క్రీడాభూమి

సిరీస్‌పై భారత్ కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 28: ఆస్ట్రేలియా చేతిలో వనే్డ సిరీస్‌ను కోల్పోయిన భారత క్రికెట్ జట్టు టి-20 సిరీస్‌పై కనే్నసింది. మొదటి మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో విజయం సాధించిన మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని టీమిండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌పై 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. శుక్రవారం జరిగే రెండో టి-20లోనూ గెలిస్తే సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఈ మ్యాచ్‌ని సొంతం చేసుకొని, సిరీస్‌ను ఖాతాలో వేసుకున్న తర్వాత, ఆదివారం సిడ్నీలో జరిగే చివరి, మూడో టి-20లో ప్రయోగాలు చేసే అవకాశం ఉంటుందని టీమిండియా అభిప్రాయం. అంతేగాక, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, తాజాగా ఆస్ట్రేలియా చేతిలో వనే్డ సిరీస్‌లను చేజార్చుకున్న కారణంగా అన్ని వైపుల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలు, ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి కూడా ఇదే మంచి మార్గమని ధోనీ నమ్ముతున్నాడు. అందుకే, ఎట్టి పరిస్థితుల్లోనూ శుక్రవారం నాటి మ్యాచ్‌లో గెలవాలన్న పట్టుదలతో ఉన్నాడు.
జట్టు కూర్పుపై ఆసక్తి
రెండో టి-20 మ్యాచ్‌కి తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. మొదటి మ్యాచ్‌లో ఆడిన జట్టును ధోనీ యథాతథంగా దించుతాడా లేక ఒకటిరెండు మార్పులు చేస్తాడా అన్నది చూడాలి. ఇటీవల కాలంలో రాణించలేకపోతున్న శిఖర్ ధావన్‌ను ఓపెనర్‌గా కొనసాగించడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. అయితే, ఒక మ్యాచ్‌లో గెలిచిన తర్వాత, అత్యవసర పరిస్థితుల్లో తప్ప అదే జట్టును కొనసాగించడం ధోనీకి అలవాటు. మార్పులను వ్యతిరేకించే అతను ధావన్‌ను తప్పించే సాహసం చేస్తాడా అన్నది అనుమానమే. పైగా ఆజింక్య రహానే గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఫలితంగా ధావన్‌ను తప్పించడం అతనికి కుదరకపోవచ్చు. మిగతా ఆటగాళ్లలో ప్రత్యేకించి తప్పించాల్సిన వారు ఎవరూ కనిపించడం లేదు. జడేజా పట్ల ధోనీ కొంత అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసినప్పటికీ, ఆల్‌రౌండర్ స్లాట్‌కు అతనిని మించిన వారు జట్టులో లేరన్నది వాస్తవం. జస్‌ప్రీత్ బుమ్రా తన తొలి మ్యాచ్‌లోనే చక్కటిప్రతిభ కనబరచి 23 పరుగులకే మూడు వికెట్లు పడగొట్టాడు. మరో యువ బౌలర్ హార్దిక్ పాండ్య 37 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించాడు. జడేజా 21 పరుగులకు రెండు వికెట్లు కూల్చాడు. బ్యాట్స్‌మెన్ మెరుగైన ప్రదర్శనతో రాణించినప్పటికీ బౌలర్ల వైఫల్యం కారణంగా టీమిండియా పరాజయాలను చవిచూడడం చాలా సందర్భాల్లో వేధిస్తున్న సమస్య. అయితే, మొదటి టి-20లో బ్యాట్స్‌మెన్‌తోపాటు బౌలర్లు కూడా విశేషంగా శ్రమించారు. హార్ట్ హిట్టింగ్‌కు మారుపేరైన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌కు కళ్లెం వేయగలిగారు. ఎవరిని తప్పించాలి? ఎవరికి అవకాశం ఇవ్వాలి అన్నది తేల్చుకోవడం ధోనీకి సులభం కాదు. అందుకే తుది జట్టు కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బహుశా మార్పు లేకుండానే బరిలోకి దిగే అవకాశముంది.
ఆస్ట్రేలియాపై ఒత్తిడి
వనే్డ సిరీస్‌ను గెల్చుకున్న తర్వాత టి-20 సిరీస్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలన్న ఆస్ట్రేలియా ఆశలకు తొలి మ్యాచ్‌లో టీమిండియా గండి కొట్టింది. శుక్రవారం నాటి మ్యాచ్‌లో గెలిస్తేనే, సిరీస్‌పై ఆశలు సజీవంగా నిలుస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాల్సిన పరిస్థితుల్లో బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియాపై ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఆరోన్ ఫించ్ నాయకత్వంలో ఆడుతున్న ఆసీస్ జట్టులో డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, షాన్ మార్ష్, జేమ్స్ ఫాల్క్‌నెర్, మాథ్యూ వేడ్ వంటి మేటి ఆటగాళ్లు ఉన్నారు. వేగంగా పరుగులు రాబట్టి, త్వరగా మ్యాచ్‌ని ముగించాలన్న తొందరలో ప్రతి ఒక్కరూ ఊహించని పొరపాట్లు చేసి ఓటమిని కొనితెచ్చుకున్నారు. మళ్లీ అదే పొరపాటు జరగకుండా జాగ్రత్త పడితే, శుక్రవారం నాటి మ్యాచ్‌లో గట్టిపోటీనివ్వడం ఖాయం. భారత్‌పై విజయమే లక్ష్యంగా ఆసీస్ బరిలోకి దిగనుంది.
భారత కాలమానం ప్రకారం మ్యాచ్ శుక్రవారం మధ్యాహ్నం 2.10 గంటలకు మొదలవుతుంది.

వచ్చేనెల 27న పాక్‌తో భారత్ మ్యాచ్
ఢాకా, జనవరి 28: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ వచ్చేనెల 27న ఆసియా కప్ పోటీల్లో భాగంగా జరిగే మ్యాచ్‌లో తలపడనున్నాయి. టి-20 ఫార్మెట్‌లో జరిగే ఈ టోర్నీలో మొదటి మ్యాచ్ ఫిబ్రవరి 24న భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతుంది. మార్చి 1న శ్రీలంకను ఎదుర్కోనున్న టీమిండియా 3వ తేదీన క్వాలిఫై జట్టుతో తలపడుతుంది.
పాకిస్తాన్, న్యూజిలాండ్ రెండో వనే్డ రద్దు
నాపీర్, జనవరి 28: పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య గురువారం జరగాల్సిన రెండో వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయింది. ఒక్క బంతి కూడా బౌల్ కాకుండానే మ్యాచ్‌ని రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. పలుమార్లు పిచ్‌ని పరిశీలించిన అనంతరం, వాతావరణం, అవుట్‌ఫీల్డ్ ఆటకు అనుకూలంగా లేదని నిర్ణయించారు. ఈ రెండు జట్ల మధ్య చివరిదైన మూడో వనే్డ ఆక్లాండ్‌లో ఆదివారం జరుగుతుంది.
పునరావృతమైతే చర్య తప్పదు
హార్దిక్ తీరును తప్పుపట్టిన ఐసిసి
మెల్బోర్న్, జనవరి 28: నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన భారత యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) హెచ్చరించింది. మరోసారి అలాంటి సంఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఆస్ట్రేలియాతో ఆడెలైడ్‌లో జరిగిన మొదటి టి-20 మ్యాచ్‌లో క్రిస్ లిన్ వికెట్‌ను పడగొట్టినప్పుడు హార్దిక్ విపరీతంగా స్పందించాడు. అతనికి చాలా సమీపంలోకి వెళ్లి, గంతులు పెట్టాడు. వాగ్వాదానికి దారితీసే విధంగా ప్రవర్తించాడంటూ అంపైర్లు చేసిన ఫిర్యాదును పరిశీలించిన ఐసిసి మొదటి నేరంగా పేర్కొంటూ హార్దిక్‌ను హెచ్చరికతో విడిచిపెట్టింది.

సయ్యద్ మోదీ బాడ్మింటన్
సింధు అవుట్
లక్నో, జనవరి 28: సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రీ గోల్డ్ బాడ్మింటన్ టోర్నమెంట్ నుంచి తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పివి సింధు ఓటమిపాలై వెనుదిరిగింది. తాజగా ప్రకటించిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 11వ స్థానానికి చేరిన ఆమె రెండో రౌండ్‌లో నిచావొన్ జిందాపొల్ చేతిలో 21-18, 24-26, 17-21 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొని నిష్క్రమించింది. కాగా, పురుషుల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ పారుపల్లి కశ్యప్, కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్ చేరారు. కశ్యప్ 21-19, 21-10 స్కోరుతో చైనాకు చెందిన జూ సియువాన్‌పై గెలిచాడు. శ్రీకాంత్ 21-9, 21-12 తేడాతో కేవలం 32 నిమిషాల్లోనే తన ప్రత్యర్థి జుల్కర్‌మైన్ జైనుద్దీన్‌ను చిత్తుచేసి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. మహిళల డబుల్స్ విభాగంలో జ్వాల గుత్తా, అశ్వినీ పొన్నప్ప మన దేశానికే చెందిన నింగ్‌షి బ్లాక్ హజారికా, హారిక వెలుదుర్తి జోడీని 21-9, 21-10 తేడాతో ఓడించి ముందంజ వేసింది. పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో ప్రణవ్ జెర్రీ చోప్రా, ఆకాష్ దివాల్కర్ 21-13, 21-14 ఆధిక్యంతో అగ్గా ప్రతమా, రికీ కరాండా సువార్డీ జోడీపై గెలిచింది.
పాక్‌లో కోహ్లీ అభిమానికి
పదేళ్ల జైలు!
లాహోర్, జనవరి 28: భారత్ పట్ల ఉన్న వ్యతిరేకతను పాకిస్తాన్ మరోసారి ప్రదర్శించింది. భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమాని ఉమర్ ద్రాజ్‌ను అరెస్టు చేసి కటకటల వెనక్కి నెట్టింది. అతనిపై పోలీసులు దేశద్రోహం కేసును నమోదు చేశారు. కోర్టులో విచారణ జరిగిన తర్వాత అతనికి పదేళ్ల జైలు శిక్ష ఖాయమని అధికారులు అంటున్నారు. ఈనెల 26వ తేదీన ఆస్ట్రేలియాతో జరిగిన టి-20 మ్యాచ్‌లో భారత్ విజయభేరి మోగించగా, కోహ్లీ 90 పరుగులతో రాణించాడు. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడమే ద్రాజ్ చేసిన నేరం. త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశాడని, తన ఇంట్లోని గదిలో కోహ్లీ ఫొటోలు పెట్టుకున్నాడని పోలీసులు అతనిని అరెస్టు చేశారు. భారత పతకాన్ని ఎగరేయడం దేశ ద్రోహం కిందకు వస్తుందని అధికారులు అంటున్నారు. దర్జీ వృత్తిలో ఉన్న ద్రాజ్‌కు కోర్టులో చుట్టూ తిరిగి, న్యాయవాదులను నియమించుకొని కేసును సవాలు చేసే ఆర్థిక స్థోమత లేదు. ఫలితంగా అతనికి జైలు శిక్ష తప్పదన్న అధికారుల మాటే నిజమయ్యేటట్టు కనిపిస్తున్నది.

గురితప్పిన విజయ్
న్యూఢిల్లీ, జవరి 28: లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకున్న షూటర్ విజయ్ కుమార్ ఈఏడాది రియో డి జెనీరోలో జరిగే ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించలేకపోయాడు. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ పోటీల్లో పాల్గొన్న అతను 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టోల్ ఈవెంట్ ఫైనల్‌లో విఫలమయ్యాడు.
కైనన్ క్వాలిఫై
కైనన్ చెనాయ్ అనూహ్యంగా ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యాడు. పురుషుల ట్రాప్ ఈవెంట్‌లో అతను అద్భుత ప్రదర్శనతో రాణించి, ఒలింపిక్స్‌కు అర్హత పొందాడు.
కెరీర్‌కు ఫర్హత్ గుడ్‌బై
కరాచీ, జనవరి 28: పాకిస్తాన్ ఓపెనర్ ఇమ్రాన్ ఫర్హత్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. దుబాయ్‌లో ప్రారంభం కానున్న మాస్టర్స్ చాంపియన్స్ లీగ్ (ఎంసిఎల్)లో పాల్గొనాలని అతను నిర్ణయించుకున్నాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ ఫర్హత్ తన కెరీర్‌లో పాకిస్తాన్ తరఫున 40 టెస్టులు, 58 వనే్డలు, ఏడు టి-20 ఇంటర్నేషనల్స్ ఆడాడు.