స్ తలపడతాయి. హైదరాబాద్ జట్టు ప్రపంచ టాప్ సీడ్ కరోలినా మారిన్ ఉండడంతో, ఈ మ్యాచ్‌లపై అభిమానులు ఉత్కంఠ చూపుతున్నారు. చెన్నై స్మాషర్స్ నుంచి రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పివి సింధు బరిలోకి దిగుతున్నది. రియోలో వీరిద్దరూ ఫైనల్‌లో తలపడిన విషయం తెలిసిందే. అక్కడ ఎదుర్కొన్న పరాజయానికి బాడ్మింటన్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన మూడో రౌండ్ రాబిన్ మ్యాచ్‌లో మారిన్‌ను ఓడించి సింధు ప్రతీకారం తీర్చుకుంది. మరోసారి వీరి మధ్య జరిగే సంకుల సమరం అభిమానులను ఉర్రూతలూగించడం ఖాయం. ఇలావుంటే, సునీల్ వర్మ, ఆకర్షి కశ్యప్, అక్షయ్ దివాల్కర్, జ్వాలా గుత్తా, మనీష (్ఢల్లీ ఏసర్స్), అజయ్ జయరామ్, హెచ్‌ఎస్ ప్రణయ్, గుమ్మడి వృషాలీ, చిరాగ్ శెట్టి, మోహిత్ సహదేవ్ (ముంబయి రాకెట్స్), ఆదిత్య జోషి, కిడాంబి శ్రీకాంత్, రితుపర్ణదాస్, సైనా నెహ్వాల్, సావంత్, అమృత్రాపాయ్ సావిత్రి (అవాధే వారియర్స్), సాయి ప్రణీత్, సమీర్ వర్మ, శ్రీకృష్ణ ప్రియ, సాత్విక్ సాయి రాజ్, మేఘన (హైదరాబాద్ హంటర్స్), సౌరభ్ వర్మ, గద్దె రుత్వికా శివానీ, ప్రణవ్ జెర్రీ చోప్రా, అశ్వినీ పొన్నప్ప, సిక్కీ రెడ్డి (బెంగళూరు బ్లాస్టర్స్), పారుపల్లి కశ్యప్, అరుంధతి పంతవానే, పివి సింధు, సుమీత్ రెడ్డి, రమ్య తులసీ (చెన్నై స్మాషర్స్) తమతమ విభాగాల్లో బరిలోకి దిగుతున్నారు. కొత్త సంవత్సరం మొదలైన తర్వాత పలు అంతర్జాతీయ టోర్నీలు జరగనున్న నేపథ్యంలో, ఫామ్‌లోకి రావడానికి, ఫామ్‌ను కొనసాగించడానికి సింధు, సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్, జ్వాలా గుత్తా, అజయ్ జయరామ్, సౌరభ్ వర్మ సిక్కీ రెడ్డి, సుమీత్ రెడ్డి తదితర స్టార్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే, అందరి కళ్లూ సింధు, సైనాపైనే కేంద్రీకృతమయ్యాయన్నది వాస్తవం. కొత్త సంవత్సరంలో ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని అందుకోవడమే తన లక్ష్యమని సింధు ప్రకటించిన తర్వాత భిన్న వాదనలు జోరందుకోవడంతో, వీరి మధ్య పరోక్షంగా ఆధిపత్య పోరాటం మొదలైందనే అనుకోవాల్సి వస్తుంది. సింధుకు నంబర్ వన్‌గా ఎదిగే శక్తిసామర్థ్యాలు ఉన్నాయని, ఆమె అనుకున్నది సాధించి తీరుతుందని బెంగళూరులో అకాడెమీని నిర్వహిస్తున్న ఆల్ ఇంగ్లాండ్ మాజీ చాంపియన్ ప్రకాశ్ పదుకొనే వ్యాఖ్యానించాడు. అయితే, సైనాకు ప్రస్తుతం కోచ్‌గా ఉన్న మాజీ జాతీయ చాంపియన్ విమల్ కుమార్ ఆ వ్యాఖ్యలకు పరోక్షంగా అభ్యంతరం తెలిపాడు. సింధుకు నంబర్ వన్ స్థానాన్ని అందుకునే అవకాశాలు లేకపోలేదని అంటూనే, సైనాను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని అతను స్పష్టం చేశాడు. సింధుకు సైనా నుంచి గట్టిపోటీ తప్పదని హెచ్చరించాడు. ప్రకాశ్ పదుకొనే, విమల్ కుమార్ మధ్య మొదలైన ఈ వాదన ఇప్పుడు ఇరువురు క్రీడాకారిణుల అభిమానుల్లోనూ ఆసక్తిని రేపుతున్నది. ఇద్దరూ హైదరాబాదీలే కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. జాతీయ బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ సొంత అకాడెమీలో సింధు ప్రాక్టీస్ చేస్తున్నది. గోపీచంద్‌తో విభేదించిన సైనా బెంగళూరుకు వెళ్లి, అగక్కడ విమాల్ కుమార్ అకాడెమీలో శిక్షణ తీసుకుంటున్నది. ఈ పరిణామాలు కూడా సింధు, సైనా మధ్య ఆధిపత్య పోరాటం కొనసాగుతున్నదన్న వాదనకు బలాన్నిస్తున్నాయి. మొత్తం మీద పిబిఎల్‌ను భారత బాడ్మింటన్ స్టార్లు రాబోయే టోర్నీలకు ప్రాక్టీస్ ఈవెంట్‌గా మార్చుకుంటున్నారు. పలువురు అంతర్జాతీయ ఆటగాళ్లతో పోటీపడే అవకాశం లభిస్తుండడంతో, తమను తాము నిరూపించుకునే పనిలో పడ్డారు. ఈ ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.

చిత్రాలు..సైనా నెహ్వాల్, పివి సింధు