క్రీడాభూమి

కోటి ఆశల కొత్త ఏడాది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: కొంత మంచి, కొంత చెడు.. కొన్ని విజయాలు, కొన్ని అపజయాలు.. కొన్ని శిఖరాలు, మరికొన్ని వైఫల్యాలు.. మొత్తం మీద గతంతో పోలిస్తే 2016 కొంత వరకు ఫరవాలేదనిపించినా, క్రికెట్, బాడ్మింటన్, టెన్నిస్ వంటి కొన్ని అంశాలను మినహాయిస్తే, మిగతా అన్ని క్రీడల్లోనూ ఎదురైన పరాభవాలు సరికొత్త పాఠాలను నేర్పాయి. కొత్త ఏడాది అంతర్జాతీయ వేదికలపై మెరిసేందుకు భారత క్రీడా రంగం సమాయత్తమవుతున్నది. భవిష్యత్తుపై దాదాపుగా అందరూ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఏకాది కాలంలో తమదైన ముద్రవేసి, సంచలనాలను కొనసాగించేందుకు సిద్ధమవుతున్న స్టార్లు కొద్దిమందే ఉన్నారు. రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన బాడ్మింటన్ క్వీన్ పివి సింధు, రెజ్లర్ సాక్షి మాలిక్, పతకాన్ని కైవసం చేసుకోలేకపోయినా, చివరి వరకూ పోరాటాన్ని కొనసాగించి, కోట్లాది మంది భారతీయుల హృదయాలను గెల్చుకున్న దీపా కర్మాకర్ తదితరులు కొత్త సంవత్సరంలో అద్భుతాలు సృష్టిస్తారని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఈ ఏడాది ప్రపంచ క్రీడా రంగాన్ని శాసించే అవకాశం ఉన్న కొద్ది మంది స్టార్లలో రియో ఒలింపిక్స్‌లో పోరాటం కొనసాగించిన ఈ ముగ్గురూ ఖచ్చితంగా ఉంటారు. పిటి ఉష తర్వాత ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో ఫైనల్ చేరిన తొలి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందిన లలితా బాబర్‌ను ఈ జాబితాలోనే చేర్చవచ్చు. దీప మాదిరిగానే రియోలో ఆమె కూడా పోడియం ఫినిష్ చేయలేకపోయింది. అయితే, 3,000 మీటర్ల స్టీపుల్ చేజ్ విభాగంలో ఫైనల్ చేరడం ద్వారా భవిష్యత్తుపై ఆశలు పెంచింది. బాడ్మింటన్‌లో ఈ ఏడాది సింధు పతకాల పంట పండిస్తుందన్న నమ్మకం చాలా మందికి ఉంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానానికి చేరిన ఆమెపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మోకాలి గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న సైనా నెహ్వాల్ ఏ విధంగా రాణిస్తుందన్నది ఆసక్తి రేపుతున్నది. కిడాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్, పారుపల్లి కశ్యప్ నిలకడగా రాణిస్తారా అన్నది చూడాలి. కాగా, టెన్నిస్ బ్యూటీ సానియా మీర్జా మహిళల డబుల్స్‌లో మళ్లీ గ్రాండ్ శ్లామ్స్‌పై కనే్నసింది. మేజర్ ఈవెంట్స్‌తోపాటు మిగతా డబ్ల్యుటిఎ టోర్నీల్లోనూ పతకాలు సాధించే శక్తిసామర్థ్యాలు సానియాకు పుష్కలంగా ఉన్నాయి. లియాండర్ పేస్, సాకేత్ మైనేనీకి డేవిస్ కప్ జట్టులో స్థానం కల్పించిన అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐఎటిఎ) అధికారులు మరో గొప్ప ఆటగాడు రోహన్ బొపన్నకు మొండి చేయి చూపడం వివాదాస్పదమైంది. ఎఐటిఎపై విమర్శలు జోరందుకున్నాయి. నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా ఆనంద్ అమృత్‌రాజ్ స్థానంలో ఎంపికైన మాజీ ఆటగాడు మహేష్ భూపతి జట్టును ఏం విధంగా తీర్చిదిద్దుతాడో చూడాలి. పేస్‌తో అతనికి ఉన్న విభేదాలు అందరికీ తెలిసినవే. వారిద్దరూ ఎడముఖం పెడముఖంగా ఉంటే, భారత టెన్నిస్ ఏ విధంగా ముందడుకు వేస్తుందనేది ప్రశ్న.
క్రికెట్‌లో ఉన్నత శిఖరాలు
క్రికెట్‌లో భారత్ ఇప్పటికే ఉన్నత శిఖరాలను అధిరోహించింది. టెస్టు ఫార్మాట్‌లో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నది. కొత్త సంవత్సరంలోనూ ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. రవిచంద్రన్ అశ్విన్ అటు బౌలింగ్, ఇటు ఆల్‌రౌండ్ విభాగాల్లో ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించడం గమనార్హం.
కరుణ్ నాయర్ తాను ఆడిన మూడో ఇన్నింగ్స్‌లోనే ట్రిపుల్ సెంచరీతో కదం తొక్కడగా, అతనితోపాటు ఇంగ్లాండ్ సిరీస్‌తోనే టెస్టు క్రికెట్ కెరీర్‌ను ఆరంభించిన జయంత్ యాదవ్ ఆల్‌రౌండర్‌గా నిరూపించుకుంటున్నాడు. హర్యానాకు చెందిన ఈ యువ ఆటగాడు సమర్థుడైన స్పిన్నర్‌గా నిరూపించుకుంటూ పది వికెట్లు కూల్చాడు. బ్యాటింగ్‌లోనూ రాణించి, ఒక అర్ధ శతకాన్ని సాధించాడు. భారత్‌కు ఒక సమర్థుడైన ఆల్‌రౌండర్ దొరికాడని క్రీడా పండితులు అంటున్నారు. కొత్త సంవత్సరంలో అతను పరిపూర్ణమైన ఆల్‌రౌండర్‌గా ఎదిగే అవకాశాలున్నాయి.
భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) లోధా కమిటీ సిఫార్సులు అమలు చేసేలా సుప్రీం కోర్టు మూడో తేదీన తీర్పునిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో కొత్త సంవత్సరంలో భారీ మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. క్రికెట్ పాలనా వ్యవహారాలు కూడా ఒక గాడిలో పడితే, ఇంతకాలం బోర్డుపై ఉన్న విమర్శలు కొంత వరకైనా తొలుగుతాయి.
గురి కుదురుతుందా?
రియో ఒలింపిక్స్‌లో దారుణంగా విఫలమైన భారత షూటర్లు కొత్త ఏడాదిలో తమదైన శైలిలో రాణిస్తారా? మళ్లీ పూర్వ వైభవాన్ని సంపాదిస్తారా? అన్న ప్రశ్నలు ఆసక్తిని రేపుతున్నాయి. అభినవ్ బింద్రా పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో నాలుగో స్థానంలో నిలవడం తప్ప రియో ఒలింపిక్స్‌లో షూటర్లు సాధించింది ఏమీ లేదు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన పివి సింధు, సాక్షి మాలిక్, పోడియం ఫినిష్ చేయలేకపోయినా, చివరి వరకూ గట్టిపోటీనిచ్చిన దీపా కర్మాకర్‌లకు క్రీడా రంగంలో దేశ అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్ రత్న లభించడంపై ఎవరికీ అభ్యంతరాలు లేవు. కానీ, ఎలాంటి ప్రత్యేకతలూ లేని షూటర్ జీతూ రాయ్ కూడా వారితోపాటు ఖేల్ రత్న అవార్డును స్వీకరించడం విమర్శలకు కారణమైంది. కొత్త ఏడాదిలోనైనా అతను చిరస్మరణీయ విజయాలను సాధించాలి. లేకపోతే, విమర్శలకు బలాన్నిచ్చినవాడవుతాడు. వైఫల్యాలతో అల్లాడుతున్న మిగతా షూటర్లు ఎంత వరకూ కుదుటపడారో చూడాలి.
పట్టు దొరుకుతుందా?
రియోలో పతకాల పంట పండిస్తారనుకున్న స్టార్ రెజ్లర్లు మట్టి కరిచారు. ఎవరూ ఊహించని విధంగా సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని సాధించి కొంత వరకైనా పరువు నిలిపింది. సుశీల్ కుమార్, నర్సింగ్ యాదవ్ ఉదంతం ఒలింపిక్స్‌కు ముందే భారత రెజ్లింగ్ పరువును బజారుకీడ్చింది. ఒలంపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తనకే రియో వెళ్లే అవకాశం దక్కాలని సుశీల్ వాదిస్తే, లండన్ ఒలింపిక్స్ తర్వాత అతను కీలక టోర్నీల్లో పాల్గొనలేదని భారత రెజ్లింగ్ సమాఖ్య స్పష్టం చేసింది. అతను బరిలోకి దిగకపోవడంతో, భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన నర్సింగ్ యాదవ్‌కు అవకాశం దక్కడం సమంజసమని తేల్చిచెప్పింది. రియో ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకునేందుకు సుశీల్ చేయని ప్రయత్నం లేదు. ప్రధానిసహా నేతలకు విజ్ఞప్తులు చేసిన అతను చివరికి కోర్టును కూడా ఆశ్రయించాడు. కానీ, అంతటా చుక్కెదురే అయింది. అయితే, సుశీల్‌ను కాదని ఎంపిక చేసిన నర్సింగ్ డోప్ కేసులో చిక్కుకోవడంతో రెజ్లింగ్ పరువు మంట కలిసింది. తాను తాగే నీటిలో ఎవరూ డ్రగ్స్‌ను కలిపి ఉంటారన్న నర్సింగ్ వాదనను ఎవరూ అంగీకరించలేదు. చివరికి రియో వెళ్లే అవకాశమే అతనికి లభించలేదు. లండన్ ఒలింపిక్స్ పతక గ్రహీత యోగేశ్వర్ దత్ గట్టిపోటీ ఇవ్వలేకపోయాడు. మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్ మోకాలి గాయంతో అల్లాడింది. కారణాలు ఏవైనప్పటికీ, రియో వైఫల్యాలు భారత రెజ్లింగ్‌ను అభిమానుల ముందు దోషిగా నిలబెట్టాయి. ఎవరు ఒలింపిక్స్‌కు వెళ్లాలనే విషయంపై సుశీల్, నర్సింగ్ మధ్య కొనసాగిన హైడ్రామా రెజ్లింగ్ ప్రతిష్టను దెబ్బతీసింది. ఇక నర్సింగ్ డోప్ పరీక్షలో పట్టుబడడం పరువును బజారుకెక్కించింది. ఈ సంఘటనలు నేర్పిన పాఠాలను గుర్తుచేసుకుంటూ కొత్త సంవత్సరంలోనైనా రెజ్లర్లు పట్టు దొరికించుకుంటారా లేక మళ్లీ పాత దారిలోనే వెళతారా అన్నది కాలమే నిర్ధారించాలి.

చిత్రం,,, ఆసియా చాంపియన్స్ ట్రోఫీతో భారత సీనియర్స్ హాకీ జట్టు

ఫీల్డ్ హాకీకి
పూర్వ వైభవం!
న్యూఢిల్లీ: ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన భారత హాకీ పూర్వ వైభవాన్ని సంపాదిస్తుందా? కొత్త సంవత్సరంలో ఉన్నత ప్రమాణాలతో రాణిస్తుందా? అంతర్జాతీయ సిరీస్‌లు, టోర్నీల్లో అదరగొడుతుందా? గత ఏడాది కాలంలో ఒక్కో మెట్టు ఎదుగుతూ, రోజురోజుకూ బలోపేతమవుతున్న భారత హాకీ జట్లను చూస్తుంటే, ఈ ప్రశ్నలకు అవునని సమాధానం చెప్పక తప్పదు. మహిళల జట్టు 32 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించడం, పురుషుల జట్టు చాంపియన్స్ ట్రోఫీలో రజతాన్ని, ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో స్వర్ణ పతకాన్ని గెల్చుకోవడం, జూనియర్ జట్టు ఏకంగా ప్రపంచ కప్‌నే కైవసం చేసుకోవడం భారత్ హాకీ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనేది చెప్పకనే చెప్తున్నాయి. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) అధ్యక్షుడిగా నరీంద్ర బాత్రా ఎన్నిక కావడం కూడా భారత హాకీకి కలిసొచ్చే అంశంగా పేర్కోవాలి. దేశంలో హాకీ అభివృద్ధికి అతను బాటలు వేస్తాడని అభిమానులు ఆశించడంలో తప్పులేదు. శాఫ్ గేమ్స్ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలై, రెండో స్థానానికి పరిమితం కావడం, రియో ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్స్ స్థాయి నుంచే వెనుదిరగడం వంటి కొన్ని వైఫల్యాలు బాధించినప్పటికీ మొత్తం మీద ఎన్నో విజయాలు, అందుకున్న ఉన్నత ప్రమాణాలు శుభసూచకాలు. ఒక్క మాటలో చెప్పాలంటే, గతంలో ఎన్నడూ లేని రీతిలో భారత హాకీ పుంజుకుంది. కొత్త సంవత్సరంలో మరింతగా రాణించి, పూర్వ వైభవాన్ని సంతరించుకునే దిశగా దూసుకెళుతున్నది.

లక్నోలో జరిగిన జూనియర్ హాకీ వరల్డ్ కప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టు